వేసవిలో వివిధ ప్రాంతాలకు వెళ్లి తిరిగి వచ్చే వారితో ట్రైన్స్ కిక్కిరిసిపోయి ఉన్నాయి. ఏ ట్రైన్ బుకింగ్స్ చూసిన వెయిటింగ్‌ లిస్ట్ చాంతాడంత కనిపిస్తోంది. అకస్మాత్తుగా ప్రయాణాలు పెట్టుకున్న వారికి బెర్త్‌లు దొరకడం చాలా కష్టంగా మారింది. కరోనా కారణంగా రద్దైన కొన్ని ట్రైన్స్ తిరగడం లేదు. ఇవన్నీ ప్రయాణికులకు చుక్కలు చూపిస్తున్నాయి. 


ప్రయాణికుల సమస్యలను దృష్టి పెట్టుకున్న రైల్వే శాఖ ఉపశమనం కలిగించింది. ప్రయాణికుల నుంచి వచ్చిన విజ్ఞప్తులను పరిశీలించి ప్రస్తుతం నడుస్తున్న ట్రైన్స్‌కు అదనపు బోగీలు అమరుస్తున్నట్టు పేర్కొంది. 


ఆయా మార్గాల్లో రద్దీగా ఉండే కాలాన్ని గుర్తించి కొన్ని ట్రైన్స్‌కు ఈ అదనపు బోగీలను అమర్చనుంది. సుమారు నెల రోజుల పాటు సుమారు 20 వరకు ట్రైన్స్‌కు ఈ అదనపు బోగిలు అమర్చి నడపనుంది. 



ఈ మధ్య కాలంలోనే సౌత్‌సెంట్రల్ రైల్వే స్పెషల్ ట్రైన్స్‌ కూడా ప్రకటించింది. ఏపీ, తెలంగాణ మధ్య ప్రయాణించే రైలు ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే స్పెషల్ ట్రైన్స్ లను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్ - జైపూర్ మధ్య కూడా ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. మొత్తం 97 స్పెషల్ ట్రైన్ సర్వీసులను అందుబాటులోకి తీసుకువస్తున్నట్లు జూన్ 23న ప్రకటించింది సౌత్‌ సెంట్రల్ రైల్వే. 


కోరనా కాలంలో గత రెండేళ్లుగా ఎలాంటి ప్రయాణాలు పెట్టుకోని ప్రయాణికులు ఈ మధ్య కాలంలో ప్రయాణాలు సంఖ్య పెంచుతున్నారు. కరోనా వ్యాప్తి తగ్గిన తర్వాత ట్రైన్స్ జర్నీలు కూడా ఎక్కువయ్యాయి. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ... రైల్వే శాఖ కూడా దానికి సరిపడా ఫెసిలిటీస్‌ కల్పిస్తోంది.