Medchal Crime News: హైదరాబాద్ శివారులోని మేడ్చల్‌లోని బుధవారం కలకలం రేగింది. గోరక్షాదళ్ సభ్యుడు సోనూ సింగ్‌పై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. చాలా కాలంగా ఆవుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నాడనే కారణంతో ఆయనపై కాల్పులకు తెగబడినట్టు పోలీసుల విచారణలో తేలింది. ఈ కేసులో ఇప్పటికే ముగ్గుర్ని అరెస్టు చేసిన పోలీసులు పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే ఆ వ్యక్తిని కూడా అరెస్టు చేస్తామని చెప్పారు.
కీసర మండలం రాంపల్లికి చెందిన సోనూ సింగ్ అలియాస్ ప్రశాంత్ గోరక్షాదళ్ సభ్యుడిగా ఉన్నాడు. చాలా కాలంగా ఆవుల అక్రమ రవాణాను అడ్డుకుంటున్నారు. ఇది నచ్చని కొందరు వ్యక్తులు సోనూ సింగ్‌పై కక్ష కట్టారు. అందుకే ఆయన్ని బుధవారం ఫాలో అయ్యారు. ఇంటి నుంచి బయల్దేరినప్పటి నుంచి కారును వెంబడించారు. ఆయన ఘట్‌కేసర్‌కు వస్తున్న టైంలోనే అటాక్ చేశారు. ఆయనపై దాడి ప్లాన్‌ను బహుదూర్‌పురాకు చెందిన ఇబ్రహిం, అజ్జూ, శ్రీనివాస్ వేశారు. ఖురేసీ పరారీలో ఉన్నాడు.
సోనూ సింగ్ కారు యంనంపేట వద్దకు రాగానే కావాలనే ఇబ్రహిం గొడవ పెట్టుకున్నాడు. అప్పటికే ప్లాన్‌తో ఉన్న వాళ్లు తాము తెచ్చుకున్న గన్‌తో ఫైర్ చేశారు. రెండు రౌండ్లు కాల్పులు జరపగా ఒక బులెట్ సోనూసింగ్ పక్కటెముకల్లోకి దూసుకెళ్లింది. ఆయనపై కాల్పులు జరిపిన వెంటనే నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు.
గాయాలతో ఉన్న సోనూ సింగ్‌ను స్థానికులు మేడిపల్లిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం అక్కడ నుంచి సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు సర్జరీ చేసి బులెట్‌ను బయటకు తీశారు. పలువురు బీజేపీ నేతలు ఆయన్ని పరామర్శించారు.