YS Sharmila : రోజూ 13 పేపర్లు చదివే చిన్న దొరకు రైతు ఆత్మహత్య వార్త కంటికి కనిపించలేదా? అని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ప్రశ్నించారు. నెల రోజుల నుంచి కామారెడ్డి పట్టణ రైతులు ఆందోళన చేస్తుంటే మున్సిపల్ మంత్రి కేటీఆర్ కు ఒక్క పేపర్లో వార్త దొరకలేదా? అని మండిపడ్డారు. ఒక రైతు ప్రాణాలు విడిస్తే తప్ప కేసీఆర్ సర్కారు స్పందించదా? అని నిలదీశారు. ఇండస్ట్రీయల్ జోన్ కు పచ్చటి భూములే దొరికాయా? దిక్కుమాలిన నిర్ణయాలతో రైతులను బలి చేస్తారా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకెంత మంది చనిపోతే మీ కండ్లు చల్లబడుతాయని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ జరగాలని, రైతులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు. ఒక్క రైతుకు అన్యాయం జరిగినా ఊరుకునేది లేదని వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు.
మాస్టర్ ప్లాన్ పై రైతుల ఆందోళన
కామారెడ్డి జిల్లా ఏర్పడిన తర్వాత కామారెడ్డి పట్టణం ప్రజల అవసరాల దృష్ట్యా అధికారులు కొత్త మాస్టర్ ప్లాన్ రూపకల్పన చేశారు. కామారెడ్డి పట్టణ పరిధిలో మౌలిక వసతుల కల్పన వ్యాపార, వాణిజ్య సంబంధాలు మెరుగుపరచాలనే ఉద్దేశంతో పాత మాస్టర్ ప్లాన్ లో మార్పులు చేశారు. అయితే కొన్ని విలీన గ్రామాలకు చెందిన వ్యవసాయ సాగు భూములు ఇండస్ట్రీయల్, గ్రీన్ జోన్లోకి మార్చడంపై రైతులు అభ్యంతరాలు వ్యక్తం వ్యక్తం చేస్తున్నారు. మొదట్లో కొద్దిమంది రైతులు ఆందోళ నకు దిగారు. అధికారులు, అధికార పార్టీ నాయకుల నుంచి ఎటువంటి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆందోళన బాట పట్టారు. రైతులకు బీజీపీ నాయకులు మద్దతుగా నిలిచారు. రైతులు నిత్యం వినూత్న రీతిలో ఆందోళనలు చేస్తున్నారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని టేక్రియాల్, ఇచ్చిపూర్, అడ్లూర్, ఎల్లారెడ్డి నియోజకవర్గంలోని అడ్లూర్, ఎల్లారెడ్డి గ్రామాల రైతులు ఆందోళన బాట పట్టారు. రెండు పంటలు సాగు చేసుకుంటున్న రైతుల భూములను ఇండస్ట్రీయల్, గ్రీన్ జోన్లుగా ఏర్పాటు చేయడంతో ప్రతిపక్షాల నుంచి విమర్శలు వస్తున్నాయ్. రాజకీయ నాయకుల స్వలాభం కోసం మాస్టర్ ప్లాన్ రూపొందించారంటూ రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కామారెడ్డి పట్టణ పరిధిలోని అడ్లూర్, ఇచ్చిపూర్, టేక్రియాల్, అడ్లూర్, ఎల్లారెడ్డి గ్రామాలు ఉన్నాయి.
రాజకీయ పార్టీల మద్దతు
కామారెడ్డిలో మాస్టర్ ప్లాన్ మంటలు తీవ్రమయ్యాయి. రైతుల బంద్‌కు మద్దతుగా కాంగ్రెస్ నేతలు రంగంలోకి దిగారు. ఆ పార్టీ సీనియర్ లీడర్ షబ్బీర్ అలీ రైతులతో కలిసి ధర్నాల్లో పాల్గొన్నారు. కామారెడ్డి జిల్లా కలెక్టరేట్ ముట్టడికి కూడా నేతలు, రైతులు యత్నించారు. ఈ సందర్భంగా తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. రైతులను, నేతలను అడ్డుకున్న పోలీసులతో ఆందోళనకారులు వాగ్వాదానికి దిగారు. ఇరు వర్గాల మధ్య కాసేపు తోపులాట జరిగింది. ధర్నాను అణచివేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ మండిపడ్డారు. రైతులకు మద్దతు ఇస్తున్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు కూడా కామారెడ్డి వస్తారని తెలిపారు. ఈ రైతుల ఆగ్రహాన్ని తట్టుకోలేమని గ్రహించిన ప్రభుత్వం ఉదయం నుంచి అరెస్టుల పర్వం కొనసాగించిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని హర్డిల్స్ దాటుకొని మూడు వాహనాలు మారుతూ తాను కామారెడ్డి చేరుకున్నట్టు షబ్బీర్ అలీ తెలిపారు.