Mlas Poaching Case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక పరిణామం చేసుకుంది. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు విచారణ వేగవంతం చేశారు. ప్రధాన నిందితులను విచారిస్తున్న సిట్ ఈ కేసులో సంబంధం ఉన్న పలువురికి నోటీసులు ఇస్తుంది. తాజాగా బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ కు నోటీసులు ఇచ్చింది. ఈ నెల 21 సిట్ ముందు హాజరవ్వాలని కోరింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో ప్రధాన నిందితులు రామచంద్రభారతి, సింహయాజీకి బండి సంజయ్ అనుచరుడు శ్రీనివాస్ ఫ్లైట్ టికెట్లు బుక్ చేశారని సిట్ ఆరోపిస్తుంది. దీంతో శ్రీనివాస్ ను విచారించాలని అధికారులను నిర్ణయించుకున్నారు. విచారణకు హాజరవ్వాలని శ్రీనివాస్ కు గురువారం నోటీసులు ఇచ్చారు. హైకోర్టు ఆదేశాలతో విచారణ చేపట్టిన సిట్ అధికారులు ఫామ్ హౌస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో దర్యాప్తు చేపట్టింది. ఈ కేసును సీబీఐకి అప్పగించాలని బీజేపీ నేతలు హైకోర్టును ఆశ్రయించగా, అందుకు కోర్టు నిరాకరించింది.

  


మాస్టర్ మైండ్ తుషార్ కు నోటీసులు


టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు ప్రయత్నించారని నమోదైన కేసులో కేరళకు చెందిన తుషార్ కు  తెలంగాణ సర్కార్ ఏర్పాటు చేసిన స్సెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ నోటీసులు జారీ చేసింది. 21వ తేదీన హైదరాబాద్‌లో సిట్ టీమ్ ఎదుట హాజరు కావాలని ఆదేశాలు జారీ చేసింది. తుషార్ కేరళకు చెందిన రాజకీయ నాయకుడు. బీజేపీ పెద్దలతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉన్నారని చెబుతున్నారు. గత ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా వయనాడ్ నుంచి రాహుల్ గాంధీ మీద పోటీ చేసి పరాజయం పాలయ్యారు. అయితే బీజేపీలో అధికారికంగా సభ్యుడు కాదు. ఆయనకు ప్రత్యేకంగా ఓ హిందూ వేదిక ఉంది. తుషార్ ద్వారానే ఎమ్మెల్యేల కొనుగోలుకు ప్రయత్నించారని సిట్ భావిస్తోంది. 


పలు రాష్ట్రాల్లో సిట్ దర్యాప్తు 


మునుగోడు ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు సంచలనమైంది. బీజేపీ కేంద్ర పెద్దల పేర్లు ప్రస్తావిస్తూ ముగ్గురు వ్యక్తులు టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఒక్కొక్కరికి రూ.100 కోట్లు ఆఫర్ ఇచ్చి పార్టీ మారాలని కోరారు. ఈ వీడియోలు, ఆడియోలను టీఆర్ఎస్ పార్టీ మీడియాకు విడుదల చేసింది. ఈ వ్యవహారంలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి కీలకంగా వ్యవహరించారు. బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఫైట్ పీక్స్ దశకు చేరుకున్న నేపథ్యంలో ఈ కేసు వెలుగుచూసింది. అయితే ఆ ముగ్గురితో తమకు సంబంధంలేదని బీజేపీ నేతలు వాధిస్తున్నారు. బండి సంజయ్ అయితే యాదాద్రి ఆలయంలో తడిబట్టలతో ప్రమాణం చేశారు. కానీ బీజేపీకి చెందిన నేతలు ఈ కేసు విచారణపై స్టే విధించాలని హైకోర్టును ఆశ్రయించారు. అలాగే కేసును కేంద్ర దర్యాప్తు సంస్థలకు బదిలీ చేయాలని పిటిషన్లు వేశారు. అయితే కోర్టు బీజేపీకి ప్రతికూలంగా తీర్పు ఇచ్చింది. రాష్ట్ర పోలీసులకు దర్యాప్తు బాధ్యత అప్పగించింది. ఈ కేసులో దర్యాప్తు చేపట్టిన సిటి అధికారులు పలు కర్ణాటక, కేరళ, ఏపీతో సహా పలు రాష్ట్రాల్లో సోదాలు నిర్వహించింది. తాజాగా ఈ కేసుతో సంబంధం ఉన్న పలువురికి నోటీసులు ఇచ్చింది. 


కేంద్ర సోదాలు వర్సెస్ రాష్ట్ర సోదాలు 


తెలంగాణలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ ఫైట్ కొనసాగుతోంది. టీఆర్ఎస్ ముఖ్యనేతలపై ఈడీ అధికారులు వరుస దాడులు చేస్తున్నారు. క్యాసినో కేసులు మంత్రి తలసాని సోదరులను ఈడీ విచారిస్తుంది. అలాగే ఎమ్మెల్సీ రమణ కూడా ఈడీ విచారణకు హాజరయ్యారు. దిల్లీ లిక్కర్ కేసులో ఈడీ, సీబీఐ స్పీడ్ పెంచాయి. ఈ కేసులో సంబంధం ఉన్న పలువురిని ఇప్పటికే సీబీఐ అదుపులోకి తీసుకుంది. మీకే కాదు మాకు దర్యాప్తు సంస్థలు ఉన్నాయని ఇటీవల సీఎం కేసీఆర్ స్పష్టం చేసిన తరుణంలో రాష్ట్ర జీఎస్టీ అధికారులు బీజేపీ నేతలకు సంబంధించిన సంస్థలపై వరుస దాడులు చేస్తున్నారు. బీజేపీ నేత కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కుటుంబానికి చెందిన సుశీ ఇన్ ఫ్రా సంస్థలో స్టేట్ సర్వీస్ ట్యాక్స్ అధికారులు సోదాలుచేశారు. పలు ల్యాప్ టాప్ లు, కంప్యూటర్లు స్వాధీనం చేసుకున్నారు.