Revanath Reddy :  సీఎం కేసీఆర్ మోదీకే గురువుని ఇద్దరి వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు అని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి విమర్శించారు. సీఎం కేసీఆర్ కు వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. సీఎం కేసీఆర్ ‎ను దుర్యోధనుడు ఆవహించినట్టు ఉన్నాడని ఎద్దేవా చేశారు. అందుకే నిన్న ప్రెస్ మీట్ లో ఏకపాత్రాభినయం చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయని, ఈ సమయంలో ఏ ప్రభుత్వం అయినా సహాయక చర్యలు చేపడుతోందని, కానీ సీఎం కేసీఆర్ ఈ విషయాన్ని గాలికొదిలేసి రాజకీయాలు చేస్తున్నారని రేవంత్ రెడ్డి విమర్శించారు. 


ఏక్ నాథ్ శిందేలను తయారు చేసింది కేసీఆర్?


సీఎం కేసీఆర్‌ మాటల్లో వింతేమీ లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు. కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాల ప్రకారమే అలా మాట్లాడారన్నారు. తన గురించి గొప్పలు చెప్పుకోవడానికే కేసీఆర్ ప్రాధాన్యత ఇచ్చారన్నారు. కేసీఆర్ చెప్పింది ఒకటి నిజమన్నారు. ప్రధాని మోదీ వల్ల ప్రజాస్వామ్యానికే ముప్పు ఉందన్నారని, కానీ మోదీకి గురువు కేసీఆర్‌ అని ఎద్దేవా చేశారు. ఇతర పార్టీల ఎమ్మెల్యేలను లాక్కున్నప్పుడు ప్రజాస్వామ్యం ఏమైందని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ ఏర్పడినప్పుడు ఏక్‌నాథ్‌ శిందేల ఉత్పత్తి ప్రారంభించింది సీఎం కేసీఆరే అని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలో గెలిచిన తలసాని శ్రీనివాస్‌ను టీఆర్ఎస్ లో చేర్చుకుని మంత్రిని చేసింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. ఎర్రబెల్లి దయాకర్‌రావు, సబితా ఇంద్రారెడ్డి రూపంలో ఏక్‌నాథ్‌ శిందేలను తయారు చేసింది కేసీఆరే అని రేవంత్‌రెడ్డి విమర్శించారు.


ఏక్ నాథ్ శిందేకు కేసీఆర్ గాడ్ ఫాదర్ 


ఇప్పుడు ఏక్ నాథ్ శిందేల భూతం కేసీఆర్‎ను పట్టుకుందని రేవంత్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్‎ పార్టీలో ఉన్న వాళ్లంతా ఇతర పార్టీ నేతలే అన్నారు. ఏక్ నాథ్ శిందేకు కేసీఆర్ గాడ్ ఫాదర్ అని విమర్శించారు. వంద ఎలుకలు తిన్న పిల్లి నీతి వాఖ్యలు చెప్పినట్లు కేసీఆర్ వంద తప్పులు చేసి ఇప్పుడు నీతి వాఖ్యలు చెబుతున్నారని మండిపడ్డారు. ఈ దేశంలో సాగు, తాగునీరు అందించింది కాంగ్రె పార్టీ అన్నారు. చైనా కంటే అద్భుతమైన ప్రాజెక్టులు కాంగ్రెస్ హయాంలో కట్టారన్నారు. కాంగ్రెస్‎తో పోల్చే స్థాయి ప్రధాని మోదీకి లేదన్నారు. బీజేపీ చేసిన తప్పిదాల్లో టీఆర్ఎస్ కూడా భాగం ఉందన్నారు. మోదీ దోపిడీలో కేసీఆర్ వాటా ఏంతో తేల్చాలని రేవంత్ రెడ్డి ఆరోపించారు. 


కేసీఆర్ కు రేవంత్ సవాల్ 


సీఎం కేసీఆర్ కు నాలుగు రోజుల సమయం ఇస్తున్నా. నాలుగు రోజుల్లో కేసీఆర్ మంత్రి వర్గాన్ని రద్దు చేస్తే ఎన్నికలకు పోదాం. కేసీఆర్ ను వదిలించుకునేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు.  కేసీఆర్ నా పేరు పలకడానికి బయపడుతున్నారు. టీఆర్ఎస్ వ్యూహాకర్త కేసీఆర్ కు రిపోర్ట్ ఇచ్చారు. టీఆర్ఎస్ 25 సీట్లు గెలిచేలా ఉంది. మరో 17 సీట్లు పోటాపోటీ ఉందని నివేదిక ఇచ్చారు. కాంగ్రెస్ 32 సీట్లు గెలుస్తుంది. మరో 23 సీట్లలో గట్టి పోటీ ఇస్తుందని నివేదిక ఇచ్చారు. టీఆర్ఎస్ గ్రాఫ్ పడిపోతుంది. కాంగ్రెస్ గ్రాఫ్ పెరుగుతుందని స్పష్టమైన రిపోర్ట్ ఉంది.- రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు  


సిరిసిల్లలో నిరుద్యోగ డిక్లరేషన్ 


ఆగస్టు 2వ తేదీన సిరిసిల్లలో నిరుద్యోగ డిక్లరేషన్ సభ నిర్వహిస్తున్నట్లు రేవంత్ రెడ్డి ప్రకటించారు. నిరుద్యోగ సిరిసిల్ల డిక్లరేషన్ ప్రకటించబోతున్నామన్నారు.  వరంగల్ డిక్లరేషన్ తర్వాత కాంగ్రెస్ గ్రాఫ్ బాగా పెరిగిందని, రాపిడ్ గా 3 శాతం ఓట్లు కాంగ్రెస్ కు పెరిగాయన్నారు. సిరిసిల్ల నిరుద్యోగ డిక్లరేషన్ సభలో ఏఐసీసీ అగ్రనేత రాహుల్ గాంధీ పాల్గొంటారని తెలిపారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని అవన్నీ భర్తీ చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.  కేసీఆర్ ఇంట్లో అందరికీ ఉద్యోగాలు వచ్చాయని, తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న యువతకు ఉద్యోగాలు రాలేదని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు.