Muthyam Venkata Ramana ACB Case: తెలంగాణ రెడ్కో డివిజనల్ ఇంజనీర్ ముత్యం వెంకటరమణ అక్రమార్జన పర్వం ఏసీబీ దాడుల్లో బట్టబయలైంది. ఆదాయానికి మించిన ఆస్తులు కలిగి ఉన్నారనే విశ్వసనీయ సమాచారంతో తెలంగాణ అవినీతి నిరోధక శాఖ అధికారులు బుధవారం తెల్లవారుజాము నుంచే ఆయన నివాసంతో పాటు కార్యాలయం, బంధువులు, సహచరులకు చెందిన పలు ప్రాంతాల్లో ఏకకాలంలో మెరుపు దాడులు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వెలువడిన ఆధారాలు, స్వాధీనం చేసుకున్న పత్రాలను చూసి ఏసీబీ అధికారులే దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఏసీబీ ప్రాథమిక అంచనాల ప్రకారం.. డీఈ వెంకటరమణకు చెందిన సుమారు 27.65 కోట్ల విలువైన అక్రమాస్తులను అధికారులు గుర్తించారు. ఇవన్నీ ప్రభుత్వ రేట్ల ప్రకారం. మార్కెట్ రేట్ల ప్రకారం వంద కోట్ల కన్నా ఎక్కువే ఉంటుందని భావిస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని అత్యంత ఖరీదైన ప్రాంతాల్లో భారీగా స్థిరాస్తులు కూడబెట్టినట్లు సోదాల్లో ఆధారాలు లభించాయి. మూసాపేట ఆంజనేయనగర్‌లో 20 కోట్ల అంచనా పెట్టుబడితో నిర్మాణంలో ఉన్న 10 నివాస అపార్ట్‌మెంట్లు, శేరిలింగంపల్లి, కూకట్‌పల్లి ప్రాంతాల్లో అధికారిక విలువ ప్రకారమే 1.23 కోట్ల విలువైన 4 ఫ్లాట్లు, కూకట్‌పల్లి ఆంజనేయనగర్‌లో 1.82 కోట్ల విలువైన G+3 వాణిజ్య సముదాయం, గుట్టల బేగంపేటలో 2.90 కోట్ల విలువైన G+5 కమర్షియల్ బిల్డింగ్ ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. వీటి మార్కెట్ విలువ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది.
కేవలం భవనాలు, స్థలాలు మాత్రమే కాకుండా తన భార్య పేరిట 4 నిర్మాణ సంస్థలను రిజిస్టర్ చేసి నిధులను మళ్లించినట్లు అధికారులు అనుమానిస్తున్నారు. సోదాల సందర్భంగా వెంకటరమణ ఇల్లు, ఇతర ప్రాంగణాల నుంచి భారీగా ప్రాపర్టీ పత్రాలు, నగదు, బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. దాదాపు 4 కోట్ల విలువైన 2.094 కిలోల బంగారు ఆభరణాలు, 52.02 లక్షల బ్యాంక్ డిపాజిట్లు, 45 లక్షల విలువైన 3 విలాసవంతమైన వాహనాలు, 30 లక్షల విలువైన గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్ వస్తువులతో పాటు 20 మద్యం సీసాలను ఏసీబీ బృందాలు సీజ్ చేశాయి.
ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ తన అధికారిక పరిధిని దుర్వినియోగం చేస్తూ భారీ స్థాయిలో అవినీతికి పాల్పడ్డారని ఏసీబీ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. బహిరంగ మార్కెట్ ప్రకారం ఈ ఆస్తుల విలువ ఇంకా చాలా ఎక్కువగా ఉంటుందని, విచారణ పురోగమించే కొద్దీ మరిన్ని షెల్ కంపెనీలు, బినామీ ఆస్తుల కోణాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఆయన కుటుంబ సభ్యులు, భాగస్వాముల పాత్రపై కూడా దర్యాప్తు వేగవంతం చేశారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, డీఈ ముత్యం వెంకటరమణను అదుపులోకి తీసుకున్నారు. కేసు తదుపరి విచారణ నిమిత్తం ఆయన్ను కోర్టులో హాజరుపరిచి రిమాండ్‌కు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్క ప్రభుత్వ అధికారి వద్ద ఈ స్థాయిలో కోట్ల రూపాయల ఆస్తులు, బంగారం బయటపడటం తెలంగాణ ఉద్యోగ వ్యాపార వర్గాల్లో తీవ్ర కలకలం రేపింది.
