Hyderabad Ration Rice Scam: హైదరాబాద్ పరిధిలో దర్జాగా సాగుతున్న భారీ రేషన్ బియ్యం మాఫియా అక్రమాలను సివిల్ సప్లైస్, విజిలెన్స్ చెక్ పెట్టాయి. పేదలకు ప్రభుత్వం అతి తక్కువ ధరకు లేదా ఉచితంగా సరఫరా చేసే రేషన్ బియ్యాన్ని దళారులు అక్రమ మార్గాల్లో సేకరించి, వాటిని రీ-సైక్లింగ్ చేసి మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
కర్మన్‌ఘాట్‌లో టాస్క్‌ఫోర్స్ దాడి
పక్కా సమాచారంతో రంగంలోకి దిగిన సివిల్ సప్లైస్, విజిలెన్స్ అధికారులు నగరంలోని పలు ప్రాంతాల్లో ఏకకాలంలో దాడులు నిర్వహించారు. కర్మన్ ఘాట్ పరిసరాల్లోని ప్రముఖ రైస్ డిపోలు, గోదాములపై ఉన్నతాధికారులు దాడులు చేశారు. ఈ సోదాల్లో పెద్ద ఎత్తున నిల్వ ఉంచిన రేషన్ బియ్యం సంచులు, కల్తీ ప్రాసెసింగ్ యంత్రాలను అధికారులు సీజ్ చేశారు.
రైస్ మాఫియా
రేషన్ లబ్ధిదారుల నుంచి లేదా రేషన్ డీలర్ల నుంచి అతి తక్కువ ధరకు రేషన్ బియ్యాన్ని మాఫియా ఏజెంట్లు సేకరిస్తారు. ఇలా సేకరించిన లావు బియ్యాన్ని రైస్ మిల్లులు, డిపోల్లో ప్రత్యేక యంత్రాల ద్వారా పాలిష్ పట్టిస్తారు. దీనివల్ల బియ్యం తెల్లగా, సన్న బియ్యం మాదిరిగా కనిపిస్తాయి. రీ సైకిల్ చేసిన ఈ బియ్యాన్ని ప్రముఖ, పేరుగాంచిన బ్రాండెడ్ కంపెనీల కవర్లు, డూప్లికేట్ బ్యాగుల్లో ప్యాక్ చేస్తారు. మార్కెట్లో ఈ కల్తీ బియ్యాన్ని కిలో రూ. 80 నుంచి రూ. 100 వరకు విక్రయిస్తూ వినియోగదారులను దారుణంగా మోసం చేస్తున్నారు. Also Read: పుల్లారెడ్డి స్వీట్స్ లైసెన్స్ సస్పెన్షన్ - ఎలుకల మలం, నాసిరకం ఆయిల్స్.. ఫుడ్ సేఫ్టీ బిగ్ షాక్!
ప్రభుత్వం చర్యలు
రేషన్ బియ్యాన్ని పదే పదే పాలిష్ చేయడం ద్వారా వాటిలో ఉండాల్సిన పోషకాలు కోల్పోతాయి. ప్రాసెసింగ్ సమయంలో వాడే రసాయనాల వల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రేషన్ అక్రమ తరలింపునకు సహకరిస్తున్న డీలర్లు, మిల్లుల యజమానులు, దళారులపై పి.డి. యాక్ట్ కింద కేసు నమోదు చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు. భవిష్యత్తులో ఇటువంటి అక్రమాలు జరగకుండా బయోమెట్రిక్ ట్ర్యాకింగ్, జీపీఎస్ వంటి కఠిన చర్యలు తీసుకుంటామని పౌర సరఫరాల శాఖ తెలిపింది. Also Read: కేటీఆర్‌కు కొండా సురేఖ క్షమాపణ - న్యాయస్థానాల భయం.. లీగల్ వ్యూహం - బేషరతు సారీ వెనుక అసలు కథేంటి?
