Bandi Sanjay : మునుగోడు ఉప ఎన్నిక కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నిక కాబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ అన్నారు. హైదరాబాద్ పెద్ద అంబర్ పేట్ లో నాలుగో విడత ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభ నిర్వహించారు. ఈ సభలో మాట్లాడిన బండి సంజయ్... టీఆర్ఎస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. కేసీఆర్ ఖేల్ కాబోతోందని, ఆయన దుకాణం బంద్ ఖాయమన్నారు. కేసీఆర్ తో లడాయికి సిద్ధమయ్యామని, కేసీఆర్ ఎంఐఎతో కలిసి వచ్చినా బలప్రదర్శనకు సిద్ధమని సవాల్ విసిరారు. గడీల పాలనలో తెలంగాణ తల్లి బందీగా మారిందన్నారు. గరీబోళ్ల రాజ్యం కావాలో, గడీల రాజ్యం కావాలో రామరాజ్యం కావాలో, రావణ రాజ్యం కావాలో తేల్చుకోవాలని ప్రజలను కోరారు. పాదయాత్రలో ప్రజల కష్టాలు తనను తీవ్రంగా కదలించాయని పేర్కొన్న బండి సంజయ్ అక్టోబర్ 15 నుంచి ఐదో విడత ప్రజా సంగ్రామ యాత్రను చేపడుతున్నట్లు ప్రకటించారు.
పాతబస్తీలో జాతీయ జెండా
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలోని పెద్ద అంబర్ పేట సమీపంలో జరిగిన భారీ బహిరంగ సభకు నిర్వహించారు. అంబర్ మైదానం పూర్తిగా కాషాయ సంద్రమైంది. కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ప్రజా సంగ్రాయ యాత్ర ముగింపు సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఎంపీ బండి సంజయ్ మాట్లాడుతూ.. ఈ టైమ్ కు టీఆర్ఎస్ మీటింగ్ పెడితే గ్రౌండ్ ఖాళీ అయ్యేదని విమర్శించారు. రోడ్డు మీద నుంచి ఇక్కడికి రావడానికి గంట టైం పట్టిందని, కేసీఆర్ సభలకు డబ్బులు, బీరు, బిర్యానీ ఇచ్చి ప్రజలను తరలించినా అడిగి మరీ చప్పట్లు కొట్టించుకున్నా సభలు ఫెయిల్ అవుతున్నాయన్నారు. ఇబ్రహీంపట్నం పేరును వీరపట్నంగా మారుస్తామని బండి సంజయ్ అన్నారు. సెప్టెంబర్ 17ను 'తెలంగాణ విమోచన దినోత్సవం' గా జరపాలని బీజేపీ అనేక దశాబ్దాలుగా పోరాటం చేసిందని గుర్తుచేశారు. బీజేపీ పోరాటంతోనే టీఆర్ఎస్ చరిత్రను వక్రీకరించే విధంగా 'తెలంగాణ విమోచన దినోత్సవానికి' బదులు జాతీయ సమైక్యత దినోత్సవంగా నిర్వహించిందన్నారు. పాతబస్తీలో జాతీయ జెండాను పట్టుకుని తిరిగేలా చేసిన ఘనత బీజేపీదే అన్నారు.
కేసీఆర్ దుకాణం బంద్
"మునుగోడు ఉపఎన్నికలో పక్కా గెలుస్తాం అని స్టేట్ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇచ్చింది. కేసీఆర్ నీ ఖేల్ ఖతం, దుకాణం బంద్. మునుగోడులో ఇంకో ఆర్ గెలవబోతోంది. రాజగోపాల్ రెడ్డిని ఎమ్మెల్యే చేస్తాం. టీఆర్ఎస్ వెంటిలేటర్ పై ఉంది. కేసీఆర్ బయటికి వెళ్లడం లేదు. మునుగోడు ఉపఎన్నికలో టీఆర్ఎస్ ఓడిపోతుందని కేసీఆర్ కు తెలుసు. అందుకే ఎస్సీ, ఎస్టీలను మరోసారి మోసం చేసేందుకు అనేక హామీలు గుప్పిస్తున్నారు. బీజేపీ పై ఎస్సీ సమాజానికి నమ్మకం, విశ్వాసం ఉంది. అంబేద్కర్ విగ్రహాన్ని పార్లమెంట్ లో పెట్టిన పార్టీ బీజేపీ. 12 మంది ఎస్సీ ఎంపీలను కేంద్ర మంత్రులుగా చేసింది బీజేపీ. అంబేడ్కర్ జయంతి, వర్థంతికి కేసీఆర్ బయటికి రారు. దళితులను మోసం చేసిన పార్టీ టీఆర్ఎస్. కొత్త సచివాలయంలో దళితుడిని సీఎం చేసి, కొత్త కుర్చీలో కూర్చోబెట్టే దమ్ముందా? అప్పుడే దళితులు కేసీఆర్ ను నమ్ముతారు." - బంజి సంజయ్
రిజర్వేషన్లపై రాజకీయం
ఎస్టీ రిజర్వేషన్ల విషయంలో సీఎం కేసీఆర్ రాజకీయం చేస్తున్నారని బండి సంజయ్ ఆరోపించారు. కేసీఆర్ ఎస్టీ సామాజిక వర్గానికి చెందిన ఆడబిడ్డను రాష్ట్రపతి ఎన్నికల్లో ఓడగొట్టే ప్రయత్నం చేశారని ఆరోపించారు. బీసీల అభివృద్ధికి పాటుపడే పార్టీ బీజేపీ అన్నారు. అగ్రవర్ణాలలో పేదలకు రిజర్వేషన్లు ఇచ్చి ఆదుకున్న పార్టీ బీజేపీ అన్నారు. చేనేత కార్మికులను, గౌడ కులస్తులను, యాదవులు.. ఇలా అన్ని కులాలను నిర్వీర్యం చేసిన పార్టీ టీఆర్ఎస్ అని ఆరోపించారు. పాదయాత్ర ద్వారా పేదల కష్టాలు తెలుసుకుంటున్నామని, మల్కాజిగిరిలో అడుగడుగునా సమస్యలే ఉన్నాయన్నారు. బీజేపీ దెబ్బకు అధికారులు జవహర్ నగర్ లోని డంపింగ్ యార్డును సందర్శించి, సమస్యను పరిష్కరిస్తామని చెప్పారన్నారు.
కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నిక
"పాదయాత్రను అడుగడుగునా కేసీఆర్ అడ్డుకుంటున్నారు. బీజేపీ కార్యకర్తలపై లాఠీ ఛార్జ్, కేసులు పెడుతున్నారు. తెలంగాణలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. సంక్షేమ పథకాలను తీసేస్తారంటూ కొందరు టీఆర్ఎస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ సంక్షేమ పథకాలను ఆపదు. అవి టీఆర్ఎస్ వైనా, కాంగ్రెస్ వైనా సరే. పేదలకు మరింత మంచి జరిగేలా సంక్షేమ పథకాలను కొనసాగిస్తాం. ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడంతోపాటు అర్హులైన వారందరికీ ఇండ్లు కట్టిస్తాం. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ గెలవడమే లక్ష్యంగా పనిచేద్దాం. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ ప్రజల భవిష్యత్ నిర్ణయించే ఎన్నిక. కేసీఆర్ ప్రభుత్వాన్ని కూల్చే ఎన్నిక. రాజగోపాల్ రెడ్డి ని పక్కా గెలిపిస్తాం అని హామీ ఇస్తున్నా. "- బండి సంజయ్