Hyderabad Rains : హైదరాబాద్ రాజేంద్రనగర్ లో ఈసీ వాగు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. దీంతో హిమాయత్ సాగర్ 6 గేట్లు ఎత్తడంతో ఈసీ వాగు ప్రమాద స్థాయిలో ప్రవహిస్తోంది. హిమాయత్ సాగర్ ఔటర్ రింగు రోడ్డులోని సర్వీస్ రోడ్డుపై నుంచి వరద నీరు ప్రవాహిస్తుంది. ఈ ప్రవాహాన్ని గమనించకుండా వచ్చిన ఓ బైకర్ వంతెనపై చిక్కుకున్నాడు. వంతెనపై చిక్కుకున్న యువకుడు తనను కాపాడాలని అరుపులు వేయడంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దాగారు. నీటి ప్రవాహంలో చిక్కుకున్న వ్యక్తిని చాకచక్యంగా కాపాడారు. యువకుడిని అరవింద్ గౌడ్ గా పోలీసులు గుర్తించారు. అతడిని రక్షించిన అనంతరం అరవింద్ మాట్లాడుతూ తాను చనిపోతానేమో భయం వేసిందన్నారు. దేవుడి రూపంలో రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు వచ్చి తనను కాపాడారన్నారు. బైక్ తో పాటు అరవింద్ ను రాజేంద్రనగర్ ట్రాఫిక్ పోలీసులు రక్షించారు.
ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై రాకపోకలు బంద్
ఎగువ నుంచి వస్తున్న వరద నీరు ఉద్ధృతి కారణంగా ముసారాంబాగ్ బ్రిడ్జ్ పై రాకపోకలను నిలిపివేశారు. ఈ మార్గం దిల్ సుఖ్ నగర్ కి ప్రధాన రహదారి కావడంతో ప్రయాణికులు ఇబ్బంది పడుతున్నారు. వాహనాలను దారి మళ్లించడంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. దీంతో గోల్నాక బ్రిడ్జ్ పై వాహనాలు బారులు తీరాయి. భారీ వర్షాల కారణంగా హైదరాబాద్ లోని మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. ముసారాంబాద్ పురాతన బ్రిడ్జ్ కావడంతో ప్రమాదం జరిగే అవకాశముంటుందని ట్రాఫిక్ పోలీసులు రాకపోకలు నిలిపివేశారు. ఇవాళ రాత్రికి బ్రిడ్జ్ పైకి వరదనీరు చేరే అవకాశముందని అధికారులు భావిస్తున్నారు. మూసీ నది వరద ఉద్ధృతి పెరిగితే చాదర్‌ఘాట్‌లో లెవెల్ బ్రిడ్జ్ పై ట్రాఫిక్ నిలిపివేస్తామని జీహెచ్‌ఎంసీ అధికారులు తెలిపారు.
మూసీకి భారీ వరద
హైదరాబాద్ లో గత రాత్రి భారీ వర్షాలు కురిశాయి. దీంతో నగరంలోని చాలా కాలనీలు జలమయం అయ్యాయి. మరో మూడు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జీహెచ్‌ఎంసీ మేయర్ విజయలక్ష్మి కోరారు. లోతట్టు ప్రాంతాల ప్రజలకు ఇబ్బందులు ఎదురైనప్పుడు జీహెచ్‌ఎంసీ కాల్ సెంటర్ 040-21111111ను సంప్రదించాలని మేయర్ సూచించారు. కంట్రోల్ రూం 24 గంటల పాటు పనిచేస్తుందని చెప్పారు. ఉస్మాన్‌సాగర్, హిమాయత్ సాగర్ జలాశయాల నుంచి నీటిని విడుదల చేస్తున్న కారణంగా మూసీ పరీవాహక ప్రాంతాల్లో ఉన్న ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను మేయర్ ఆదేశించారు. క్షేత్రస్థాయిలో అధికారులు పరిస్థితులను పరిశీలించి ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు.