Mlc Kavitha Meets CM KCR : దిల్లీ మద్యం స్కామ్ కేసులో ఎమ్మెల్సీ కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నోటీసుల దృష్ట్యా ఎమ్మెల్సీ కవిత శనివారం ప్రగతి  భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. అయితే తాజాగా ఆదివారం ఉదయం మరోసారి కవిత ప్రగతి భవన్‌కు వచ్చారు. సీఎం కేసీఆర్‌తో సమావేశం అయినట్లు తెలుస్తోంది. శనివారం కేసీఆర్ తో భేటీ అనంతరం సీబీఐ అధికారికి కవిత లేఖ రాశారు. కేంద్ర హోం మంత్రిత్వ శాఖ ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీని అందించాలని కోరారు. ఆ పత్రాలు పంపిన తర్వాతే విచారణ తేదీ ఫిక్స్ చేయాలని కవిత సీబీఐకు లేఖ రాశారు. అయితే కవిత రాసిన లేఖకు సీబీఐ నుంచి ఇంకా సమాధానం రాలేదు. సీబీఐ సమాధానం కోసం కవిత ఎదురుచూస్తున్నట్లు తెలుస్తోంది.  ఆదివారం సీఎం కేసీఆర్‌తో సమావేశం అనంతరం కవిత నేరుగా ఆలేర్‌కు వెళ్లనున్నారు. కవిత దంపతులు అక్కడ ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనున్నారు. 


ఫిర్యాదు, ఎఫ్ఐఆర్ కాపీలు ఇవ్వండి


దిల్లీ లిక్కర్ కేసులో విచారణకు హాజరు కావాలని సీబీఐ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్సీ కవిత స్పందించారు. ఈ కేసు ఫిర్యాదు కాపీ, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని సీబీఐని కోరారు. ఈ మేరకు ఎమ్మెల్సీ కవిత సీబీఐ అధికారి అలోక్ కుమార్ కు శనివారం లేఖ రాశారు. సాధ్యమైనంత త్వరగా కాపీ అందించాలని కోరారు. దిల్లీ మద్యం షాపుల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయని కేంద్ర హోంశాఖ సీబీఐకి ఫిర్యాదు చేసింది. 


సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసులు 


దిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో వివరణ కోసం సీబీఐ ఇచ్చిన నోటీసులకు టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పందించారు. ఈ కేసులో వివరణ ఇచ్చేందుకు తన వద్దకు రావాలని ఆమె కోరారు. శుక్రవారం ఎమ్మెల్సీ కవితకు సీఆర్పీసీ సెక్షన్ 160 నోటీసులు ఇచ్చింది సీబీఐ. దానిపై కవిత స్పందిస్తూ శనివారం సీబీఐ అధికారి అలోక్ కుమార్ షాహికి లేఖ రాశారు.  సీబీఐకి కేంద్ర హోంశాఖ చేసిన ఫిర్యాదు కాపీతో పాటు దాని ఆధారంగా నమోదు చేసిన ఎఫ్ఐఆర్ కాపీని తనకు అందించాలని కోరారు. సాధ్యమైనంత త్వరగా సంబంధిత కాపీలను అందించాలన్నారు. ఈ కాపీలు అందిన తర్వాత వివరణ ఇచ్చేందుకు మీటింగ్ ఫిక్స్ చేయవచ్చని సూచించారు.  


ఈడీ రిమాండ్ రిపోర్టులో కవిత పేరు  


టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పేరు దిల్లీ మద్యం స్కాంలో ఇటీవల వెలుగులోకి వచ్చింది. దిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియాకు అత్యంత సన్నిహితుడైన అమిత్ అరోరాను ఈడీ అరెస్ట్ చేసి రిమాండ్ రిపోర్టును కోర్టులో సమర్పించింది. అందులో కవిత పేరును ప్రస్తావించింది. సౌత్ గ్రూప్ నుంచి రూ. 100 కోట్లను అమిత్ అరోరా ద్వారా విజయ్ నాయర్‌కు చేర్చారని ఈడీ తేల్చింది. ఈ విషయాన్ని  అరోరా అంగీకరించారని కోర్టుకు తెలిపింది. ఈ డీల్‌ను సౌత్ గ్రూప్ నుంచి శరత్ రెడ్డి, కవిత చూసుకోగా వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డి సమన్వయపరిచారని ఈడీ అంటోంది. ఈ మొత్తం స్కామ్ గురించి బయటకు రాకుండా ఎప్పటికప్పుడు వారంతా ఫోన్లు మార్చారని ఈడీ రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కవిత కూడా ఫోన్లు మార్చారని వాటిని దొరకకుండా ధ్వంసం చేశారని ఈడీ రిమాండ్ రిపోర్టులో తెలిపింది.  అమిత్ అరోరా దిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు అమిత్ సన్నిహితుడు.  ఇక దిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో అమిత్ అరోరా కీలకంగా వ్యవహరించారని ఈడీ వర్గాలు చెబుతున్నాయి. గురుగాంకు చెందిన అమిత్ అరోరా ,దినేష్ అరోరా, అర్జున్ పాండేలతో కలిసి పాలసీని రూపొందించడంలో కీలకంగా పనిచేసినట్లు ఈడీ చెబుతోంది. వీరిలో దినేష్ అరోరా ఇప్పటికే అప్రూవర్‌గా మారారు.