సీఎం కేసీఆర్ పాలనకు చరమగీతం పాడే సమయం ఆసన్నమైందని హుజూరాబాద్ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అన్నారు. 2023లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తుందని జోస్యం చెప్పారు. ఒక్క ఉపఎన్నికకు అధికార పార్టీ రూ.500 కోట్లు ఖర్చు చేసిందని ఈటల రాజేందర్ ఆరోపించారు. కేసీఆర్ ఇచ్చే తాయిలాలకు ఆశపడి ఎన్నికల కమిషన్ అధికారులు, పోలీసులు పనిచేశారని ఈటల ఆరోపించారు. అధికార యంత్రాంగంపై సీఎం కేసీఆర్ ఒత్తిడి చేశారన్నారు. సీఐలు, ఎస్సైలు స్థానిక నాయకులను బెదిరించారని, ఆ ఆడియోలు తన వద్ద ఉన్నాయని వారిపై చర్యలు తీసుకుంటారా అని ప్రశ్నించారు. 2023లో ప్రజలు టీఆర్ఎస్ పాలనకు పాతరేసి బీజేపీని గెలిపిస్తారని ఈటల రాజేందర్ అన్నారు.
ఈటలకు ఘనంగా సన్మానం
హుజూరాబాద్ఉపఎన్నికలో భారీ మెజార్టీతో గెలిచిన ఈటల ఇవాళ హైదరాబాద్ లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చారు. ఆ పార్టీ నాయకులు, శ్రేణులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. అనంతరం ఘనంగా సన్మానించారు. భారీ ర్యాలీగా బయలుదేరిన ఈటల రాజేందర్ మొదట గన్‌పార్క్ వద్ద అమరవీరులకు నివాళులు అర్పించారు. శామీర్‌పేట్ నుంచి గన్‌పార్క్ వరకు ఈటల విజయోత్సవ ర్యాలీ సాగింది. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యాలయానికి చేరుకున్న ఈటలను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, మాజీ ఎంపీలు జితేందర్‌రెడ్డి, వివేక్ ఘనంగా సన్మానించారు.
ఆట ఇప్పుడే మొదలైంది కేసీఆర్
అనంతరం మాట్లాడిన ఈటల తెలంగాణ ప్రజలు ఆకలినైనా భరిస్తారు కానీ ఆత్మగౌరవాన్ని కోల్పోరన్నారు. ఉద్యమాలతో అధికారంలోకి వచ్చిన కేసీఆర్ ప్రజలను బానిసలుగా చూస్తున్నారన్నారు. తన విజయం హుజూరాబాద్ ప్రజలకు అంకితమన్నారు. ఆట ఇప్పుడే మొదలైందని ఈటల అన్నారు. దళితబంధు పథకం పాత ఆలోచన అయితే హుజూరాబాద్ ఎన్నిక వరకూ ఎందుకు ఆగారని ప్రశ్నించారు. దళితబంధు రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ కు ఎన్నికలు వచ్చినప్పుడే ప్రజలు గుర్తుకొస్తారన్నారు. ఐటీ హబ్ హైదరాబాద్‌లో యువతకు ఎన్ని ఉద్యోగాలు ఇచ్చారని ఈటల ప్రశ్నించారు. టీఆర్ఎస్ మానిఫెస్టో ఎందుకు అమలు చేయడంలేదో చెప్పాలన్నారు.
కుటుంబ పాలనకు చరమగీతం పాడాలి: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
ఈటల రాజేందర్‌ను కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బండి సంజయ్, జితేందర్‌రెడ్డి, వివేక్, భాజపా శ్రేణులు ఘనంగా సన్మానించారు. అనంతరం కిషన్‌రెడ్డి మాట్లాడుతూ నిజాయితీకి ప్రతిరూపంగా ఈటల రాజేందర్ పనిచేశారని అభినందించారు. కేసీఆర్ మాటలను హుజూరాబాద్ ప్రజలు నమ్మలేదన్నారు. హుజూరాబాద్ ఎన్నిక రాష్ట్ర రాజకీయాల్లో కీలక మార్పులు తీసుకొస్తుందన్నారు. ఉప ఎన్నికలో లబ్ధికోసమే దళితబంధు పథకం హడావుడిగా అమలుచేశారని ఆరోపించారు. టీఆర్ఎస్ కుటుంబ పాలనకు వ్యతిరేకంగా కవులు, కళాకారులు, మేధావులు కలిసి పనిచేశారన్నారు. హనుమకొండలో విజయగర్జన కాదు కల్వకుంట్ల గర్జన పెట్టుకోవాలని ఎద్దేవా చేశారు. తెలంగాణలో కుటుంబ పాలనకు చరమగీతం పాడాలని కిషన్ రెడ్డి అన్నారు.
Also Read: ఎవరీ దీపా మోహనన్.. ఎంజీ యూనివర్సిటీలో నిరాహార దీక్ష ఎందుకు చేస్తున్నారు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి