TG High Court Verdict: దాంపత్య జీవితంలో సాధారణంగా వచ్చే చిన్నపాటి గొడవలు, అభిప్రాయ భేదాలను 'క్రూరత్వం' కింద పరిగణించి విడాకులు ఇవ్వలేమని తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. వివాహ బంధంలో ఎదురయ్యే ప్రతి చిన్న సమస్యను క్రూరత్వంగా చూడలేమని, ఆ వ్యక్తితో ఇకపై కలిసి జీవించలేమనే స్థాయికి పరిస్థితి దిగజారితేనే విడాకులకు ప్రాతిపదిక అవుతుందని కోర్టు తేల్చిచెప్పింది.

Continues below advertisement

కేసు వివరాలు 

ఒక వ్యక్తికి 2009లో వివాహం కాగా, పాప పుట్టిన తర్వాత భార్య తనను వేధిస్తోందంటూ అతడు విడాకుల కోసం కోర్టుకెక్కాడు. అయితే, ఈ పిటిషన్‌ను కింది కోర్టు కొట్టివేసింది. తమ దాంపత్య హక్కులను పునరుద్ధరించాలంటూ భార్య దాఖలు చేసిన పిటిషన్‌ను దిగువ కోర్టు అనుమతించింది. దీనిని సవాల్ చేస్తూ భర్త హైకోర్టులో అప్పీల్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ కె.లక్ష్మణ్, జస్టిస్‌ కె.సుజనలతో కూడిన ధర్మాసనం విచారణ చేసి తాజాగా తీర్పు ఇచ్చింది. 

 భార్య మానసిక సమస్యతో బాధపడుతోందన్న ఆరోపణలకు, ఇల్లరికం రావాలంటూ భార్య, అత్తమామలు వేధిస్తున్నారంటూ భర్త చేసి ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు చూపలేదని ధర్మాసనం పేర్కొంది. భార్య తనపై గృహహింస కింద కేసు పెట్టి వేధించిందని భర్త వాదించినప్పటికీ, ఆ కేసును కోర్టు ఇప్పటికే కొట్టివేసిందని గుర్తుచేసింది. అయితే, కేవలం గృహహింస కేసు దాఖలు చేసినంత మాత్రాన దాన్ని భర్త పట్ల క్రూరత్వంగా పరిగణించలేమని హైకోర్టు తేల్చిచెప్పింది.

Continues below advertisement

కేసు దాఖలు చేసిన సమయంలో భర్త వయసు 36 ఏళ్లు, భార్య వయసు 30 ఏళ్లు ఉండగా.. ప్రస్తుతం భర్తకు 50, భార్యకు 44 ఏళ్లు, కూతురికి 16 ఏళ్లు ఉన్నాయి. వీరు గత 14 ఏళ్లుగా వేర్వేరుగా ఉంటున్నారు. పెద్దగా విభేదాలు లేని దంపతులు, అనవసరంగా సమస్యలను ఎక్కువ చేసుకొని చిన్న చిన్న కారణాలతో విడాకుల కోసం ప్రయత్నించారని హైకోర్టు అభిప్రాయపడింది. చిన్న కారణాలతో విడాకులను అనుమతించలేమని హైకోర్టు స్పష్టం చేస్తూ, దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును సమర్థించింది.  Also Read: నాగోల్‌‌లో పైప్‌లైన్‌ను ఢీకొట్టిన కారు, వ్యక్తి మృతి- వరద బీభత్సంతో నీటి సరఫరా బంద్

చట్టాలు ఏం చెబుతున్నాయి

హిందూ వివాహ చట్టం ప్రకారం విడాకులు కోసం 'క్రూరత్వం' ఒక ప్రాతిపదిక. అయితే సుప్రీంకోర్టు, వివిధ హైకోర్టుల తీర్పుల ప్రకారం.. సాధారణ వైవాహిక జీవితంలో జరిగే చిన్నచిన్న ఘర్షణలు, మనస్తాపాలు, మాటలను క్రూరత్వంగా పరిగణించలేమని కోర్టులు చెబుతున్నాయి. అది మానసికంగా లేదా శారీరకంగా భరించలేనంత తీవ్రంగా ఉంటేనే క్రూరత్వంగా పరిగణిస్తామని చెబుతున్నాయి. 14 ఏళ్లుగా విడిగా ఉంటున్నప్పటికీ, చట్టపరమైన కారణాలు లేకపోతే కేవలం కాలయాపన కారణంగా కోర్టులు ఆటోమేటిక్‌గా విడాకులు మంజూరు చేయవు. వివాహ బంధాన్ని నిలబెట్టడానికి ప్రాధాన్యత ఇస్తూ కోర్టులు ఇలాంటి సందర్భాల్లో కౌన్సెలింగ్ లేదా దాంపత్య హక్కుల పునరుద్ధరణకు మొగ్గు చూపుతుంటాయి. Also Read: చిన్నపాటి గొడవలతో విడాకులు ఇవ్వలేం.. తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు