Minister Talasani Srinivas : ఈ నెల 9న హైదరాబాద్ జిల్లాలోని ప్రతి నియోజకవర్గంలో మన బస్తి–మన బడి కార్యక్రమం ప్రారంభిస్తామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్  తెలిపారు. మాసబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో మన బస్తి – మన బడి కార్యక్రమం అమలుపై హోంమంత్రి మహమూద్ అలీతో కలిసి మంత్రి తలసాని సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, కలెక్టర్, విద్యాశాఖ అధికారులు, స్థానిక ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు. 


ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మారిపోతాయి 


ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, సౌకర్యాలను కల్పించేందుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 26,065 పాఠశాలలను గుర్తించి 7,289.54 కోట్ల రూపాయలు కేటాయించిందన్నారు. హైదరాబాద్ జిల్లాలోని 15 నియోజకవర్గాల పరిధిలో  690 పాఠశాలలు ఉండగా, మొదటి విడతగా 239 పాఠశాలలను ఎంపిక చేశామన్నారు. 
గత ప్రభుత్వాలు విద్యారంగ అభివృద్ధి, ప్రభుత్వ పాఠశాలల సమస్యలను పట్టించుకోలేదన్నారు. రానున్న రోజులలో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు పూర్తిగా మారిపోతాయన్నారు.  పోటీ పరీక్షలకు సిద్దం అవుతున్న అభ్యర్థుల కోసం నియోజకవర్గానికి ఒకటి చొప్పున ఉచిత కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు చర్యలు చేపట్టామన్నారు. ఉచిత కోచింగ్ లో ప్రతి అభ్యర్ధికి నెలకు 5 వేల రూపాయలు చొప్పున అందిస్తామన్నారు. పోటీ పరీక్షలకు సిద్ధం అవుతున్న అభ్యర్థుల్లో చాలా మంది నిరుపేదలు వేలాది రూపాయల ఫీజులు చెల్లించి ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేక ఇబ్బందులు పడుతున్నారన్నారు. వారిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇచ్చేందుకు కోచింగ్ సెంటర్ లను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కేంద్రాలకు హాజరయ్యే అభ్యర్థులకు ఒక్కొకరికి నెలకు 5 వేల రూపాయల వరకు ఫుడ్, ట్రాన్స్ పోర్ట్ ఖర్చుల కోసం ఇస్తామన్నారు. ఒక్కో బ్యాచ్ కు 100 మంది చొప్పున మెరిట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేసి ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు శిక్షణ తరగతులు నిర్వహిస్తామన్నారు. 


కోచింగ్ సెంటర్లలో ఉచిత భోజనం 


"తెలంగాణ ప్రభుత్వం విద్యారంగానికి చాలా ప్రాధాన్యం ఇచ్చింది. సీఎం కేసీఆర్ ఆదేశాలతో విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాం. తెలంగాణ ఉద్యమం టాగ్ లైన్ నీళ్లు నిధులు నియామకాల స్ఫూర్తిగా నిరుద్యోగాలకు ఉద్యోగాలు కల్పిస్తున్నాం. సీఎం కేసీఆర్ అసెంబ్లీలో ప్రకటించిన విధంగా రాష్ట్రంలో భారీ ఎత్తున నోటిఫికేషన్లు పడుతున్నాయి. గ్రూప్స్, పోలీసుల ఉద్యోగాల నోటిఫికేషన్లు వరుసగా ఉన్నాయి. బీసీ,ఎస్సీ, ఎస్టీ సర్కిల్స్ లో కోచింగ్ గురించి అధికారులతో చర్చించాం. అభ్యర్థులకు కోచింగ్ మెటీరియల్ సవ్యంగా అందుతుందా అనే విషయం వాకబు చేశాం. హైదరాబాద్ లో ఒక్కో నియోజకవర్గాన్ని ఒక్కో ఎమ్మెల్యే అడాప్టు చేసుకుని ప్రభుత్వ కోచింగ్ సెంటర్లలో కొంత కాంట్రిబ్యూషన్ చేస్తున్నారు. అలాగే కోచింగ్ సెంటర్లలో ఉచిత భోజనం అందించాలని నిర్ణయించాం. " అని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.