Minister KTR Letter : తెలంగాణలోని పట్టణాల అభివృద్ధి కోసం వచ్చే బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించాలని మంత్రి కేటీఆర్ మరోసారి కేంద్రాన్ని కోరారు. ఈ మేరకు కేంద్రానికి కేటీఆర్ మరో లేఖ రాశారు. హైదరాబాద్ తో పాటు రాష్ట్రంలోని ఇతర పట్టణాల అభివృద్ధికి సహకరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామన్నారు. ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపినా ప్రతిసారి తమకు నిరాశే ఎదురవుతుందని ఆరోపించారు. పట్టణాల అభివృద్ధికి తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో చేస్తున్న ప్రయత్నానికి వచ్చే బడ్జెట్ లో అయినా నిధులు కేటాయించాలని కేటీఆర్ కేంద్రాన్ని కోరారు. హైదరాబాద్, వరంగల్ పాటు ఇతర పురపాలికల కోసం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రత్యేక నిధులు ఇవ్వడమో లేదంటే హైదరాబాద్, వరంగల్ లాంటి పట్టణాలకు ఒక ప్రత్యేక ప్యాకేజీ అయినా కేటాయించాలన్నారు. తెలంగాణపై కేంద్రం వివక్ష చూపిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు అదనంగా ఒక్క రూపాయి కూడా రాలేదని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని బీజేపీ నిధులు కేటాయించకపోయినా పురపాలికలతో పాటు అన్ని రంగాల్లోనూ తెలంగాణ అద్భుతమైన ప్రగతి కొనసాగిస్తుందన్నారు.
పట్టణాల అభివృద్ధికి
సీఎం కేసీఆర్ దూరదృష్టితో తీసుకొచ్చిన పాలనా సంస్కరణలు, విప్లవాత్మక కార్యక్రమాలతో రాష్ట్రంలోని పట్టణాలన్నీ సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. అందుకు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న అవార్డులు, రివార్డులే నిదర్శనం అన్నారు. కేంద్ర ప్రభుత్వ అవార్డులతో ఇప్పటికైనా తమ ప్రభుత్వ పనితీరును మోదీ సర్కార్ గుర్తించాలని కోరారు. తెలంగాణకు మరిన్ని నిధులు కేటాయిస్తారన్న నమ్మకంతో ఈ లేఖ రాస్తున్నట్టు కేటీఆర్ తెలిపారు. 47% రాష్ట్ర జనాభా పట్టణాల్లో నివసిస్తున్నారని, అన్ని రంగాల్లో పట్టణాలను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం కట్టుబడి ఉన్నందన్నారు. ఇందుకోసం నూతన మున్సిపాల్ చట్టం, నూతన భవన నిర్మాణ అనుమతుల చట్టం, ప్రతీ పట్టణం కచ్చితంగా ఖర్చు చేయాల్సిన 10% గ్రీన్ బడ్జెట్, టీఎస్ బీపాస్ వంటి కార్యక్రమాలను అమలుచేస్తున్నామన్నారు. భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఉన్న 68 పురపాలికలను 142 కు పెంచామని లేఖలో కేటీఆర్ ప్రస్తావించారు.
హైదరాబాద్ అభివృద్ధికి
హైదరాబాద్ అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి పథకం, వ్యూహాత్మక నాలా అభివృద్ధి ప్రాజెక్టుతో సహా అనేక స్పెషల్ పర్పస్ వెహికల్ లను ఏర్పాటు చేసినట్టు కేటీఆర్ తెలిపారు. ఇలాంటి పాలనాపరమైన ఏర్పాట్లు చేయడంతో ప్రభుత్వం తలపెట్టిన కార్యక్రమాలు వేగంగా పూర్తికావడంతోనే మెర్సర్ క్వాలిటీ ఆఫ్ లివింగ్ ఇండెక్స్ లో వరుసగా ఆరోసారి అత్యుత్తమ నగరంగా హైదరాబాద్ స్థానం దక్కించుకుందన్నారు. సీఎం కేసీఆర్ మానసపుత్రిక హరితహారంతో హైదరాబాద్ నగరానికి వరల్డ్ గ్రీన్ సిటీగా అవార్డు లభించిందని కేటీఆర్ గుర్తించారు. దేశంలో హైదరాబాద్ నగరానికి మాత్రమే ఆ గుర్తింపు దక్కిన విషయాన్ని ప్రస్తావించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో హైదారాబాద్ అభివృద్ధి చెందడంతో పాటు అంతర్జాతీయ గుర్తింపు సైతం లభిస్తోందని కేటీఆర్ వివరించారు. తెలంగాణ పట్టణాల అభివృద్ధికి కావాల్సిన వివిధ ప్రతిపాదనలు, విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం ముందు ఉంచామని, కనీసం ఈ బడ్జెట్ లోనైనా సానుకూల నిర్ణయం తీసుకోవాలని కేటీఆర్ కోరారు.
ఎయిర్ పోర్ట్ మెట్రోకు
హైదరాబాద్ మెట్రో రైలు ప్రజలకు అత్యంత అనువుగా మారిన నేపథ్యంలో భవిష్యత్తు ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఎయిర్ పోర్ట్ ఎక్స్ ప్రెస్ మెట్రో ప్రాజెక్టుని తెలంగాణ ప్రభుత్వం తలపెట్టిందని తెలిపారు కేటీఆర్. 6250 కోట్ల రూపాయల బడ్జెట్ తో 31 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టుకి అంగీకారాన్ని వెంటనే మంజూరు చేసి ఈ ప్రాజెక్టుకి కేంద్రం ఆర్థికంగా మద్దతు ఇచ్చే విషయాన్ని పరిశీలించాలన్నారు. హైదరాబాద్ లో 20 కిలోమీటర్ల మేర నిర్మించే మాస్ రాపిడ్ ట్రాన్సిట్ సిస్టం కోసం దాదాపు 3050 కోట్లు ఖర్చు అవుతున్నాయని, ఇందులో 15% మూలధన పెట్టుబడిగా రూ.450 కోట్లు కేంద్రం కేటాయించాలని కోరారు. హైదరాబాద్ తో సహా తెలంగాణలోని పురపాలికల్లో చేపట్టిన సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, బయోమైనింగ్ వంటి ప్రాజెక్టుల కోసం దాదాపు 3,777 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని, ఇందులో కనీసం 20 శాతం అంటే 750 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించాలని కేటీఆర్ కోరారు.