Minister Harish Rao : కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తెలంగాణ ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నం చేశారని మంత్రి హరీశ్ రావు ఆరోపించారు. మెడికల్‌ కాలేజీల విషయంలో తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తుందన్నారు. ఖమ్మం, కరీంనగర్‌కు మెడికల్‌ కాలేజీలు ఇవ్వమని కేంద్రం చెప్పిందన్నారు. తమకు మెడికల్‌ కాలేజీలు ఇవ్వమని చెప్పిన బీజేపీకి ఎందుకు ఓటు వేయాలని కరీంనగర్‌, ఖమ్మం ప్రజలు ఇప్పుడు ఆలోచిస్తున్నారన్నారు. కేంద్ర బడ్జెట్‌లో అంతా డొల్ల అని మంత్రి హరీశ్ రావు ఎద్దేవాచేశారు. పేదలకు ఉపయోగపడే అంశం కేంద్ర బడ్జెట్‌లో ఒక్కటి కూడా లేదన్నారు. కార్పొరేట్లకు పన్నులు తగ్గించారన్నారు. రైతుల గురించి, మహిళలు, వృత్తుల వారి గురించి, పేదల గురించి కేంద్ర బడ్జెట్‌లో ప్రస్తావనే లేదని మండిపడ్డారు.  


తెలంగాణలో అప్పులు పెరగడానికి కేంద్రమే కారణం 


గురువారం హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ప్రభుత్వం నిర్మలా సీతారామన్ విమర్శలు చేశారు. అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ చెప్పింది నూటికి నూరుపాళ్లు వాస్తమన్నారు. కేసీఆర్ ప్రతి మాట ఆధారాలతో, లెక్కలతో మాట్లాడారన్నారు. ఇప్పటికైనా తెలంగాణపై  ప్రేమ ఉంటే కేంద్రం మెడికల్‌ కాలేజీలు కేటాయించాలని మంత్రి హరీశ్ రావు డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రావాల్సిన రూ.1.25 లక్షల కోట్ల నిధులు విడుదల చేయాలని కోరారు. తెలంగాణకు రావాల్సిన నిధులను ఇవ్వకుండా కేంద్రం ఇబ్బందులు పెడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్రం ఫైనాన్స్‌ కమిషన్‌ నిర్ణయాలను తుంగలో తొక్కి తెలంగాణకు అన్యాయం చేస్తున్నారని ఆరోపించారు. జీఎస్టీ నిధులను తెలంగాణకు ఎందుకు ఇవ్వరని ప్రశ్నించారు. ఆర్టికల్ 293కి లోబడే తెలంగాణ అప్పులు తీసుకుందని, తీసుకున్న నిధులతో ప్రాజెక్టు నిర్మాణాలను, అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. కేంద్ర ప్రభుత్వం లక్షల కోట్ల అప్పులు తెచ్చి అభివృద్ధి చేయకపోగా వడ్డీలు కడుతోందన్నారు. రాష్ట్రంలో అప్పులు పెరగడానికి కేంద్రమే కారణమని మంత్రి హరీశ్ రావు విమర్శించారు.  


కేసీఆర్ పై నిర్మలా సీతారామన్ కామెంట్స్ 


 దేశం ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ వైపు వెళ్తోందన్న అంశంపై తెలంగాణ సీఎం కేసీఆర్ చేసిన కామెంట్స్‌పై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్  మండిపడ్డారు.  ఐదు ట్రిలియన్‌ ఆర్థిక వ్యవస్థపై జోకులు వద్దంటూ సీరియస్‌ అయ్యారు. 2014లో తెలంగాణలో అప్పులు రూ.60వేల కోట్లు. ఇప్పుడు మూడు లక్షల కోట్లు దాటింది. కరోనా కారణంగా అందరం అప్పులు తెచ్చుకున్నాం.. ఇప్పుడు అప్పులు తీరుస్తున్నాం. రాష్ట్రాలు చేసే అప్పులను పరిశీలించాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వంపై ఉంటుందని స్పష్టం చేశారు.  ఇది రాజ్యాంగం లో పొందుపరిచిన నిబంధన.. దానినే మేము అమలు చేస్తున్నామని స్పష్టం చేశారు.                                                     


అప్పులపై మానిటరింగ్ చేయాల్సిందే 


అప్పులపై ఎవరో ఒకరు మానీటరింగ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎఫ్ఆర్బీఎం లిమిట్ పైనా ఇప్పటికే అనేకసార్లు సమాధానం చెప్పానని గుర్తు చేశారు. పార్లమెంట్ అనేది అత్యున్నత రాజ్యాంగ వ్యవస్థ.. అక్కడే అనేకసార్లు సమాధానం ఇచ్చామన్నారు.  అందరినీ ఒకేలాగా చూస్తాం.. సంక్షేమ పథకాలు అందరికీ అందజేస్తామని..    పథకాలను జోక్ అంటూ ప్రజలను వెక్కిరిస్తున్నారా అని కేసీఆర్‌ను నిర్మలా సీతారామన్ ప్రశ్నంచారు.  ఐదు ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థ కోసం అందరూ కృషి చేయాలి. ఇది దేశం కోసం అంటూ హితవు పలికారు.