Pawan Kalyan : జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ హైదరాబాద్ శిల్పాకళా వేదికలో  సీఏ విద్యార్థులకు సంబంధించిన అంతర్జాతీయ సదస్సులో పాల్గొన్నారు. ఈ సందర్భంగా 'ఫేసింగ్‌ ది ప్యూచర్' అనే అంశంపై సీఏ విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు.  ఈ సదస్సులో పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తానొక పరాజయ రాజకీయ నేతను అన్నారు. 


డబ్బున్న వాళ్లంతా గొప్పోళ్లు అనుకోవద్దు


"నేనొక ఫెయిల్డ్ పొలిటీషియన్. నా ఓటమిని నేను ఒప్పుకుంటాను. ఓటమి విజయానికి దగ్గర చేస్తుంది. అందుకే నా ఓటమిని ఒప్పుకుంటాను. వైఫల్యాల గురించి నేనెప్పుడూ చింతించను. ఎందుకంటే నేను ఏదొకటి సాధించాను. చాలా మంది సమాజంలో మార్పు తీసుకురావాలనుకుంటారు. కానీ ప్రయత్నించరు. నేను వాళ్లలా కాదు. సమాజంలో మార్పు తీసుకువచ్చేందుకు నా వంతు ప్రయత్నం చేస్తున్నాను.డబ్బున్న వాళ్లంతా గొప్పవాళ్లు, పేరున్న వాళ్లంతా మహానుభావులు అనుకోవద్దు. ప్రతి ఒక్కరినీ గుడ్డిగా నమ్మకండి. దేవుడిని కూడా గుడ్డిగా నమ్మవద్దు. ఏది తప్పు ఏది ఒప్పు అనేది మనమే నిర్ణయించుకోవాలి. మన వ్యక్తిగత విజయమే మన దేశానికి పెట్టుబడి" - పవన్ కల్యాణ్   


విజయం కూడా తాత్కాలికమే


జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన రాజకీయ జీవితంపై ఊహించని వ్యాఖ్యలు చేశారు. తాను రాజకీయాల్లో విఫలమయ్యానన్నారు. అయితే ఓటమి  తన విజయానికి పునాదులు వేస్తాయని స్పష్టం చేశారు. హైదరాబాద్ లో సీఏ విద్యార్థుల సదస్సులో పాల్గొన్న ఆయన...తన రాజకీయ జీవితంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తాను విఫల రాజకీయ నాయకుడినని అన్నారు. దీంతో ఒక్కసారిగా ఆడిటోరియం దద్దరిల్లింది. అక్కడున్న విద్యార్థులు.. 'నో ... నో ' అని గట్టిగా కేకలు వేశారు. సీఎం ..సీఎం అంటూ నినాదాలు చేశారు.  పరాజయం ఎలాగైతే తాత్కాలికమైనదో విజయం కూడా తాత్కాలికమే అన్నారు. విజయాన్ని నెత్తికెక్కించుకోవద్దని విద్యార్థులకు సూచించారు. రాజకీయాలల్లో ఇప్పటి వరకైతే నేనొక ఫెయిల్డ్ పొలిటీషియన్‌ అన్నారు. దానిని అంగీకరిస్తానన్నారు. అందుకు తాను బాధపడనని, ఎందుకంటే ఓటమి విజయానికి సగం బాట వేస్తుందన్నారు. వైఫల్యాలను కూడా సానుకూల దృక్పథంతో చూస్తానన్నారు. సమాజంలో మార్పు కావాలని కోరుకునే చాలా మంది ఏం చేయడం లేదని, కానీ నేను అలా కాదన్నారు. తన ప్రయత్నంతో ఎంతో కొంత సాధించానన్నారు.  


రెండు స్థానాల్లో ఓడినా? 


2014లో జనసేన పార్టీని ప్రారంభించిన పవన్ కల్యాణ్ అప్పుటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయలేదు. టీడీపీ-బీజేపీ కూటమికి జనసేన మద్దతు తెలిపింది.  ఆ ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ కూటమి విజయం సాధించింది. అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీకి స్వస్తి చెప్పిన పవన్ వామపక్ష పార్టీలతో కలిసి ఎన్నికల్లో పోటీ చేశారు. జనసేన పార్టీ నుంచి ఒక్క ఎమ్మెల్యేగా గెలవగా, పోటీ చేసిన రెండు స్థానాల్లో పవన్ ఓటమిపాలయ్యారు. ఎన్ని ఓటములు ఎదురైనా ప్రజల కోసం తన జీవితంలో 25 సంవత్సరాలు కేటాయించానని పవన్ చెబుతున్నారు. ప్రస్తుతం బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా రాజకీయాలు చేస్తుంది. ఏపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తిచూపిస్తూ తరచూ పవన్ ఘాటైన విమర్శలు చేస్తున్నారు.