Governor Tamilisai : తెలంగాణ ప్రభుత్వం, గవర్నర్ మధ్య ప్రోటోకాల్ వివాదం నడుస్తోంది. కేసీఆర్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా ప్రోటోకాల్ పాటించడంలేదని గవర్నర్ తమిళిసై ఆరోపిస్తు్న్నారు. తాజాగా ఆమె మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రోటోకాల్‌ పాటించడం లేదన్నారు. చాలా కాలంగా ముఖ్యమంత్రి కేసీఆర్ తనను కలవలేదన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 167 ప్రకారం గవర్నర్‌తో సీఎం కాలానుగుణంగా చర్చలు జరపడం తప్పనిసరి అని, కానీ తెలంగాణలో అలా జరగడం లేదన్నారు. రెండేళ్లుగా సీఎంను కలవలేదన్నారు. గవర్నర్, సీఎంతో సత్సంబంధాలు ఉండాలి, కానీ తెలంగాణలో ఆ పరిస్థితి లేదని, అందుకు  కారణం తాను కాదని గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ స్పష్టం చేశారు.  






గవర్నర్ కీలక వ్యాఖ్యలు 


తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ పై గవర్నర్ తమిళిసై మ‌రోసారి కీల‌క కామెంట్స్ చేశారు. సోమ‌వారం ఏఎన్ఐతో మాట్లాడుతూ... భార‌త రాజ్యాంగం ప్రకారం గవర్నర్ కు సీఎం విధిగా ప్రోటోకాల్ పాటించాల్సి ఉంద‌ని స్పష్టం చేశారు. ఆర్టిక‌ల్ 167 ప్రకారం గ‌వ‌ర్నర్ తో సీఎం చ‌ర్చలు జ‌ర‌ప‌డం త‌ప్పనిస‌రి అన్నారు. దీనిని తెలంగాణ ప్రభుత్వం గ‌మ‌నించ‌కపోవ‌డం విడ్డూరంగా ఉంద‌న్నారు. ప్రస్తుతం తెలంగాణ‌లో ఏక‌వ్యక్తి పాల‌న సాగుతోంద‌న్నారు. రాష్ట్రాభివృద్ధి జరగాలంటే, పాల‌న స‌జావుగా సాగాలంటే సీఎం విధిగా త‌న‌తో చర్చలు జరపాలని గవర్నర్ తమిళి సై స్పష్టం చేశారు.


పెండింగ్ బిల్లులు క్లియర్ 


అయితే కీలకమైన బిల్లులు గవర్నర్ కావాలనే పెండింగ్ లో పెట్టారని బీఆర్ఎస్ ప్రభుత్వం ఆరోపిస్తుంది. పెండింగ్ బిల్లులపై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టు మెట్లు ఎక్కింది. ఈ పిటిషన్ పై సుప్రీంకోర్టులో విచారణ మొదలయ్యే టైంకి గవర్నర్ తమిళి సై కీలక నిర్ణయం తీసుకున్నారు. పెండింగ్ బిల్లుల‌ను గవర్నర్ క్లియర్ చేశారు. మూడు బిల్లుల‌కు సంబంధించి నిర్ణయం తీసుకోవాల్సి ఉండ‌గా ఒక దానిని తిర‌స్కరించగా, మిగిలిన రెండు బిల్లుల‌కు సంబంధించి ప్రభుత్వాన్ని వివ‌ర‌ణ కోరారు. డైరెక్టరేట్ ఆఫ్ మెడిక‌ల్ ఎడ్యుకేష‌న్ వ‌యో ప‌రిమితి బిల్లును గవర్నర్ తిర‌స్కరించారు. దీంతో పాటు మున్సిప‌ల్ రూల్స్ , ప్రైవేట్ వ‌ర్సిటీల బిల్లుపై రాష్ట్ర ప్రభుత్వం వివ‌ర‌ణ ఇవ్వాల‌ని సూచించారు. ఇక తమ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్ లో లేవని రాజ్ భవన్ ప్రకటన చేసింది.  


పెండింగ్ బిల్లులు వీలైనంత త్వరగా  క్లియర్ చేయండి-  సుప్రీంకోర్టు 


 పెండింగ్ బిల్లులపై తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరిగింది.  గవర్నర్ తరఫున ఏసీ వాదనలు వినిపిస్తూ.. గవర్నర్ వద్ద ఎలాంటి బిల్లులు పెండింగ్‌లో లేవని కోర్టుకు తెలిపారు.  కొన్ని బిల్లులు వాపస్ పంపినట్లు తెలిపారు.  రాష్ట్ర ప్రభుత్వం తరపున దుష్యంత్ దవే మాట్లాడుతూ.. ఎన్నికైన ప్రభుత్వం గవర్నర్ దయ కోసం చూడాల్సి వస్తుందన్నారు. ఇరుపక్షాల వాదనలు విన్న న్యాయస్థానం.. వీలైనంత త్వరగా బిల్లులను క్లియర్ చేయాలని గవర్నర్ ను ఆదేశించింది.  బిల్లులు పెండింగ్‌లో లేకపోవడంతో కేసును మూసివేస్తున్నట్లు తెలిపారు.