Fish Prasadam: మూడేళ్ల తర్వాత హైదరాబాద్ లో చేప ప్రసాదం పంపిణీకి ముహూర్తం ఖరారు అయింది. జూన్ 9వ తేదీ నుంచి చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేయబోతున్నారు. ఈక్రమంలోనే డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో రాష్ట్ర, పశుసంవర్ధక, మత్స్య శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ను బత్తిని కుటుంబ సభ్యులు మంగళవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా చేప మందు ప్రసాదం పంపిణీపై మంత్రి తలసానితో మాట్లాడారు. జూన్ 9వ తేదీన మృగశిర కార్తె సందర్భంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు.


ప్రభుత్వ ఆధ్వర్యంలో చేప ప్రసాదం పంపిణీకి ఏర్పాట్లు చేయనున్నారు. ప్రతి ఏటా మృగశిర కార్తె సందర్భంగా ఆస్తమా బాధితులకు బత్తిన సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే కరోనా కారణంగా గత మూడేళ్లుగా చేప ప్రసాదం పంపిణీని ఆపేశారు. అయితే ఈ ఏడాది నుంచి చేప ప్రసాదం పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీంతో ఎప్పటిలాగే నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో బత్తిన సోదరులు ఉచితంగా చేప ప్రసాదం పంపిణీ చేయనున్నారు. 


170 ఏళ్ల నుంచి చేప మందు పంపిణీ..!


చేప ప్రసాదం కోసం ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఉబ్బసం వ్యాధి గ్రస్తులు హైదరాబాద్ కు వస్తుంటారు. బత్తిన సోదరులు అందించే చేప ప్రసాదం కోసం జనాలు కీలో మీటర్ల మేర బారులు తీరుతారు. కరోనా తర్వాత తొలిసారి చేప ప్రసాదం పంపిణీ చేస్తుండడంతో... ఈ సారి జనం భారీగా తరలి వచ్చే అవకాశం ఉందని నిర్వాహకులు భావిస్తున్నారు. ఇందుకు తగ్గ ఏర్పాట్లు చేయాలని కూడా ఇప్పటికే నిర్ణయించారు. దాదాపు 170 ఏళ్ల నుంచి బత్తిని వంశస్తులు ఆస్తమా పేషెంట్ల కోసం నగరంలో చేప ప్రసాదం పంపిణీ చేస్తున్నారు. కానీ కరోనా వైరస్ వ్యాప్తితో 2020లో తొలిసారి చేప ప్రసాదం పంపిణీకి బ్రేక్ పడింది. కరోనా వ్యాప్తి చెందుతున్న కారణంగా, కొవిడ్19 నిబంధనలు పాటిస్తూ రాష్ట్ర ప్రభుత్వం చేప ప్రసాదం పంపిణీకి అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత రెండేళ్లు కూడా ప్రభుత్వం నో చెప్పడంతో ఆస్తమా పేషెంట్లకు నిరాశే ఎదురైంది.