Hyderabad Cycling Track: హైదరాబాద్ లో వినూత్నమైన సైకిల్ ట్రాక్ అందుబాటులోకి రానుంది. సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ హైదరాబాద్ కు ఒక ట్రెండ్‌సెట్టర్‌గా మారబోతుంది. రెండు మార్గాల్లో 23 కిలో మీటర్ల పొడవునా సోలార్ సైక్లింగ్ ట్రాక్‌ ను తెలంగాణ ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఆగస్టు 15వ తేదీన ప్రారంభించేందుకు అవసరమైన పనుల్లో రాష్ట్ర సర్కారు నిమగ్నమైంది. ఐటీ కారిడార్ లోని నానక్ రాంగూడ నుంచి తెలంగాణ పోలీస్ అకాడమీ వరకు ఎనిమిది కిలోమీటర్లు, నార్సింగి నుంచి కోంపల్లి వరకు 15 కిలో మీటర్ల మేర ట్రాక్ ను ఏర్పాటు చేస్తోంది. హైదరాబాద్ మెట్రో పాలిటన్ డెవలప్ మెంట్ అథారిటీ విభాగమైన హైదరాబాద్ గ్రోత్ కారిడార్ లిమిటెడ్ 4.5 మీటర్ల వెడల్పులో మూడు లేన్లుగా సైక్లింగ్ ట్రాక్ ను నిర్మిస్తుంది. రోడ్డుమార్గంతోపాటు ఫెన్సింగ్ తో కూడిన నిర్మాణం పూర్తయింది. సోలార్ ప్యానల్స్ ను బిగించాల్సి ఉంది.  


సైకిల్ ట్రాక్ పై పరుగులు పెట్టేందుకు సైకిళ్లను సైతం అందుబాటులో ఉంచేందుకు హెచ్ఎండీఏ చర్యలు చేపట్టింది. రెండు మార్గాల్లో నగర వాసులకు సైకిళ్లను కిరాయికి ఇచ్చేందుకు, వాటి నిర్వహణ కార్యకలాపాలు చేపట్టేందుకు ఏజెన్సీలను ఎంపిక చేసే పనుల్లో అధికారులు నిమగ్మమై ఉన్నారు. ఈ నెలాఖరు వరకు సైకిళ్లను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామని హెచ్ఎండీఏ అధికారులు తెలిపారు. ట్రాక్ పైకి సొంత, రెంట్‌ సైకిళ్లు తిరిగేలా ఏర్పాటు చేస్తున్నారు. ఈనెల 13వ దీనికి ప్రీ బిడ్ సమావేశాన్ని అధికారులు వివరించారు. ఈనెల 25న టెండర్లను తెరిచి, అర్హులైన వారిని ఎంపిక చేస్తామని అధికారులు వివరించారు. పార్కింగ్ స్థలాలు, నిఘా కెమెరాలు, సైకిల్ డాకింగ్, ఫుడ్ కోర్టులు, తాగునీరు, విశ్రాంతి గదులు, ప్రాథమిక రిపేర్ షాపులు, ఇతర మౌళిక సదుపాయలు అందుబాటులో ఉంటాయి. 


ఓఆర్ఆర్ వెంబడి..


ఓఆర్‌ఆర్‌ సర్వీస్‌ రోడ్డు వెంబడి సైకిల్‌ ట్రాక్‌ నిర్మాణం, సోలార్‌ ప్యానెల్స్ ఏర్పాటు తదితర పనులకు ఇటీవల టెండర్లు పిలిచారు. నార్సింగి నుంచి కొల్లూరు వరకు 13 కిలో మీటర్లు, నానక్ రామ్‌గూడ నుంచి తెలంగాణ రాష్ట్ర పోలీసు అకాడమీ (టీఎస్‌పీఏ) వరకు 8 కిలో మీటర్ల మేర ఈ ట్రాక్‌ నిర్మించనున్నారు. ఇది సర్వీస్ రోడ్డు, ORR  క్యారేజ్ వే మధ్య అభివృద్ధి చేస్తారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ (GHMC) పరిధిలో నిర్మాణంలో ఉన్న సైకిల్ ట్రాక్‌ల్లా  కాకుండా, ఈ సైకిల్ ట్రాక్ సైక్లిస్టులకు ఎండ, వర్షం ఇతర కఠినమైన వాతావరణ పరిస్థితుల నుంచి రక్షణను అందిస్తుంది. అలాగే సాధారణ ట్రాఫిక్ నుంచి దూరంగా ఉండడంతో భద్రతకు  భరోసా ఇస్తుంది.  


సోలార్ రూఫింగ్ ద్వారా 16 మెగావాట్స్ విద్యుత్ 


సైక్లిస్టుల కోసం ఫుడ్ కోర్టులు, నిఘా కెమెరాలు, తాగునీరు, సైకిల్ రిపేర్ షాపులు కూడా ట్రాక్ పక్కన ఏర్పాటు చేయనున్నారు. ఇవి  24×7 లైటింగ్ తో ఉంటాయి. లైటింగ్ కోసం సోలార్ రూఫ్ ఏర్పాటు చేస్తారు. సైకిల్ ట్రాక్ సోలార్ రూఫింగ్ ద్వారా దాదాపు 16 MW శక్తిని ఉత్పత్తి చేయవచ్చని అధికారులు అంటున్నారు. ఈ సోలార్ పవర్ ను ORR వెంబడి డ్రిప్ ఇరిగేషన్, వీధిలైట్ల కోసం వినియోగిస్తారని HMDA అధికారులు తెలిపారు. ప్రాజెక్ట్ కోసం రెన్యూవబుల్ ఎనర్జీ సర్వీస్ కంపెనీ (RESCO) మోడల్‌ను స్వీకరించారు. దీని ప్రకారం ఒక RESCO ఆపరేటర్ సోలార్ రూఫ్ కోసం అయ్యే వ్యయాన్ని పెట్టుబడి పెట్టనున్నట్లు అధికారులు చెప్పారు. దీనిని 25 సంవత్సరాల పాటు నిర్వహిస్తారు.