CS Somesh Kumar On Floods :  రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాలలో సహాయ, పునరావాస చర్యలలో భారత సైన్యానికి చెందిన 101 మంది బృందం పాల్గొంటుందని తెలంగాణ సీఎస్ సోమేశ్​ కుమార్ తెలిపారు. సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు వరద ప్రాంతాల్లో సహకరించాల్సిందిగా భారత సైన్యాన్ని కోరామని సీఎస్ తెలిపారు. దీనికి స్పందించిన ఆర్మీ 68 మంది సైనికులు, 10 మంది సభ్యుల వైద్య బృందం, 23 మంది సభ్యుల ఇంజినీరింగ్ బృందాన్ని సహాయ చర్యల్లో పాల్గొనేందుకు పంపిందన్నారు. ఆర్మీ బృందం భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు వెళ్తున్నాయని వర్షాలు, వరదలు, పునరావాస, సహాయక చర్యలపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు.  


రంగంలోకి గజఈతగాళ్లు 


సహాయ, పునరావాస చర్యల్లో పాల్గొనేందుకు పర్యాటక శాఖకు చెందిన ప్రత్యేక పడవలను సిబ్బందితో సహా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పంపామని సీఎస్ తెలిపారు. అగ్నిమాపక విభాగానికి చెందిన 7 పడవలు సిద్ధంగా ఉన్నాయని, లైఫ్ జాకెట్లు ఉన్న 210 మంది ఈతగాళ్లు ఇప్పటికే అందుబాటులో ఉన్నారని  సీఎస్ పేర్కొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో సహాయ, పునరావాస కార్యక్రమాలను పర్యవేక్షించడానికి సీనియర్ ఐఏఎస్, సింగరేణి కాలరీస్ ఎండీ ఎం. శ్రీధర్ ను ప్రత్యేక అధికారిగా నియమించామని సీఎస్ సోమేశ్ కుమార్ తెలిపారు. సింగరేణి సంస్థకు చెందిన యంత్రాంగాన్ని ఈ సహాయ, పునరావాస చర్యలకు ఉపయోగించాలని సీఎస్ ఆదేశించారు. భద్రాద్రి జిల్లాతో పాటు ములుగు, జయశంకర్ భూపాలపల్లి, పెద్దపల్లి జిల్లాల్లో వరద పరిస్థితులపై అధికారులు, ఆయా జిల్లాల కలెక్టర్లతో సీఎస్ సోమేశ్ కుమార్ నిరంతరం సమీక్షిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రాణనష్టం జరగకుండా జాగ్రత్తలు చేపట్టాలని సీఎస్ అధికారులను ఆదేశించారు. 


జలదిగ్బంధంలో భద్రాచలం 


 భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం అంతకంతకు పెరిగిపోతోంది. తాజాగా భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం రికార్డు స్థాయిలో 69.90 అడుగులకు చేరుకుంది. 23 లక్షల 70 వేల 704 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. దీంతో భద్రచాలం గుడి చుట్టుపక్కల ప్రాంతాలకు నీరు చేరుకుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. గురువారం రాత్రి నుంచి ట్రాక్టర్లు, లారీలు, ఇతర వాహానాల ద్వారా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. నిన్న రాత్రే బూర్గంపాడు మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయం, పోలీస్ స్టేషన్ కూడా నీటమునిగాయి సారపాకలోని నేషనల్ హైవే 30పై వరద చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సారపాక జల దిగ్బంధంలో చిక్కుకోవడంతో ఇతర ప్రాంతాలతో సంబంధాలు కోల్పోయింది. ప్రముఖ కాగితపు పరిశ్రమ ఐటీసీలోకి  కూడా నీరు చేరటంతో ఐటీసీ యాజమాన్యం పరిశ్రమను తాత్కాలికంగా మూసివేసింది.