Hyderabad Crime : గత కొంత కాలంగా పలు పోలీస్ స్టేషన్ పరిధిలలో దొంగతనాలకు పాల్పడుతున్న తమిళనాడుకు చెందిన నలుగురు నిందితుల ముఠాను మాదాపూర్ సీసీఎస్, కేపీహెచ్బీ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి 5 లక్షల నగదు, 3 ల్యాప్ ట్యాప్ లు, 2 మొబైల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై 2015 నుంచి ఇప్పటి వరకు 17పోలీస్ స్టేషన్లలో 105 కేసులు ఉన్నట్లు డీసీపీ శ్రీనివాసరావు వెల్లడించారు. వారి వద్ద నుంచి 5 లక్షల నగదు, 3 ల్యాప్ ట్యాప్ లు, 2 మొబైల్ ఫోన్లు, స్వాధీనం చేసుకున్నారు. నిందితులు వడివేలు(27), మరియప్పన్(28), సత్తివేలు (23), సత్య రాజ్(20) తమిళనాడు వేలూరుకు చెందిన వారని పోలీసులు తెలిపారు. చెవిటి, మూగ గుడ్డి వాళ్లలా నటిస్తూ రెక్కీ చేస్తుంటారని, ఎవరికైనా అనుమానం వచ్చి అడిగితే ముందే ప్రింట్ తీసి పెట్టుకున్న పేపర్స్ చూపించేవారనీ తెలిపారు పోలీసులు.
ముగ్గురు బెట్టింగ్ రాయుళ్లు అరెస్ట్
ఐపీఎల్ అంటేనే బెట్టింగ్! ఎంత నిఘా వేసినా, చాపకింద నీరులా దందా సాగుతుంది! అవి కొన్నిచోట్ల ఎంత ఆర్గనైజ్డ్‌గా జరుగుతాయో తెలుసుకుంటే కళ్లు బైర్లు కమ్ముతాయి! కరెన్సీ కట్టలు తెంచుకుంటుంది! పెద్దనోట్లన్నీ గుట్టలు గుట్టలుగా పోగుపడుతుంటాయి! ఈజీ మనీకి అలవాటు పడి క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్న ముగ్గురిని హైదరాబాద్ బాచుపల్లి పోలీసులు అరెస్టు చేశారు. ప్రగతి నగర్ లోని కేఎస్ఆర్ క్లాసిక్ అపార్ట్ మెంట్ లో 20-20 ఆన్ లైన్ బెట్టింగ్ శిబిరంపై బాలానగర్ ఎస్వోటీ, బాచుపల్లి పోలీసులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. గణేష్ కుమార్, శ్రీనివాస్ రావు, రాంబాబు అనే ముగ్గురు క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడుతున్నారనే సమాచారంతో దాడి చేసి అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ల్యాప్ టాప్ లు, ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులను ఉపయోగించి బెట్టింగ్ కు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద రూ.20.3 లక్షల నగదు, 7 ఫోన్లు, 1 బైక్, మరికొన్ని ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారి బ్యాంక్ ఖాతాలో మరో 2.2 లక్షల నగదు ఉన్నట్లు గుర్తించి సీజ్ చేసినట్లు పోలీసులు పేర్కొన్నారు. పరారీలో గణేష్, పాండు, రాజేష్ లు ముగ్గురు ప్రధాన బుకీలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. పట్టుబడ్డ నిందితులను రిమాండ్ కు తరలించారు. ఈ సందర్బంగా కుకట్ పల్లి ఏసీపీ చంద్రశేఖర్ మాట్లాడుతూ...బెట్టింగ్ కు పాల్పడితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
పోలీసులు ఇచ్చే సలహా ఏంటంటే..
త్వరగా డబ్బు సంపాదించాలనే అత్యాశతో క్రికెట్ బెట్టింగ్ ఒక వ్యసనంగా మారింది. ఈ ఆటలో బుకీలు మాత్రమే డబ్బు సంపాదిస్తారు. పంటర్లు డబ్బును పోగొట్టుకుంటారు. ఇది నిత్యం జరిగేదే. ఇలాంటి దందా మూలంగా బ్యాంక్ అకౌంట్, వ్యక్తిగత డేటా సైబర్ నేరగాళ్ల చేతికి చిక్కే అవకాశం ఉంది. బుకీలు సంపాదించుకుంటారు. బాధితులు అప్పుల పాలవుతుంటారు. అవసరమైతే ఆస్తులు అమ్ముకుంటారు. వీలైతే తాకట్టు పెడతారు. ఎంతకైనా దిగజారుతారు. అందుకే ఇలాంటి బెట్టింగుల జోలికి పోవద్దని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఎవరి దృష్టికైనా ఇలాంటి దందా సమాచారం తెలిస్తే సైబరాబాద్ పోలీసులు వాట్సాప్ నెంబర్ ఇచ్చారు. 94906 17444 ఈ నంబర్‌కు బెట్టింగ్ డిటెయిల్స్ తెలియజేయవచ్చు.