MP Komatireddy Venkatreddy : తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ మాణిక్ రావు థాక్రేతో ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం ఉదయం భేటీ అయ్యారు. ఈ సమావేశంలో అనంతరం మీడియాతో మాట్లాడిన కోమటిరెడ్డి... కాంగ్రెస్ అధిష్ఠానం తనకు ఇచ్చిన షోకాజ్ నోటీసులు ఎప్పుడో చెత్తబుట్టలో పడ్డాయన్నారు. కాంగ్రెస్ ఇన్ ఛార్జ్ మాణిక్ థాక్రే కాల్ చేసినా తాను గాంధీ భవన్ కు రాలేనని కోమటిరెడ్డి చెప్పినట్లు వార్తలు వచ్చాయి. దీనిపై స్పందించిన ఆయన... నియోజకవర్గ పర్యటనలో ఉన్నందు వల్లే మాణిక్ రావు థాక్రేను బుధవారం కలవలేకపోయానని తెలిపారు. ముందు ఎమ్మెల్యేలు సీతక్క, వీరయ్య, జగ్గారెడ్డి ఎందుకు థాక్రేను కలవలేదో అడగాలన్నారు. పీసీసీ కమిటీలను తాను పట్టించుకోనన్నారు.  ఆరేడుసార్లు ఓడిపోయిన వాళ్లతో తాను కూర్చోవాలా? అంటూ  కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు.






నీ పని నువ్వు చేసుకో అన్నారు 


ఏఐసీసీ షోకాజ్ నోటీసులను ఎప్పుడో చెత్త బుట్టలో పడ్డాయని ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. తమ ఫొటోలను మార్ఫింగ్ చేశారని స్వయానా సీపీ తనకు చెప్పారన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ ఎలా  ముందుకు తీసుకువెళ్లాలో చెప్పానన్నారు. అయితే ముందు నీ పని నువ్వు చేసుకో అని కొత్త ఇన్ ఛార్జ్ థాక్రే చెప్పారన్నారు.  ప్రజల్లో ఉండి యుద్ధం చేయాలని సూచించారన్నారు. మాణిక్ థాక్రేతో తనకు ముందే పరిచయం ఉందన్నారు. షోకాజ్ నోటీసు అనేది లేనేలేదన్నారు. ఫొటోల మార్ఫింగ్ చేశారని, అది ముగిసిన అంశం అంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు.


కోమటిరెడ్డికి థాక్రే ఫోన్ 


తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ బాధ్యతలు స్వీకరించిన మాణిక్ రావు థాక్రే టీపీసీసీ నేతలు, కాంగ్రెస్ అసమ్మతి నేతలు వరుసగా భేటీ అవుతున్నారు. ఇందులో భాగంగా ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డిని గాంధీభవన్ కు రావాలని ఆహ్వానించారు. కానీ అందుకు ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి నిరాకరించినట్లు తెలిసింది. గాంధీభవన్ లో కాకుండా బయట కలుస్తాయని చెప్పారని వార్తలు వచ్చాయి.  


మునుగోడు తర్వాత గ్యాప్ 


మునుగోడు ఉపఎన్నికను ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి దూరంగా ఉంటున్నారు. ఆయన సోదరుడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరారు. మునుగోడు ఉపఎన్నికలో రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా వ్యవహరించారని కోమటిరెడ్డికి పార్టీ అధిష్ఠానం షోకాజ్ నోటీసులు ఇచ్చింది. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలోనూ కోమటిరెడ్డి పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు.  తరచూ బీజేపీ నేతలు, దిల్లీలో ప్రధాని మోదీతో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి భేటీ అవుతున్నారు. దీంతో తమ్ముడు రాజగోపాల్‌ రెడ్డి బాటలోనే వెంకట్ రెడ్డి పయణించనున్నారని జోరుగా ప్రచారం సాగుతోంది.