Bhatti Vikramarka : దశాబ్దాల తెలంగాణ ప్రజ‌ల కోరిక‌ను కాంగ్రెస్ నేర‌వేర్చిందని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. హైదరాబాద్ లో శనివారం మాట్లాడిన ఆయన... నీళ్లు ,నిధులు, నియామకాల ఆకాంక్షల‌ను నేర‌వేర్చడం కోసమే సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. తెలంగాణ ప్రజ‌ల ఆకాంక్షల‌ను మాత్రం టీఆర్ఎస్ నేర‌వేర్చడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం 8 సంవత్సరాలుగా రాష్ట్ర ఆదాయాన్ని, సంపదను, అప్పుల‌ మొత్తన్నీ కాళేశ్వరంలో దార‌పోశారన్నారు.  గోదావ‌రి వ‌ర‌ద‌ల‌కు కాళేశ్వరం మునిగిపోయిందని, ర‌క్షణ గోడ‌లు కూలి నిరుప‌యోగంగా మార‌డం వ‌ల్ల  రాష్ట్ర ప్రజ‌ల సంప‌ద నీళ్ల పాలైందని విమర్శించారు. ఇది కచ్చితంగా ప్రభుత్వ నిర్లక్ష్యమే అని భట్టి విక్రమార్క ఆరోపించారు.  


కాళేశ్వరం ప్రాజెక్టును చూడనివ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారు? 


కాళేశ్వరం ద్వారా ప‌ద్దెనిమిదిన్నర‌ లక్షల అదనపు ఎకరాలకు సాగు నీరు ఇస్తామ‌ని చెప్పి ఒక్క ఎక‌రానికి కూడా సాగు నీరు ఇవ్వలేదని భట్టి విక్రమార్క ఆరోపించారు. గోదావ‌రి వ‌ర‌ద నీటితో పంపులు వాల్వ్ లు కూడా మునిగిపోయాయన్నారు. మెడిగడ్డ , అన్నారం, సుందిళ్ళ పంపులు ఇంకా పనిచేస్తున్నాయా లేదా.. ఎందుకు చెప్పడం లేదని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు వ‌ద్దకు వెళ్తే ఎందుకు అడ్డుకుంటున్నారన్నారు. అక్కడ పని చేసే వర్కర్లు ఫోన్ లు కూడా ఎందుకు తీసుకుపోనివ్వడం లేదన్నారు.  అక్కడ దాగి ఉన్న ర‌హ‌స్యాలు ఏమిటని ప్రశ్నించారు. కాళేశ్వరంలో ఏం జ‌రుగుతుందో ప్రభుత్వం ప్రజ‌ల‌కు చెప్పాలన్నారు.


ప్రజాసమస్యలు గాలికొదిలేసి దిల్లీలో సీఎం 


కాళేశ్వరం ప్రాజెక్టును చూడనివ్వకుండా ఎందుకు అడ్డుకుంటున్నారో చెప్పండి?. స‌మ‌గ్ర స‌మాచారం వెంట‌నే బ‌య‌ట‌పెట్టాలి. సీఎల్పీ బృందంతో కాళేశ్వరం ప్రాజెక్టు  విజిట్ చేస్తాను. మా పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి వెళ్తా. అందరినీ ఆపినట్టు మమ్మల్ని ఆపితే టీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. రాష్ట్ర ప్రజ‌లు స‌మ‌స్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతుంటే.. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు ఆక‌లి కేక‌ల‌తో అల‌మ‌టిస్తుంటే ప్రజ‌ల స‌మ‌స్యల‌ను గాలికి వ‌దిలేసి సీఎం కేసీఆర్ ప్రభుత్వ అధికారుల‌ను వెంట‌బెట్టుకొని దిల్లీకి ఎందుకు పోయారు? అస‌లు రాష్ట్రంలో ప్రభుత్వం ఉందా? ప‌రిపాల‌న సాగుతుందా?- సీఎల్పీ నేత, భట్టి విక్రమార్క


కాంగ్రెస్ లోనే రాజగోపాల్ రెడ్డి 


మంత్రి కేటీఆర్ కాలుకు గాయామై ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారని, మిగ‌తా మంత్రులు మాట్లాడే ప‌రిస్థితి లేదని సీఎల్పీ నేత భట్టి విక్రమార్క అన్నారు. కేసీఆర్ దిల్లీలో ఉంటే ప్రజ‌ల స‌మ‌స్యలు ఎవ‌రు ప‌ట్టించుకోవాలని ప్రశ్నించారు. కాళేశ్వరం, వ‌ర‌ద ముంపు ప్రాంతాల్లో జ‌రిగిన నష్టం, ప్రజ‌లు ఎదుర్కొంటున్న స‌మ‌స్యల‌పై చ‌ర్చించ‌డం కోసం వెంట‌నే ప్రభుత్వం వ‌ర్షకాల అసెంబ్లీ స‌మావేశాల‌ను ఏర్పాటు చేయాలన్నారు.  సొంత రాజ‌కీయ ప్రయోజ‌నాల కోసం రాష్ట్రాన్ని తాక‌ట్టుపెట్టొద్దని టీఆర్ఎస్‌ నేతలను భట్టి హెచ్చరించారు. ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్‌లో ఉంటారని, ఆయ‌న‌తో పార్టీ అధిష్టానం కూడా మాట్లాడిందన్నారు.  ఆయనకు ఉన్న ఇబ్బంది తెలుసుకొని పరిష్కరిస్తామన్నారు. ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి విషయంలో ప్లాన్‌ A విఫలమైతే ప్లాన్‌ B అమలు చేస్తామన్నారు. రాజగోపాల్‌రెడ్డి పార్టీని వీడకుండా చర్చలు జరుపుతున్నామన్నారు.