Bhatti Vikramarka Padayatra : తెలంగాణ కాంగ్రెస్ నేతలు పాదయాత్రల బాట పట్టారు. ఇప్పటికే టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, సీనియర్ నేత మహేశ్వర్ రెడ్డి పాదయాత్రలు చేస్తున్నారు. తాజాగా సీఎల్పీ నేతల భట్టి విక్రమార్క కూడా పాదయాత్ర ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగా ఈనెల 16 నుంచి జూన్ 15 వరకు 91 రోజులపాటు పాదయాత్ర చేపడుతున్నట్లు సీఎల్పి నేత భట్టి విక్రమార్క వెల్లడించారు. ఈ నెల 16న ఆదిలాబాద్ జిల్లా బోథ్ నియోజకవర్గంలోని బజార్ హత్నూర్ మండలం పిప్రి గ్రామంలో సాయంత్రం నాలుగు గంటలకు పాదయాత్రను ప్రారంభించనున్నామన్నారు.
39 నియోజకవర్గాల్లో 1365 కిలోమీటర్ల మేర పాదయాత్ర
ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు 39 నియోజకవర్గాల్లో 1365 కిలోమీటర్ల మేర భట్టి విక్రమార్క పాదయాత్రను డిజైన్ చేశారు. రాష్ట్ర ప్రజల ఆకాంక్షలు నెరవేరాలని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చిందని, కానీ బీఆర్ఎస్ దశాబ్ద పరిపాలనలో తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నిర్వీర్యం చేసిందని భట్టి విక్రమార్క ఆరోపించారు. బీఆర్ఎస్ పరిపాలనలో ఏ ఒక్క లక్ష్యాన్ని చేరుకోలేదని, దీంతో ప్రజలు నిరాశ నిస్పృహల్లో ఉన్నారని, నిరాశ నిస్పృహల్లో ఉన్న ప్రజలకు ధైర్యం ఇచ్చి వారికి మేము అండగా ఉన్నామని చెప్పడానికే తాను పాదయాత్ర చేస్తున్నాని తెలిపారు. నీళ్లు, నిధులు, నియామకాలు, ఆత్మగౌరవం, తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్ తోనే సాధ్యమవుతుందని పాదయాత్రలో ప్రజలకు ధైర్యం చెబుతామన్నారు. వచ్చే 2023- 24 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చి తెలంగాణ లక్ష్యాలను నెరవేరుస్తామన్నారు. దేశంలో గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థలను బీజేపీ ప్రభుత్వం నాశనం చేస్తుందని, దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ కుప్ప కూల్చిందని, ప్రధాని తన స్నేహితులైన క్రోనీ క్యాపిటలిస్టులకు ఈ దేశ సంపదను దోచిపెడుతున్నారని మండిపడ్డారు.
ఏఐసీసీ ఆదేశాలతోనే పాదయాత్ర
బీజేపీ నాశనం చేస్తున్న ఈ దేశాన్ని కాపాడటానికి రాహుల్ గాంధీ కన్యాకుమారి నుంచి కశ్మీర్ వరకు భారత్ జోడో యాత్ర నిర్వహించారని భట్టి విక్రమార్క గుర్తు చేశారు. రాహుల్ గాంధీ ఇచ్చిన సందేశాన్ని హాత్ సే హాత్ జోడో అభియాన్ యాత్ర కొనసాగింపుగా చేస్తున్న పాదయాత్ర ద్వారా ప్రతి గడపగడపకు తీసుకువెళ్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ భావజాలమే దేశానికి, రాష్ట్రానికి ఏకైక ప్రత్యామ్నాయ మార్గమని ఇంటింటికి చెప్తామన్నారు. ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు చేస్తున్న పాదయాత్రలో అన్ని జిల్లాల అధ్యక్షులు, పీసీసీ ఉపాధ్యక్షులు, పీసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ సభ్యులు, పార్టీ యంత్రాంగాన్ని భాగస్వాములు చేసే పర్యవేక్షణ ఏఐసీసీ నిర్వహిస్తున్నదన్నారు. పాదయాత్రలో భాగంగా మంచిర్యాల, హైదరాబాద్ శివారు, ఖమ్మంలో భారీ బహిరంగ సభలు ఉంటాయని, ఈ బహిరంగ సభలకు అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకులను తీసుకురావడానికి ఏఐసీసీ ఇన్చార్జిలు కసరత్తు చేస్తున్నారని తెలిపారు. ఏఐసీసీ అధ్యక్షుడు ఇచ్చిన ఆదేశాలతో సీఎల్పీ నాయకుడిగా తెలంగాణలో పాదయాత్ర చేయడానికి ప్రజల ముందుకు వస్తున్నానన్నారు.
కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం
ప్రజల శక్తి మేరకు తనతో నాలుగు అడుగులు వేసి కాంగ్రెస్ పార్టీకి జవసత్వాలు తీసుకొచ్చి బలోపేతం చేయాలన్నారు భట్టి విక్రమార్క. తెలంగాణ లక్ష్యాలు కాంగ్రెస్ ద్వారానే సాధ్యమని ప్రజలకు తెలియజెప్పి కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడానికి మన అడుగులు ఉపయోగపడాలన్నారు. తెలంగాణ ప్రజల గుండెచప్పుడు అవసరాలు ఆశయాలని కాంగ్రెస్ అజెండాగా మార్చుకొని నడుద్దామని కాంగ్రెస్ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. ప్రగతిశీల వాదులు ప్రజాస్వామికవాదులు మేధావులు కళాకారులు తెలంగాణ కోసం పోరాడిన పోరాట యోధులు ఆదిలాబాద్ నుంచి ఖమ్మం వరకు జరిగే తన పాదయాత్రలో భాగస్వాములై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.