Chikoti Casino Case : చీకోటి ప్రవీణ్ క్యాసినో కేసులో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పీఏ అశోక్ ను ఈడీ విచారణ చేస్తుంది. సోమవారం ఈడీ ముందు విచారణకు హాజరయ్యారు అశోక్. ఇప్పటికే తలసాని సోదరులు, మరో పీఏ హరీష్ ను ఈడీ విచారించింది. క్యాసినో దందాలో మనీలాండరింగ్ పై ఈడీ విచారణ చేపడుతోంది.  క్యాసినో మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ కొనసాగిస్తుంది. చీకోటి ప్రవీణ్‌ నిర్వహిస్తున్న క్యాసినో వ్యవహారంలో హవాలా లావాదేవీలు జరిగినట్లు ఈడీ గుర్తించి కేసు నమోదు చేసింది. ఈ కేసులో పలువురు ప్రముఖులను ఈడీ ఇప్పటికే విచారించింది. 


క్యాసినో కేసులో తలసాని సోదరులు!


మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరులను కూడా ఈడీ ఇప్పటికే విచారించింది. సోమవారం మంత్రి తలసాని పీఏ అశోక్ ను ఈడీ విచారిస్తుంది. ఈ కేసుకు సంబంధించి ఫెమా నిబంధనల ఉల్లంఘన, హవాలా నగదు చెల్లింపులపై ఈడీ అధికారులు ఆరా తీస్తున్నారు. క్యాసినో కేసులో చీకోటి ప్రవీణ్ ఇంట్లో, కార్యాలయాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. చీకోటి ప్రవీణ్ ను నాలుగు రోజుల పాటు విచారించిన ఈడీ కీలక ఆధారాలు సేకరించింది. ఈ లావాదేవీల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుల పేర్లు ఉండడంపై వారిని ఈడీ విచారించింది. మంత్రి తలసాని సోదరులు మహేష్ యాదవ్, ధర్మేంద్ర యాదవ్ కు నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో తాజాగా తలసాని పీఏను ఈడీ విచారిస్తుంది. తలసాని కుమారుడికి కూడా ఈడీ నోటీసులు ఇచ్చిందనే ప్రచారం జరుగుతోంది. అయితే తనకు ఎలాంటి నోటీసులు అందలేదని తలసాని కుమారుడు సాయి కిరణ్ స్పష్టం చేశారు. తలసాని పీఏ విచారణలో ఎలాంటి విషయాలు బయటకొస్తాయనేది ఆసక్తికరంగా మారింది. 


సినీ, రాజకీయ ప్రముఖులతో క్యాసినో


విదేశాల్లో క్యాసినో ఆడిస్తూ, కోట్లాది రూపాయల నగదు హవాల ద్వారా స్వదేశం నుంచి విదేశాలకు, విదేశాల నుంచి ఇండియాకు తరలించాడనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు చీకోటి ప్రవీణ్. సినీ, రాజకీయ ప్రముఖులను ప్రత్యేక విమానాల్లో క్యాసినో ఆడించేందుకు విదేశాలకు తీసుకెళ్లడంతోపాటు సినీ తారలతో క్యాసినో ఈవెంట్స్ ప్రచారం చేయించారు. అందుకుగానూ ఆ హీరోయిన్లకు భారీగా రెమ్యూనరేషన్లు చెల్లించడం.. ఇలా ఒకటేమిటి క్యాసినో కింగ్ గా తెలుగు రాష్ట్రాల్లో పేరు తెచ్చుకున్న చీకోటి ప్రవీణ్‌ ను ఈడీ ఇప్పటికే విచారించింది. విదేశాల్లో క్యాసినో ఎలా నిర్వహించేవారు, అందుకు డబ్బు ఎలా సేకరించేవారు. ఎవరెవరి వద్ద ఎంత వసూలు చేసేవారు.. ఇలా ఒకటేమిటి అనేక అంశాలపై ఈడీ విచారించింది. క్యాసినో కేసులో ప్రధాన నిందితుడు చీకోటి ప్రవీణ్, అతడికి సహకరించిన మాధవరెడ్డితో పాటు మరో ఇద్దరు నిర్వాహకులు సహా నలుగురు హవాలా బ్రోకర్స్ కు ఇప్పటికే ఈడీ విచారించినట్లు తెలుస్తోంది. చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో ఈడీ సోదాలు నిర్వహించి పలు కీలక పత్రాలను, ఆధారాలను సేకించింది. ప్రవీణ్, మాధవరెడ్డితోపాటు సంపత్, బబ్లు, రాకేష్, వెంకటేష్ లు బెట్టింగ్, హవాలాలో కీలకపాత్ర పోషించారని ఈడీ అనుమానిస్తోంది.