BJP MLAs Suspension: ఆర్ఆర్ఆర్ (రాజేందర్‌, రఘునందన్‌, రాజాసింగ్‌)ట్రైలర్ చూసే సీఎం కేసీఆర్ కు వణుకు పుడుతోందని బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్ విమర్శించారు. ఇక సినిమా రిలీజ్ అయితే ఆయన గుండె ఆగిపోతదేమో అని తీవ్రంగా వ్యాఖ్యానించారు. ప్రజాస్వామ్యబద్దంగా సభను కొనసాగించాలన్నారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని అమలు చేయాలని కోరడమే బీజేపీ ఎమ్మెల్యేలు చేసిన తప్పా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వాన్ని దూషించి, బీజేపీ ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేయాలనే లక్ష్యంతోనే టీఆర్ఎస్ ప్రభుత్వం బడ్జెట్‌ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు బండి సంజయ్‌ ఆరోపించారు. బడ్జెట్‌పై బీజేపీ ఎమ్మెల్యేలు ఈటల రాజేందర్, రఘునందన్, రాజాసింగ్ ప్రశ్నించకూడదనే సస్పెండ్ చేశారన్నారు. 
 
సమావేశాలు ఫాం హౌస్ లో నిర్వహించాల్సింది 






ప్రతిపక్షాలు లేకుండా ప్రగతిభవన్‌లో, ఫాం హౌస్‌లో సమావేశాలు నిర్వహించుకోవాలని బండి సంజయ్ ఎద్దేవా చేశారు. బీజేపీ ఆర్ఆర్ఆర్ ట్రైలర్‌కే సీఎం కేసీఆర్‌ భయపడుతున్నారని విమర్శించారు. ఎన్ని రోజులు సమావేశాలు జరుగుతాయో కూడా తెలియకుండానే బీజేపీ ఎమ్మెల్యేలను ఎలా సస్పెండ్ చేస్తారని బండి సంజయ్ నిలదీశారు. పక్కా ప్రణాళిక ప్రకారమే ఎమ్మెల్యేలను సస్పెండ్‌ చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ రాజ్యాంగం అమలవుతోందన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వానికి ఇదే చివరి బడ్జెట్‌ అవుతుందని బండి సంజయ్‌ అన్నారు. దొడ్డి దారిన ప్రతిపక్షాలను దెబ్బతీయాలని సీఎం కేసీఆర్‌ కుట్ర చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. 


టీఆర్ఎస్ ఎంపీల ఆందోళనలు గుర్తులేదా?


పార్లమెంట్‌ సమావేశాల్లోనూ టీఆర్ఎస్ ఎంపీలు చేసిన ఆందోళనను బండి సంజయ్ గుర్తు చేశారు. శాసనసభలో కూర్చునే అర్హత సీఎం కేసీఆర్‌కు లేదని ఆరోపించారు. బీజేపీ ఎమ్మెల్యేలపై తక్షణమే సస్పెన్షన్‌ ఎత్తివేయాలని  ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్యేలు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలన్నారు. సీఎం కేసీఆర్‌ ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ రేపటి నుంచి ప్రజాస్వామ్యబద్ధంగా ఆందోళనలు చేపట్టనున్నట్లు బండి సంజయ్‌ ప్రకటించారు. 



ఎమ్మెల్యేల సస్పెషన్ పై గవర్నర్ కు ఫిర్యాదు 


బీజేపీ నేతలు గవర్నర్ తమిళి సై ను కలిశారు. బీజేపీ ఎమ్మెల్యేల సస్పెషన్ పై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. ఓ లేఖను గవర్నర్ కు అందించారు. బడ్జెట్ సమావేశాలను గవర్నర్ ప్రసంగం లేకుండా ప్రారంభించిన ప్రభుత్వం అనవాయితీలు పాటించలేదని లేఖలో బీజేపీ నేతలు ఆరోపించారు. పక్కా ప్రణాళికతో ఎమ్మెల్యేలను సస్పెండ్ చేశారని గవర్నర్ దృష్టికి తీసుకొచ్చారు.