Bandi Sanjay : మునుగోడు ఉపఎన్నిక రిజెల్ట్స్ తెలంగాణ రాజకీయాలను మార్చబోతుందని బీజేపీ చీఫ్ బండి సంజయ్ అన్నారు. హైదరాబాద్‌లోని బీజేపీ ఆఫీస్ మీడియాతో మాట్లాడిన ఆయన.. మునుగోడులో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్‌ రెడ్డి విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పోలింగ్ ను సక్రమంగా నిర్వహించడంలో ఎన్నికల కమిషన్‌ కొన్ని చోట్ల విఫలమైందని బండి సంజయ్‌ ఆరోపించారు. ఓటు హక్కు వినియోగించుకుని మునుగోడు యువత ఆదర్శంగా నిలిచారన్నారు. రంగంతండా వాసుల సమస్యలు పరిష్కరించకుంటే మంత్రి కేటీఆర్‌ను ప్రజలు రోడ్డు మీద ఉరికిస్తారని అన్నారు. సాయంత్రం 6 గంటల వరకు క్యూలైన్‌లో ఉన్న వారికి మాత్రమే ఓటు వేసే అవకాశం కల్పించాలని బండి సంజయ్ కోరారు. అనేక ప్రలోభాలు, ఒత్తిళ్ల మధ్య ఓటు వేసిన మునుగోడు ప్రజలకు ధన్యవాదాలు అన్నారు. సీఎం కేసీఆర్‌ ఎన్నికల ప్రక్రియను నాశనం చేశారని మండిపడ్డారు. ఎన్నికల కమిషనర్‌ సీఎం కేసీఆర్‌ జేబులో మనిషిగా మారిపోయారని విమర్శించారు. పోలింగ్‌పై టీఆర్ఎస్ ఫేక్‌ సర్వేలను ప్రచారం చేస్తోందని బండి సంజయ్‌ ఆరోపించారు. 






అధికారులు గులాంగిరీ


"మునుగోడు ఎన్నికల ప్రచారం ప్రారంభం అయినప్పటి నుంచే అధికార పార్టీ మద్యం, డబ్బు, మంత్రులను విచ్చలవిడిగా ఉపయోగించుకుని ఓటర్లను మభ్యపెట్టారు. కేబినెట్ మొత్తాన్ని మునుగోడులో పెట్టారు. ఒక్కొక్క మంత్రి, ఎమ్మెల్యేలకు కోట్ల రూపాయల టార్గెట్ ఇచ్చి మీ పోలింగ్ బూత్ లలో టీఆర్ఎస్ కు అత్యధిక ఓట్లు రావాలని లేకుంటే మీ పోస్టు ఊడుతుందని వార్నింగ్ ఇచ్చారు. ఎన్నికల కమిషనర్ పూర్తిగా కేసీఆర్ జేబు మనిషిగా మారిపోయారు. ఆయన ఎందుకు ఉన్నారో అర్థం కాలేదు. అసలు ఉన్నారో లేదు అర్థం కాలేదు. ఎన్నికల కమిషనర్ టీఆర్ఎస్ పార్టీకి కొమ్ముకాశారు. మునుగోడులో స్థానికేతరులు 42 మంది ఉన్నారంటా?. వేల మంది అక్కడ ఉంటే వీళ్లకు కనిపించడంలేదా? 100కు పైగా ఫిర్యాదులు ఇస్తే ఒక్కరిపై చర్యలు తీసుకోలేదు. గులాం గిరీ చేసిన ఎన్నికల కమిషనర్ కు ధన్యవాదాలు." - బండి సంజయ్ 


ఎన్నికల కమిషనర్ పై ఫిర్యాదు చేస్తాం 


మునుగోడు ఎన్నికల్లో పోలీసుల సాయంతో టీఆర్ఎస్ ఎన్ని అరాచకాలకు పాల్పడినా మునుగోడు ఓటరు ప్రజాస్వామ్యాన్ని కాపాడారని బండి సంజయ్ అన్నారు. టీఆర్ఎస్ తొత్తులుగా మారిన పోలీసులు లాఠీఛార్జ్, దాడులతో భయభ్రాంతులకు గురిచేసినా బీజేపీ కార్యకర్తలు ప్రజాస్వామ్యబద్దంగా పోరాడారన్నారు.  టీఆర్ఎస్ ఎన్ని కుట్రలు, కుతంత్రాలు చేసినా మనీ, మద్యం ఏరులై పారించినా మునుగోడు గడ్డపై గెలిచేది బీజేపీ మాత్రమేనని ధీమా వ్యక్తం చేశారు. గులాబీలకు గులాంగిరీ చేసే అధికారుల, పోలీసుల అంతు చూస్తామని హెచ్చరించారు. కేసీఆర్ జేబు వ్యక్తిగా మారిన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిపై కచ్చితంగా ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు.   నిర్బంధాలు, బెదిరింపులు, ప్రలోభాలను చేధించుకుని ఓటు హక్కును వినియోగించుకున్న మునుగోడు ప్రజలందరికీ బీజేపీ తరపున  ధన్యవాదాలు అన్నారు. మునుగోడు ఓటింగ్ సరళి, శాతాన్ని చూశాక ప్రతి ఒక్కరికి స్ఫూర్తి నింపిందన్నారు. ఓటు హక్కును తప్పనిసరిగా వినియోగించాలనే సంకేతాలను పంపారన్నారు.  మునుగోడు ఎన్నికల ప్రచారం మొదలైనప్పటి నుండే అధికార పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల ద్వారా మందు, మనీ పారిస్తూ ప్రలోభాలకు గురిచేశారని విమర్శించారు.