Mlas Bribery Case : టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా ఈ కేసులో నిందితుడైన రామచంద్ర భారతిపై సిట్ అధికారుల ఫిర్యాదుతో మరో కేసు నమోదు అయింది.  బంజారాహిల్స్‌ పోలీస్ స్టేషన్ లో రామచంద్రభారతి రెండు పాస్‌పోర్టులు కలిగి ఉన్నాడని రాజేంద్రనగర్‌ ఏసీపీ, సిట్‌ సభ్యుడు ఫిర్యాదు చేశారు. దీంతో బంజారాహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద రామచంద్రభారతిపై కేసు నమోదు చేశారు. నిందితుడి ల్యాప్‌టాప్‌ను పరిశీలించినప్పుడు అందులో రెండు పాస్‌పోర్టులు ఉన్నట్టు సిట్ అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. రెండు వేర్వేరు నెంబర్లతో రామచంద్ర భారతి పాస్‌పోర్టులు కలిగి ఉన్నట్లు సిట్ అధికారి పోలీసులకు ఫిర్యాదు చేశారు.  ఆధార్‌, పాన్‌, డ్రైవింగ్‌ లైసెన్స్‌లు కూడా 3 చొప్పున కలిగి ఉన్నాడని రామచంద్రభారతిపై ఎమ్మెల్యే పైలట్‌ రోహిత్‌రెడ్డి ఇచ్చిన ఫిర్యాదుతో గతంలో ఒక కేసు నమోదైంది.


సిట్ అధికారులు వేధిస్తున్నారని హైకోర్టును ఆశ్రయించిన శ్రీనివాస్ 
 
దర్యాప్తు పేరుతో సిట్ అధికారులు వేధిస్తున్నారని లాయర్ శ్రీనివాస్ హైకోర్టును ఆశ్రయించారు. విచారణకు అందుబాటులో ఉండాలని సిట్ అధికారులు చెప్పారని, దీంతో  ఇతర పనులు ఏం చేయలేకపోతున్నానని శ్రీనివాస్ తరఫు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. దర్యాప్తుతో సంబంధంలేని విషయాలు అడుగుతున్నారన్నారు. ఇన్ కమ్ ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించిన వివరాలు తీసుకురావాలని అడుగుతున్నట్లు కోర్టుకు చెప్పారు. ఉదయం నుంచి రాత్రి వరకు సిట్ అధికారులు ప్రశ్నిస్తుండటం వల్ల శ్రీనివాస్ ఒత్తిడికి గురవుతున్నాడని కోర్టుకు వెల్లడించారు. ఈ కేసు దర్యాప్తులో భాగంగా ఇప్పటికే రెండు రోజులపాటు సిట్ అధికారులు శ్రీనివాస్‌ను ప్రశ్నించారన్నారు. మరోసారి ప్రశ్నించాల్సి ఉన్నందున పిలిచినప్పుడు రావాలని సిట్ అధికారులు శ్రీనివాస్‌కు చెప్పినట్లు న్యాయవాది బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు తెలిపారు. ఈ వాదనలను పరిగణనలోకి తీసుకున్న హైకోర్టు ఈ నెల 25న సిట్ ఎదుట హాజరై అధికారుల అడిగిన సమాచారాన్ని రాతపూర్వకంగా ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.


బీఎల్‌ సంతోష్‌కు మరోసారి నోటీసులు 


ఎమ్మెల్యేల కొనుగోలు ప్రయత్నం కేసులో  తెలంగాణ హైకోర్టు కీలక ఉత్తర్వులు ఇచ్చారు.  బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్‌ సంతోష్‌కు మరోసారి నోటీసులివ్వాలని సిట్‌కు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 41ఏ సీఆర్‌పీసీ కింద వాట్సాప్‌, ఈ మెయిల్‌ ద్వారా నోటీసులు పంపాలని తెలిపింది. ప్రభుత్వం పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలన్న హైకోర్టు.. తదుపరి విచారణను నెలాఖరుకు వాయిదా వేసింది. ఉదయం జరిగిన విచారణలో సుప్రీంకోర్టు ఉత్తర్వులు అప్ లోడ్ కాలేదని ప్రభుత్వ న్యాయవాది చెప్పడంతో మధ్యాహ్నానికి వాయిదా వేశారు. మధ్యాహ్నం సుప్రీంకోర్టు తీర్పు ప్రతులను హైకోర్టుకు సమర్పించారు. వాటిని పరిశీలించిన తర్వాత హైకోర్టు ధర్మాసనం వాదనలు విన్నది. బీజేపీ తరపున మహేష్‌ జెఠ్మలానీ వాదనలు వినిపించగా.. ప్రభుత్వం తరపున అడ్వకేట్‌ జనరల్‌ బీఎస్‌ ప్రసాద్‌ వాదించారు. సుప్రీంకోర్టు ఎక్కడా దర్యాప్తుపై స్టే ఇవ్వలేదని ఈ సందర్భంగా ఏజీ కోర్టుకు తెలిపారు. కేసుతో సంబంధం ఉన్నవాళ్లు ఎవరైనా నోటీసులు ఇస్తామని పేర్కొన్నారు. నోటీసులు ఇచ్చినా ఇప్పటి వరకు బీఎల్‌ సంతోష్‌ సహకరించడం లేదని, 41ఏ సీఆర్‌పీసీ ప్రకారం విచారణకు సహకరించాలని కోరినట్లు తెలిపారు. బీఎల్ సంతోష్ గుజరాత్ ఎన్నికల్లో బిజీగా ఉన్నాడని మహేష్ జెఠ్మలానీ కోర్టుకు తెలిపారు. ఎప్పటి వరకు సమయం కావాలని హైకోర్టు ప్రశ్నించింది. ఈ నెల 29న నివేదిక సమర్పించాలని హైకోర్టు చీఫ్ జస్టిస్ ఆర్డర్ ఉందని ఏజీ పేర్కొన్నారు.