AWS Investment In Hyderabad :హైదరాబాద్ లోని వెబ్ సర్వీసెస్ డేటా సెంటర్ లలో అమెజాన్ భారీ పెట్టుబడులు పెట్టనుంది. 2030 నాటికి రూ.36,300 కోట్ల పెట్టుబడులు పెడతామన్న అమెజాన్ సంస్థ హామీ ఇచ్చింది. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఎంపవర్ ఇండియా ఈవెంట్ లో దావోస్ నుంచి మంత్రి కేటీఆర్ వీడియాకాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు. అమెజాన్ అదనపు పెట్టుబడి, విస్తరణ ప్రణాళికలపై మంత్రి కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏషియా పసిఫిక్ రీజియన్ కేంద్రంగా ఉన్న హైదరాబాద్ లో 2030 నాటికి 36 వేల 300 కోట్ల రూపాయలను పెట్టుబడిగా పెట్టేందుకు అమెజాన్ ముందుకు రావడంపై కేటీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. అమెజాన్ సంస్థ భారీ పెట్టుబడులతో డేటా సెంటర్ ప్రధాన కేంద్రంగా తెలంగాణ మారుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. అమెజాన్, తెలంగాణ మధ్య మంచి సంబంధాలు ఉన్నాయన్న కేటీఆర్, సంస్థ విస్తరణ ప్రణాళికలకు తమ సంపూర్ణ సహకారం ఉంటుందన్నారు. 


మూడు డేటా సెంటర్లు 


భారత్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ వినియోగదారులకు అత్యుత్తమ క్లౌడ్ సేవలను అందించాలన్న లక్ష్యంలో భాగంగా హైదరాబాద్‌ చందన్‌వెల్లి, ఫ్యాబ్ సిటీ, ఫార్మా సిటీలో మూడు డేటా సెంటర్ లను అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఏర్పాటుచేసింది. ఈ మూడు డేటా సెంటర్ ల మొదటి దశ పూర్తై వినియోగదారులకు పూర్తిస్థాయిలో క్లౌడ్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. ఈ మూడు డేటా సెంటర్లలో మొదట (2020లో) 20 వేల 96 కోట్ల రూపాలయను పెట్టుబడిగా పెట్టాలని అమెజాన్ నిర్ణయించింది. అయితే విస్తరణ ప్రణాళికలు, వ్యాపార వ్యూహాల్లో భాగంగా దశల వారీగా  36 వేల 300 కోట్ల రూపాయలను  పెట్టుబడిగా పెట్టాలని తాజాగా నిర్ణయించుకుంది.  ప్రపంచంలోనే తన అతిపెద్ద వెబ్ సర్వీసెస్ క్యాంపస్ తో పాటు ఫుల్ ఫిల్మెంట్ సెంటర్ లు రెండింటిని  హైదరాబాద్ లో అమెజాన్ ఏర్పాటుచేసింది. ఇక అమెజాన్ వెబ్ సర్వీసెస్ అందించే  క్లౌడ్ కంప్యూటింగ్ సేవలను తెలంగాణ ప్రభుత్వం ఉపయోగించుకుంటుంది.


అమెజాన్ తో కలిసి పనిచేస్తున్నాం 


వీడియో కాన్ఫెరెన్స్ లో మాట్లాడిన మంత్రి కేటీఆర్.. హైదరాబాద్ డేటా సెంటర్లలో పెట్టుబడులను అమెజాన్  విస్తరిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. రాష్ట్రంలోకి వస్తున్న అతిపెద్ద ఎఫ్.డి.ఐలలో ఇదొకటన్నారు. ఇ-గవర్నెన్స్, హెల్త్‌కేర్, పురపాలక కార్యకలాపాలను మెరుగుపరచడానికి  AWSతో కలిసి తెలంగాణ ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. హైదరాబాద్ లోని అమెజాన్ వెబ్ సర్వీసెస్ క్యాంపస్ లతో ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలతో పాటు స్టార్టప్ లకు ప్రయోజనం కలుగుతుందన్న నమ్మకం తనకు ఉందన్నారు కేటీఆర్. 


మైక్రోసాఫ్ట్ పెట్టుబడులు 


 తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. తాజాగా మైక్రోసాఫ్ట్ హైదరాబాద్ లోని డేటా సెంటర్ విస్తరణకు హామీ ఇచ్చింది. దావోస్‌లో పర్యటిస్తున్న మంత్రి కేటీఆర్... మైక్రోసాఫ్ట్ ప్రతినిధులపై భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులపై చర్చించారు. రాబోయే ప్రాజెక్టులపై మంత్రి కేటీఆర్, పరిశ్రమలు వాణిజ్య శాఖల ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్ మైక్రోసాఫ్ట్ ఆసియా అధ్యక్షుడు అహ్మద్ మజర్ తో చర్చించారు. మైక్రోసాఫ్ట్  మొదటి క్యాప్టివ్ డేటా సెంటర్ పెట్టుబడులను పెడుతున్నట్లు గత ఏడాది ప్రకటించింది. ఇప్పటికే మైక్రోసాఫ్ట్ హైదరాబాద్‌లో మూడు డేటా సెంటర్‌లను ఏర్పాటు చేసింది. ఈ ప్రతి ఒక్క ఐటీ సెంటర్ 100 మెగావాట్లు సామర్థ్యాన్ని కలిగి ఉంది.  అయితే మైక్రోసాఫ్ట్ ఇప్పుడు తెలంగాణలోని మొత్తం 6 డేటా సెంటర్‌లను ఏర్పాటుచేయాలని నిర్ణయించింది. ఒక్కో డేటా సెంటర్ సగటున 100 మెగావాట్ల ఐటీ లోడ్‌ను అందిస్తోంది. ఈ డేటా సెంటర్‌లు భారతదేశంలోనే కాక ప్రపంచవ్యాప్తంగా ఉన్న అజూర్ కస్టమర్‌లకు సేవలందించేందుకు తన క్లౌడ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను బలోపేతం చేసేలా మైక్రోసాఫ్ట్ లక్ష్యంగా పెట్టుకుంది. మొత్తం 6 డేటా సెంటర్లు వచ్చే 10-15 సంవత్సరాలలో దశల వారీగా ఏర్పాటుచేయనుంది.  నైపుణ్యం, ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌లు,  క్లౌడ్ అడాప్షన్ వంటి అనేక ప్రయోజనకరమైన కార్యకలాపాలను ప్రారంభించడానికి తెలంగాణ ఇంతకుముందు మైక్రోసాఫ్ట్‌తో అవగాహన ఒప్పందంపై సంతకం చేసింది. క్లౌడ్ అడాప్షన్‌ లో తెలంగాణ ప్రభుత్వం, మైక్రోసాఫ్ట్ అజూర్ తో కలిసి పనిచేస్తుంది.