MLC Kaushik Reddy : హుజురాబాద్ లో టీఆర్ఎస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఎమ్మెల్యే ఈటల రాజేందర్ అక్రమాలపై బహిరంగ చర్చకు సిద్ధమా అని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి సవాల్ చేస్తున్నారు. ఇరుపార్టీల నేతలు నేరచరిత్ర గురించి ఆరోపణలు చేసుకుంటున్నారు. తాజాగా ప్రత్యర్థులతో ప్రాణహాని ఉందని ఆరోపణలు చేస్తున్నారు. హుజురాబాద్ ఉపఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచిన ఈటల రాజేందర్ నియోజకవర్గంలో ఇష్టానుసారంగా గన్ లైసెన్స్ ఇచ్చారని విమర్శలు చేశారు. తన కుటుంబానికి ఏమైనా జరిగితే సీఎం కేసీఆర్ బాధ్యత వహించాలని ఆరోపించారు. దీంతో కౌశిక్ రెడ్డి స్పందిస్తూ నియోజకవర్గంలో రక్త చరిత్ర మొదలెట్టింది ఈటల రాజేందర్ అని మండిపడ్డారు. తనపై హత్యాయత్నం కూడా చేశారని ఆరోపించారు.
గన్ కల్చర్
కరీంనగర్ జిల్లా హుజురాబాద్‌లో రాజకీయం మరోసారి వేడెక్కింది. బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్, టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. ఇటీవల తుపాకుల ప్రస్తావన తెచ్చిన ఈటల రాజేందర్ కు కౌశిక్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ఈటల రాజేందర్ వర్గీయులు తనను హత్య చేయడానికి కుట్ర చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకల కార్యక్రమంలో పాల్గొన్న ఆయన ఈ ఆరోపణలు చేశారు.
బహిరంగ చర్చకు సిద్ధమా?
ఈటల రాజకీయ జీవితం హత్యారాజకీయాలతో ముడిపడి ఉందని ఎమ్మెల్సీ కౌశిక్ రెడ్డి ఆరోపించారు. తన రక్త చరిత్రను సీఎం కేసీఆర్‌కు అంటించాలని ప్రయత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈటలపై నర్సింగాపూర్ గ్రామస్థులు చెప్పులతో దాడి చేసింది నిజం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమకారుడు ప్రవీణ్ యాదవ్‌పై ఈటల రాజేందర్ మంత్రిగా ఉన్నప్పుడు దాడి చేయించారని ఆరోపించారు. ఈటల రాజేందర్ రక్త చరిత్రపై బహిరంగ చర్చకు సిద్ధమేనా అని కౌశిక్ రెడ్డి సవాల్ విసిరారు. ఈటల పైకి కనిపించే అంత అమాయకుడు కాదన్నారు. తన ఆరోపణల్లో ఏ ఒక్కటి అవాస్తవం అని తేలినా ముక్కు నేలకు రాస్తానని పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు.
వామనరావు దంపతుల హత్య కేసులో
మర్రిపల్లిగూడెంలో తనను ఈటల రాజేందర్ వర్గీయులు హత్య చేయడానికి ప్రయత్నించారని కౌశిక్ రెడ్డి ఆరోపించారు. నియోజకవర్గంలో చాలా నేరాల వెనుక కూడా ఈటల రాజేందర్ హస్తం ఉందన్నారు. నర్సింగాపూర్‌కి చెందిన బాలరాజు అనే ఉద్యమకారుడ్ని హత్య చేయించింది ఈటల వర్గీయులే అన్నారు. లాయర్ వామనరావు దంపతుల హత్య కేసు నిందితుల్లో ఈటల స్నేహితుడు ఉన్న మాట వాస్తవం కాదా అని కౌశిక్ రెడ్డి నిలదీశారు. కౌశిక్ రెడ్డి ఆరోపణలపై బీజేపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.
Also Read : KTR: ‘అమిత్ షా అభివన సర్దార్’ అంటూ కిషన్ రెడ్డి వ్యాఖ్యలు: కేటీఆర్ దిమ్మతిరిగే కౌంటర్
Also Read : Khasim Rizvi:హైదరాబాద్ రాజ్యం ఇండియాలో కలిశాక ఖాసీం రజ్వీ ఏమయ్యాడు ?