PM Maandhan Yojana Scheme 2026: కేంద్ర ప్రభుత్వం.. 18-40 ఏళ్ల వయసు గల రైతులు, అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రధానమంత్రి మాన్‌ధన్‌ యోజన పెన్షన్ పథకాన్ని అమలు చేస్తుంది. 60 సంవత్సరాలు నిండిన అసంఘటిత రంగ కార్మికులు, చిన్న, సన్నకారు రైతులకు ఈ పథకం కింద ప్రతినెలా రూ.3 వేల చొప్పున పింఛన్ అందిస్తుంది. కేంద్ర, రాష్ట్ర ఉద్యోగుల తరహాలో రైతులు, కార్మికులు కూడా పెన్షన్ పొందవచ్చు. రైతులకు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన, అసంఘటిత రంగ కార్మికులకు పీఎం శ్రమ యోగి మాన్ ధన్ యోజన పథకాల కింద పెన్షన్ అందిస్తుంది. 

పీఎం మాన్ ధన్ యోజన అర్హతలు

  • 18- 40 మధ్య వయస్సు గల చిన్న సన్నకారు రైతులు, కార్మికులు 
  • రెండు హెక్టార్ల కన్నా తక్కువ భూమిని కలిగి ఉన్నవారు 
  • రూ.15 వేల లోపు ఉన్న నెల జీతం అసంఘటిత రంగ కార్మికులు 
  • EPFO, NPS, ESI పథకాల్లో లేని వారు అర్హులు 

దరఖాస్తుకు కావాల్సిన డాక్యుమెంట్లు

  1. ఆధార్ కార్డు 
  2. ఇ-శ్రమ్ కార్డు 
  3. మొబైల్ నెంబర్ 
  4. నామినీ ఆధార్ కార్డు 
  5. ఆదాయపు ధ్రువీకరణ పత్రం 
  6. కుల ధ్రువీకరణ పత్రం 
  7. భూమి వివరాలు 
  8. వయసు నిర్థారణ సర్టిఫికెట్ 
  9. బ్యాంక్ పాసు పుస్తకం 

పీఎం మాన్ ధన్ యోజన పథకం దరఖాస్తు విధానం 

పీఎం మాన్ ధన్ యోజన స్కీమ్ కోసం ఆన్​లైన్​, ఆఫ్​లైన్​లో అప్లై చేసుకోవచ్చు. ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు కామన్ సర్వీస్ సెంటర్ (CSC) లేదా మీ-సేవా కేంద్రాలను సంప్రదించవచ్చు. లేదా లబ్ధిదారులు https://maandhan.in లోని మాన్‌ధన్ పోర్టల్‌ను ఉపయోగించి నేరుగా ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చు. ఆఫ్​లైన్​లో దరఖాస్తుకు కూడా మీ సమీపంలోని సీఎస్సీ కేంద్రాన్ని సంప్రదించవచ్చు. అక్కడ దరఖాస్తు ఫారమ్​ నింపి ఇస్తే CSC ఆపరేటర్ రిజిస్ట్రేషన్​ ప్రక్రియను పూర్తి చేస్తారు. సీఎస్సీ కేంద్రంలో దరఖాస్తుదారుడి వివరాలు  పీఎంకేఎం పోర్టర్‌లో నమోదు చేస్తారు.   

  •  ఆధార్, బ్యాంక్ అకౌంట్ ఖాతా పత్రాలతో CSC కేంద్రాన్ని సందర్శించండి.
  • ఆధార్ నెంబర్ ఉపయోగించి బయోమెట్రిక్ ధృవీకరణ చేస్తారు.
  • ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ఫామ్‌ను పూరించండి.
  • ఈ పథకంలో చేరేందుకు మొదటి చందాను నగదు రూపంలో చెల్లించాలి.
  • అనంతరం మీ బ్యాంక్ ఖాతా నుంచి ఆటో డెబిట్ సౌకర్యాన్ని సెలెక్ట్ చేసుకోవచ్చు.  
  • నమోదు ప్రక్రియ పూర్తైన తర్వాత PM SYM కార్డు జారీ చేస్తారు. 

ప్రీమియం ఎంత? 

పీఎం మాన్ ధన్ యోజన స్కీమ్ లో చేరాలనుకునే వారు ప్రతి నెలా కొంత ప్రీమియం కట్టాల్సి ఉంటుంది. 60 ఏళ్లు పూర్తయ్యే వరకు ప్రీమియం కట్టాలి. 18 ఏళ్లు ఉన్న వారు తన వాటాగా నెలకు రూ.55 చెల్లిస్తే, కేంద్ర ప్రభుత్వం కూడా రూ.55 చెల్లిస్తుంది. వయస్సును బట్టి ప్రతీ సంవత్సరం 3 నుంచి 10 రూపాయల వరకు ప్రీమియం పెరుగుతుంది. 40 ఏళ్ల వ్యక్తి నెలకు రూ.200 ప్రీమియం చెల్లించాలి. ఇలా ప్రీమియం చెల్లించిన సభ్యులకు 60 ఏళ్లు పూర్తైన తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు పెన్షన్ పొందుతారు. ఈ స్కీమ్​ కోసం నమోదు చేసుకున్న వారు 60 ఏళ్ల నిండకుండానే మరణిస్తే.. నామినీకి పెన్షన్ మొత్తంలో సగం రూ.1500 ప్రతి నెలా చెల్లిస్తారు.    

లబ్దిదారుడు ముందే మరణిస్తే?

లబ్దిదారుడు ఈ పథకంలో చేరిన 10 సంవత్సరాల లోపు మరణిస్తే పెన్షన్ కోసం చెల్లించిన ప్రీమియం మొత్తాన్ని, వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తారు. ఒకవేళ లబ్ధిదారుడు 10 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం ప్రీమియం చెల్లిస్తే, 60 ఏళ్లు నిండక ముందే మరణిస్తే.. ప్రీమియం మొత్తం, దానిపై వచ్చిన వడ్డీ, ఫండ్ ద్వారా వచ్చిన వడ్డీ లేదా సేవింగ్స్ బ్యాంక్ వడ్డీ రేటు ఈ రెండింటిలో ఏది ఎక్కువైతే ఆ మొత్తాన్ని తిరిగి చెల్లిస్తారు.  చందాదారుడు 60 ఏళ్ల తర్వాత మరణిస్తే, వారి జీవిత భాగస్వామి పింఛన్ లో 50 శాతాన్ని కుటుంబ పింఛన్ గా పొందుతారు.