TS Highocurt :   తెలంగాణ ప్రభుత్వం రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాల్సిందేనని తెలంగాణ  హైకోర్టు స్పష్టం చేసింది. కేంద్రం ఇచ్చిన ఆదేశాలను తెలంగాణ సర్కార్ పట్టించుకోవడం లేదని.. రిపబ్లిక్ డే వేడుకలను నిర్వహించడం లేదంటూ... దాఖలైన లంచ్ మోషన్ పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు... పరేడ్ తో కూడిన రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని స్ప్టం చేసింది. ఎక్కడ నిర్వహించాలనేది ప్రభుత్వం నిర్ణయించాలని స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం  ఇచ్చిన గైడ్ లైన్స్ ను తెలంగాణ ప్రభుత్వం పాటించాల్సిందేనని స్పష్టం చేసింది. 


గత ఏడాది నుంచి రిపబ్లిక్ డే ను  పరేడ్ లేకుండా నిర్వహిస్తున్న  ప్రభుత్వం


సాధారణంగా గణతంత్ర దినోత్సవం గవర్నర్ చేతుల మీదుగా సాగుతుంది. ప్రభుత్వం ప్రతీ సారి పరేడ్ గ్రౌండ్స్ లేదా పబ్లిక్ గార్డెన్స్ లో రిపబ్లిక్ డేను ఘనంగా నిర్వహిస్తుంది. వేడుకల్లో ప్రభుత్వం ఇచ్చే  ప్రసంగ పాఠాన్ని గవర్నర్ చదువుతారు. పోలీసులు పరేడ్ నిర్వహించి.. గవర్నర్‌కు గౌరవ వందనం సమర్పిస్తారు. అలాగే శకటాల ప్రదర్శన కూడా ఉంటుంది. ప్రతీ సారి ఇలాగే జరిగేది.అయితే గత ఏడాది మాత్రం తెలంగాణ ప్రభుత్వం పట్టించుకోలేదు. దాంతో  గవర్నర్ రాజ్ భవన్‌లో సాదాసీదాగా జరిగిన కార్యక్రమంలో జెండా వందనం చేశారు. సీఎం కేసీఆర్ ప్రగతి భవన్ లోనే జెండా ఎగరేశారు. 


గవర్నర్‌తో  ప్రభుత్వ  విభేదాల కారణంగానేనని ప్రచారం


ప్రత్యేకంగా రిపబ్లిక్ డే నిర్వహించకపోవడంపై అప్పట్లోనే విమర్శలు వచ్చాయి. అయితే గవర్నర్ తమిళిసైతో  ప్రభుత్వం విభేదించడం  ప్రారంభించడంతో..  గవర్నర్ వ్యవస్థను ప్రభుత్వం పరిగణనలోకి తీుకోవడం లేదు. అందుకే  ప్రోటోకాల్ ప్రకారం కూడా గవర్నర్‌కు ఎలాంటి గుర్తింపు ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఈ కారణంగా రిపబ్లిక్ డే వేడుకలను ప్రభుత్వ నిర్వహించడం లేదు. గత ఏడాది లాగే ఈ ఏడాది కూడా రాజ్ భవన్ లోనే వేడుకలు నిర్వహించుకోవాలని ప్రభుత్వం సమాచారం ఇచ్చింది. దీనిపై గవర్నర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రానికి ఫిర్యాదు చేస్తామని ప్రకటించారు. ఈ లోపు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు కావడంతో  ... ఎట్టి పరిస్థితుల్లోనూ రిపబ్లిక్ డే వేడుకలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. 


గంటల్లోనే ఏర్పాట్లు చేయాల్సిన పరిస్థితి -  చేయగలుగుతారా ? 


అయితే ఒక్క రోజు కూడా సమయం లేకపోవడంతో ఇప్పుడు ప్రభుత్వం ఏం చేస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇరవై ఆరో తేదీ ఉదయమే రిపబ్లిక్ డే వేడుకలు జరగాల్సి ఉంది. గంటల్లోనే ఏర్పాట్లు పూర్తి చేయాల్సి ఉంది. శకటాలు లేకపోయినా... ఎట్టి పరిస్థితుల్లో పరేడ్ కూడా ఉండాలని హైకోర్టు స్పష్టం చేసింది. దీంతో పోలీసులు కూడా పరేడ్ కు గంటల్లోనే రెడీ కావాల్సి ఉంటుంది. ఇప్పటికిప్పుడు ఏర్పాట్లు చేయడం కూడా అంత తేలిక కాదు. దీంతో  ప్రభుత్వం ఏం  చేయబోతోందనేది ఆసక్తికరంగా మారింది. ఒక వేళ ప్రభుత్వం వేడుకలు నిర్వహించకపోతే.. కోర్టును ధిక్కరించినట్లు అవుతుంది. ఈ అంశంపై ప్రభుత్వ వర్గాలు మల్లగుల్లాలు పడుతున్నాయి.  ఏం చేయాలన్నదానిపై ఉన్నతాధికారులు ప్రభుత్వ పెద్దల్ని సంప్రదిస్తున్నారు.