High Court big relief for motorists: పెండింగ్ చలాన్ల వసూలు పేరుతో వాహనదారులను ఇబ్బంది పెడుతున్న ట్రాఫిక్ పోలీసుల తీరుపై తెలంగాణ హైకోర్టు తీవ్రంగా స్పందించింది. రహదారులపై వాహనాలను తనిఖీ చేసే సమయంలో పెండింగ్ చలాన్లు ఉన్నాయని వాహనదారులను బలవంతపెట్టవద్దని పోలీసులను న్యాయస్థానం స్పష్టంగా ఆదేశించింది. ముఖ్యంగా చలాన్లు చెల్లించాలని ఒత్తిడి చేస్తూ వాహనాల తాళాలను లాక్కోవడం, వాహనాలను అక్కడే నిలిపివేసి ప్రయాణికులను ఇబ్బందులకు గురిచేయడం వంటి చర్యలు చట్టవిరుద్ధమని కోర్టు పేర్కొంది. పోలీసుల విధులు నిబంధనల పర్యవేక్షణే కానీ, వసూళ్లు కాదని హితవు పలికింది.
పోలీసు యంత్రాంగం తమ పరిమితులు దాటకూడదు !
ఈ అంశంపై సామాజిక కార్యకర్త, న్యాయవాది విజయ్ గోపాల్ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన ధర్మాసనం ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. పోలీసులు వాహనాలను అడ్డగించి బలవంతంగా నగదు వసూలు చేయడం వల్ల సామాన్య ప్రజలు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని విజయ్ గోపాల్ కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. వాహనదారులు తమ వాహనాల తాళాలను పోలీసులు లాక్కోవడం వల్ల మానసిక వేదనకు గురవుతున్నారని ఆయన వాదించారు. ఈ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు, పోలీసు యంత్రాంగం తమ పరిమితులను అతిక్రమించకూడదని సూచించింది.
చట్టపరమైన పద్ధతిలో కోర్టు నోటీసులు పంపాలి !
చలాన్ల చెల్లింపు విషయంలో హైకోర్టు ఒక స్పష్టమైన విధానాన్ని వెల్లడించింది. ఏదైనా కారణంతో వాహనాన్ని ఆపినప్పుడు, వాహనదారుడు తనంతట తానుగా పెండింగ్ చలాన్లను క్లియర్ చేయడానికి ముందుకు వస్తేనే పోలీసులు ఆ మొత్తాన్ని వసూలు చేసుకోవచ్చని తెలిపింది. ఒకవేళ వాహనదారులు ఆ సమయంలో చెల్లించడానికి ఇష్టపడకపోతే, వారిని నిర్బంధించే అధికారం పోలీసులకు లేదని స్పష్టం చేసింది. పెండింగ్ బకాయిల కోసం చట్టపరమైన పద్ధతిలో కోర్టు నోటీసులు పంపాలే తప్ప, రోడ్ల మీద దౌర్జన్యంగా వ్యవహరించకూడదని ఆదేశించింది.
వాహనదారులకు ఊరట
హైకోర్టు ఇచ్చిన ఈ తాజా ఆదేశాలతో లక్షలాది మంది వాహనదారులకు పెద్ద ఊరట లభించినట్లయింది. ముఖ్యంగా నగరాల్లో ట్రాఫిక్ పోలీసులు చలాన్ల కోసం వేటాడుతున్నారన్న విమర్శలకు ఈ తీర్పు అడ్డుకట్ట వేయనుంది. నిబంధనల పేరుతో సామాన్యులను వేధిస్తే సహించబోమని న్యాయస్థానం ఇచ్చిన ఈ తీర్పు ఇప్పుడు సోషల్ మీడియాలో కూడా వైరల్ అవుతోంది. ఈ తీర్పు ట్రాఫిక్ పోలీసులు తమ తనిఖీల విధానంలో ఎలాంటి మార్పులు చేస్తారో వేచి చూడాలి.