హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా వాతావరణం మారుతోంది. మూడు రోజుల తరువాత రాష్ట్రంలో పలు జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ముఖ్యంగా ఈ నెల 18వ తేదీ నుంచి 20వ తేదీల మధ్య రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నారు. సోమవారం నుంచి మూడు, నాలుగు రోజుల్లో రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఉందని తెలిపారు. 

Continues below advertisement

ప్రస్తుతం తెలంగాణలోకి ప్రవేశించిన నైరుతి రుతుపవనాలు కాస్త నెమ్మదిగా కదులుతున్నాయి. ఇవి రాబోయే నాలుగైదు రోజుల్లో మరింత బలపడి, రాష్ట్రమంతటా పూర్తిగా విస్తరించే అవకాశం ఉందని స్పష్టం చేశారు. రుతుపవనాల విస్తరణతో రాష్ట్రంలో వర్షాల తీవ్రత మరింత పెరిగే అవకాశం ఉందని, ఎండల తీవ్రత నుంచి ప్రజలకు పూర్తిగా ఉపశమనం లభిస్తుందని పేర్కొన్నారు. 

రెండు రోజులు బలమైన ఈదురుగాలులునైరుతి రుతుపవనాల కదలికలతో సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని పలు జిల్లాల్లో గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉందని వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈదురుగాలులతో పాటు పిడుగులు పడే అవకాశం ఉన్నందున రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ముఖ్యంగా ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు వర్షాలు పడే సమయాల్లో చెట్ల కింద, విద్యుత్ స్తంభాల వద్ద నిల్చోవద్దని అధికారులు హెచ్చరించారు.

Continues below advertisement

వర్షాల సమయంలో అధికారుల నిర్లక్ష్యంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం

హైదరాబాద్‌: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలు, ప్రకృతి విపత్తుల నేపథ్యంలో ముందస్తు చర్యలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా రాజధాని హైదరాబాద్‌లో ఇటీవలి వర్షాల సమయంలో మున్సిపల్, పోలీసు సిబ్బంది మధ్య కనీస సమన్వయం కొరవడటంపై సీఎం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. జూన్ 1న నిర్వహించిన సమీక్షలోనే వర్షాలపై ముందస్తు సూచనలు చేసినప్పటికీ, జూన్ 9న నగరంలో వాన కురిసన సమయంలో అధికారులు క్షేత్రస్థాయిలో సరిగా స్పందించలేదని మండిపడ్డారు. వర్షం వస్తే ఉన్నతాధికారుల నుంచి కింది స్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ రోడ్లపైనే ఉండి ప్రజలకు ఇబ్బంది లేకుండా చూడాలని, అవసరమైతే తానే స్వయంగా రంగంలోకి దిగుతానని హెచ్చరించారు.

వర్షాల సమయంలో ప్లాన్ ప్రకారం వర్క్నగరంలో నీరు నిలిచే ప్రాంతాలు, ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తే బ్లాక్‌స్పాట్ల డేటా ఆధారంగా మున్సిపల్, ట్రాఫిక్ విభాగాలు ప్రణాళికాబద్ధంగా పనిచేయాలని సీఎం స్పష్టం చేశారు. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలిచి కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌జామ్‌ ఏర్పడితే బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ట్రాఫిక్‌ నియంత్రణను మరింత బలోపేతం చేసేందుకు ఆ విభాగంలో ఉన్న ఖాళీలను తక్షణమే భర్తీ చేయాలని ఆదేశించారు. అలాగే, వర్షాకాలంలో అంతరాయం లేని సరఫరా కోసం విద్యుత్‌శాఖ పూర్తిస్థాయిలో సన్నద్ధం కావాలని, నిర్లక్ష్యంగా వ్యవహరించి ఫీల్డ్‌లో అందుబాటులో ఉండని అధికారులపై వేటు తప్పదని తేల్చి చెప్పారు.

రాష్ట్రవ్యాప్తంగా ఉన్న నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ పూర్తిగా నిబంధనల ప్రకారం జరగాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించారు. ఈ క్రమంలో చీఫ్ ఇంజనీర్లు, సూపర్ ఇంటిండెంట్ ఇంజనీర్లు ఎవరూ ప్రధాన కార్యాలయాల్లో కాకుండా తమకు కేటాయించిన స్థానిక ప్రాంతాల్లోనే అందుబాటులో ఉండాలని స్పష్టం చేశారు. ప్రాజెక్టుల సురక్షిత నిర్వహణ, గేట్ల మరమ్మతులకు అవసరమైన నిధులను తక్షణమే విడుదల చేయాలని ఆర్థిక శాఖను ఆదేశించారు. వర్షాకాలం ముగిసే వరకు అన్ని శాఖలు అప్రమత్తంగా ఉంటూ ఆస్తి నష్టాన్ని నివారించాలని, ప్రజలకు ఇబ్బంది కలగకుండా చర్యలు చేపట్టాలని సీఎం దిశానిర్దేశం చేశారు.