Andhra Pradesh Rains News Updates | అమరావతి: వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి తీరం దాటినా తెలుగు రాష్ట్రాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఏపీలో నేడు పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పు గోదావరి, కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ గురువారం రాత్రి తెలిపారు. ముఖ్యంగా వినాయక నిమజ్జన సమయంలో నదీ, కాలువలు, చెరువుల వద్ద ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను తప్పనిసరిగా పాటించాలన్నారు. భారీ వర్షాలు కురుస్తున్నాయి కనుక వరద నీటిలో ఈతకు  వెళ్ళడం, స్నానాలకు వెళ్లడం లాంటివి చేయకూడదని హెచ్చరించారు. 

ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు కృష్ణా, గోదావరి నదులకి వరద ఉధృతంగా వచ్చి చేరుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) ఎండీ ప్రఖర్ జైన్ వెల్లడించారు. గురువారం రాత్రి ప్రకాశం బ్యారేజి వద్ద కృష్ణానది వరద ప్రవాహం ఇన్,ఔట్ ఫ్లో 4.43లక్షల క్యూసెక్కులు ఉండగా, మొదటి హెచ్చరిక కొనసాగుతోంది. తెలంగాణలో భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం 38.6అడుగులు ఉందని తెలిపారు. ధవళేశ్వరం వద్ద ఇన్ ఫ్లో 5.31,  ఔట్ ఫ్లో  5.30 లక్షల క్యూసెక్కులు ఉండగా, శనివారం ఉదయం మొదటి ప్రమాద హెచ్చరిక స్థాయి, ఆదివారంలోపు దాదాపు రెండవ ప్రమాద హెచ్చరిక స్థాయికి వరద ప్రవాహం చేరే అవకాశం ఉందని పేర్కొన్నారు.

తెలంగాణలో ఆ జిల్లాలకు రెడ్ అలర్ట్..

హైదరాబాద్: వాయుగుండం ఒడిశాలో తీరం దాటినా దాని ప్రభావం ఉత్తర తెలంగాణలో స్పష్టంగా కనిపిస్తోంది. నేడు తెలంగాణలో పలు జిల్లాలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. మిగతా జిల్లాల్లో తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వానలు పడతాయని తెలంగాణ వెదర్ మ్యాన్ తెలిపారు. శుక్రవారం నాడు ఆదిలాబాద్, నిర్మల్, మంచిర్యాల, కొమురం భీం ఆసిఫాబాద్, కామారెడ్డి, నిజామాబాద్, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల, పెద్దపల్లి, మెదక్, సంగారెడ్డి, సిద్దిపేట, ఉమ్మడి వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అంచనా వేశారు. కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, నిర్మల్ జిల్లాలకు రెడ్ అలర్ట్ నేటితో ముగియనుంది.

దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పలుచోట్ల వాతావరణం పొడిగా మారింది. ఉమ్మడి రంగారెడ్డి, మహబూబ్ నగర్, నల్గొండ, హైదరాబాద్ జిల్లాల్లో నేడు కొన్నిచోట్ల తేలికపాటి జల్లుల నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ప్రజలు అధికారుల ప్రకటించే వర్ష సూచనలు, జాగ్రత్తలు పాటించాలి. క్లౌడ్ బరస్ట్, ఫ్లాష్ ఫుడ్స్ లాంటి ప్రమాదం లేదు. దాంతో భారీ వర్షాలు, వరదలతో అతలాకుతలమైన ప్రాంతాలు ఇప్పుడిప్పుడే జల దిగ్బంధం నుంచి బయట పడుతున్నాయి. కొన్నిచోట్ల రోడ్డు మార్గం రాకపోకలు పునరుద్ధరించారు. నిర్మల్ సహా పలు ప్రాంతాల నుంచి గురువారం సాయంత్రం హైదరాబాద్‌కు బస్సు సర్వీసులు తిరిగి ప్రారంభమయ్యాయి.