Harish Rao once again accused Revanth of supporting Nallamala Sagar: కాంగ్రెస్ ప్రభుత్వం దేశ రాజధాని ఢిల్లీ వేదికగా ఏపీతో కుమ్మక్కై తెలంగాణ ప్రయోజనాలను పణంగా పెడుతోందని  హరీష్ రావు ఆరోపించారు. తెలంగాణ భవన్ లో నిర్వహించిన మీడియా సమావేశంలో  గోదావరి నదీ జలాల అక్రమ తరలింపు కోసం ఏపీ ప్రతిపాదిస్తున్న నల్లమల సాగర్ ప్రాజెక్టుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పరోక్షంగా రెడ్ కార్పెట్ వేస్తోందని, ఇది తెలంగాణ నీటి చరిత్రలో ఒక  బ్లాక్ డే గా మిగిలిపోతుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.             

హరీశ్ రావు మాట్లాడుతూ.. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒత్తిడితో కేంద్రం నిర్వహిస్తున్న ఇరిగేషన్ సమావేశానికి తెలంగాణ అధికారులు వెళ్లడం రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతమని పేర్కొన్నారు. గతంలో తాము పెట్టిన కండిషన్లకు కేంద్రం లేదా ఏపీ నుంచి ఎలాంటి హామీ రాకుండానే ఈ సమావేశానికి ఎందుకు వెళ్లారని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. చంద్రబాబుకు గురుదక్షిణ  చెల్లించుకోవడానికి రేవంత్ రెడ్డి తెలంగాణ నీటి హక్కులను కాలరాస్తున్నారని, జల ద్రోహం విషయంలో చంద్రబాబు కత్తి పడితే రేవంత్ రెడ్డి తెలంగాణను పొడుస్తున్నారని ఘాటుగా విమర్శించారు.           

గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కేసీఆర్ గారు గోదావరిపై సుమారు  400 టీఎంసీల  వినియోగానికి అనుమతులు సాధించారని, 32 లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించారని హరీశ్ రావు గుర్తు చేశారు. అయితే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన ఏడాది కాలంలో ఒక్క డీపీఆర్   కూడా పంపలేదని, పైగా ఉన్న ప్రాజెక్టుల అనుమతుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తోందని మండిపడ్డారు. ముఖ్యంగా తెలంగాణ ప్రాజెక్టులను గతంలో వ్యతిరేకించిన అధికారులను ఢిల్లీ సమావేశాలకు పంపడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

 రేవంత్ రెడ్డి ప్రభుత్వం తక్షణమే ఢిల్లీ సమావేశాన్ని బహిష్కరించాలని, తెలంగాణ ప్రయోజనాలపై స్పష్టమైన వైఖరిని ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ సేద్యంపై దృష్టి పెడితే, రేవంత్ రెడ్డి కేవలం దావోస్, ఢిల్లీ యాత్రలకే పరిమితమై రాష్ట్ర పాలనను గాలికి వదిలేశారని ఎద్దేవా చేశారు. తెలంగాణ నీటి హక్కుల కోసం బీఆర్ఎస్ మరో పోరాటానికి సిద్ధమవుతుందని, ప్రభుత్వ దుర్మార్గాన్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతామని ఆయన హెచ్చరించారు.