Father of Telangana Issue: "త్యాగాలతో తెలంగాణను సాధించిన కేసీఆర్ ఈ రాష్ట్రానికి జాతిపిత అయితే, నోరు తెరిస్తే బూతులు మాట్లాడే రేవంత్ రెడ్డి 'బూతుల పిత' అని బీఆర్ఎస్ సీనియర్ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గజ్వేల్ నియోజకవర్గంలోని ప్రజ్ఞాపూర్‌లో నిర్వహించిన భారీ రోడ్ షోలో హరీష్ రావు ప్రసంగించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు. ఎంతో కష్టపడి అభివృద్ధి చేసుకున్న తెలంగాణను రేవంత్ రెడ్డి తన చేతగానితనంతో సర్వనాశనం చేస్తున్నారని, రైతులకు ఎరువులు ఇచ్చే తెలివి, వడ్లు కొనే సోయి లేని దద్దమ్మ ప్రభుత్వం ఇదని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
రైతుబంధు పథకం అమలుపై హరీష్ రావు ప్రభుత్వాన్ని నిలదీశారు, ఇప్పటికే రెండు విడతల నిధులను ఎగ్గొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, ఇప్పుడు మూడో విడతను కూడా ఆపేందుకు ఎలక్షన్ కోడ్‌ను సాకుగా చూపుతోందని మండిపడ్డారు. రైతుబంధు వేయడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, అవసరమైతే మేమే ఎన్నికల కమిషన్‌కు లేఖ రాస్తాం. దమ్ముంటే ఈ నెల 11వ తేదీలోగా బకాయిలతో కలిపి మూడు విడతల రైతుబంధు నిధులను రైతుల ఖాతాల్లో వేయాలి అని డిమాండ్ చేశారు. ఒకవేళ 11లోపు నిధులు విడుదల చేయకపోతే రైతులు కాంగ్రెస్ పార్టీని చీల్చి చెండాడుతారని హెచ్చరించారు.
గజ్వేల్ లో గతంలో పందులకు నిలయంగా ఉన్న దవాఖానను 250 పడకల కార్పొరేట్ స్థాయి ఆసుపత్రిగా మార్చింది, ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చింది కేసీఆర్ కాదా అని ప్రశ్నించారు. రైలు సౌకర్యం, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ, కళ్యాణ లక్ష్మి, కేసీఆర్ కిట్ వంటి పథకాలతో ప్రతి ఇంటికీ మేనమామలా అండగా నిలిచామని గుర్తు చేశారు. 200 రూపాయల పెన్షన్‌ను 2000 చేసిన ఘనత బీఆర్ఎస్‌దేనని, ఇప్పుడు 4000 ఇస్తామని చెప్పి మోసం చేసిన రేవంత్ రెడ్డి ఒక్కో అవ్వతాతకు 52 వేల రూపాయల బాకీ పడ్డారని ఆరోపించారు.
పనిచేసే ప్రభుత్వానికి ఓటేయాలా లేక కేవలం అక్షింతలు పంచే వారికా అని హరీష్ రావు ప్రజలను ఆలోచించమన్నారు. యాదాద్రి గుడిని, గజ్వేల్‌లో దేవాలయాలను అద్భుతంగా నిర్మించిన కేసీఆర్ గారికి అండగా నిలవాలని, సద్ది తిన్న రేవు తలవాలి అన్న చందంగా అభివృద్ధి చేసిన కారు గుర్తుకే మున్సిపల్ ఎన్నికల్లో పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. రెండేళ్లలో మళ్ళీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమేనని, ప్రజ్ఞాపూర్ గౌరవం నిలబడాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.
