Banakacharla:  బనకచర్ల ప్రాజెక్టు తెలంగాణకు తీవ్ర అన్యాయం చేస్తుందని బీఆర్ఎస్ సీనియర్ నేత   హరీష్ రావు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.   ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గోదావరి నది నుండి 200 టీఎంసీల నీటిని బనకచర్ల ప్రాజెక్టు ద్వారా కృష్ణా,  పెన్నా బేసిన్‌లకు తరలించడం వల్ల  తెలంగాణకు తీవ్ర నష్టం  జరుగుతుందన్నారు.  ఆంధ్రప్రదేశ్ బనకచర్ల ప్రాజెక్టును ఎలాంటి అనుమతులు లేకుండా నిర్మిస్తోందని ఆరోపించారు.  ఇది ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్, 2014 ఉల్లంఘన అని హరీష్ రావు ఆరోపించారు. ఈ ప్రాజెక్టుకు సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), ఎపెక్స్ కౌన్సిల్ నుంచి అనుమతులు తీసుకోలేదన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ,  కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును చూసీ చూడనట్లుగా వదిలేస్తున్నాయన్నారు.  ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి నీటి హక్కుల గురించి నీతి ఆయోగ్ సమావేశంలో ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.  కేంద్రం బనకచర్ల ప్రాజెక్టుకు 50 శాతం నిధులను గ్రాంట్‌ల రూపంలో ఇస్తూ, మిగిలిన నిధులను FRBM పరిమితుల మినహాయింపు ద్వారా సేకరించడానికి అనుమతిస్తోందని అన్నారు.  అదే సమయంలో తెలంగాణకు కాళేశ్వరం, సీతారామ,   పాలమూరు వంటి ప్రాజెక్టులకు ఇలాంటి సహాయం ఇవ్వడం లేదని ఆయన ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గతంలో తెలంగాణలోని కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి,  భక్త రామదాసు వంటి ప్రాజెక్టులను నిలిపివేయడానికి అభ్యంతరాలు వ్యక్తం చేశారని, కానీ ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్టును అనుమతులు లేకుండా ముందుకు తీసుకెళ్తున్నారని హరీష్ రావు  మండిపడ్డారు.  బనకచర్ల ప్రాజెక్టు ద్వారా ఆంధ్రప్రదేశ్ 200 టీఎంసీల గోదావరి నీటిని తరలించడం వల్ల తెలంగాణకు గణనీయమైన నీటి కొరత ఏర్పడుతుందన్నారు.  ఇది పాలమూరు, కల్వకుర్తి, దిండి,   నాగార్జునసాగర్ ఆయకట్టు వంటి ప్రాంతాలను ప్రభావితం చేస్తుందని  హెచ్చరించారు.  గోదావరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్ ప్రకారం, తెలంగాణకు 959 టీఎంసీల నీటి వాటా ఉన్నప్పటికీ, ఈ ప్రాజెక్టు వల్ల తెలంగాణ నీటిని కోల్పోతుందని ఆయన అన్నారు.  

బనకచర్ల ప్రాజెక్టును అడ్డుకోవడానికి BRS తరపున సుప్రీం కోర్టుకును ఆశ్రయిస్తామన్నారు.  ఈ సమస్యపై చర్చించడానికి తెలంగాణ అసెంబ్లీలో ప్రత్యేక సమావేశం మరియు అన్ని పార్టీల సమావేశం నిర్వహించాలని ఆయన డిమాండ్ చేశారు.  ఢిల్లీలోని సీడబ్ల్యూసీ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించి, కేంద్రం  ద్వంద్వ వైఖరిని బహిర్గతం చేస్తామని  ప్రకటించారు  రాష్ట్ర ప్రభుత్వం జంతర్ మంతర్ వద్ద నిరసన కార్యక్రమం నిర్వహించాలని, ప్రధానమంత్రిని కలిసి ఈ ప్రాజెక్టును ఆపాలని డిమాండ్ చేయాలని సూచించారు. రాజకీయ ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెట్టొద్దని.. రేవంత్ రెడ్డి చిల్లర రాజకీయాలు బంద్ ఆపాలని, చరిత్ర హీనుడిగా మిగిలిపోవద్దని హితవు పలికారు. బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు మౌనం వీడాలని.. చంద్రబాబు జల దోపిడిని అడ్డుకోవాలని సూచించారు.