Hanamkonda BRS Vs Congress: ఉమ్మడి వరంగల్ జిల్లాలో కీలకమైన వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నియోజకవర్గ అభివృద్ధిపై మొదలైన సవాళ్లు కాస్తా, కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తల మధ్య పరస్పర దాడులకు దారితీశాయి. హన్మకొండలోని బీఆర్ఎస్ కార్యాలయం వేదికగా కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు కోడిగుడ్లు, టమాటాలు, రాళ్లతో దాడి చేసుకోవడం స్థానికంగా ఉద్రిక్తతకు దారితీసింది.

Continues below advertisement

అసలేం జరిగింది?  

హన్మకొండ అభివృద్ధి ఎవరి హయాంలో జరిగిందనే దానిపై కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల మధ్య గత కొద్దిరోజులుగా సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుస్తున్నాయి. ఈ క్రమంలో హన్మకొండ చౌరస్తా వేదికగా అభివృద్ధిపై బహిరంగ చర్చకు వెళ్లేందుకు ఇరువర్గాలు సిద్ధమయ్యాయి. చర్చ కోసం చౌరస్తాకు బయలుదేరిన నాయకులు, కార్యకర్తలను పోలీసులు మార్గమధ్యలోనే అడ్డుకున్నారు. మరోవైపు చౌరస్తాకు భారీగా చేరుకున్న కాంగ్రెస్ శ్రేణులు నిరసనకు దిగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

ఈ క్రమంలో కాంగ్రెస్ కార్యకర్తలు హన్మకొండలోని బీఆర్ఎస్ కార్యాలయంలోకి దూసుకెళ్లే ప్రయత్నం చేయడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. చూస్తుండగానే పరిస్థితి అదుపు తప్పి కాంగ్రెస్, బీఆర్ఎస్ శ్రేణులు ఒకరిపై ఒకరు కోడిగుడ్లు, టమాటాలతో పాటు రాళ్లు విసురుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు రంగంలోకి దిగి ఇరువర్గాలను చెదరగొట్టారు.   Also Read: ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసులో ట్విస్ట్.. ఏ2గా సోదరుడు ప్రణయ్ పేరు చేర్చిన పోలీసులు

Continues below advertisement

నేతల తీరుపై ప్రజలు అసంతృప్తి 

నియోజకవర్గంలో చోటుచేసుకున్న ఈ పరిణామాలపై సామాన్య ప్రజలు, రాజకీయ విశ్లేషకుల నుంచి విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రజలకు తాము చేసిన అభివృద్ధి పనులను, తమ పాలనలో సాధించిన ప్రగతిని వివరించాల్సిన పార్టీలు.. అందుకు భిన్నంగా పరస్పర దాడులు, కార్యాలయాల ముట్టడితో రాజకీయాలను రసాభాసగా మారుస్తున్నాయనే అభిప్రాయం వినిపిస్తోంది. Also read: పల్నాడు స్కీమ్‌ ఆపుతానని రేవంత్ రెడ్డి ఎందుకు అనలేదు? చంద్రబాబుకు గురుదక్షిణ కోసమా?: హరీష్ రావు

ప్రజా సమస్యలు గాలికి? 

అసలు అభివృద్ధి ఎవరి హయాంలో జరిగింది? ప్రజలకు ఎవరు ఎక్కువ సేవ చేశారు? అనే ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సింది ఓటర్లే. కానీ ప్రజల తీర్పుకు వదిలేయాల్సిన అంశాన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకుని బలప్రదర్శనకు దిగడం ఎంతవరకు సమంజసమనే ప్రశ్న తలెత్తుతోంది. నియోజకవర్గంలో రోడ్లు, డ్రైనేజీలు, తాగునీరు, పారిశుద్ధ్యం వంటి కనీస ప్రజా సమస్యలు యథావిధిగా కొనసాగుతున్నాయి. వాటి పరిష్కారంపై దృష్టి పెట్టాల్సిన నాయకులు, కేవలం రాజకీయ ఆధిపత్య పోరులో ఇలా బాహాబాహీకి దిగడంపై స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

అన్ని వర్గాల ప్రజలకు ప్రాతినిధ్యం వహించే వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి చర్చ రాళ్లు, కోడిగుడ్ల దాడుల వరకు వెళ్లడం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమైంది. రాజకీయాలు ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఉండాలి తప్ప, పార్టీల ఆధిపత్యం కోసం కాదనే విషయాన్ని నాయకులు గుర్తించాలని, ముందుగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని స్థానికులు కోరుతున్నారు.  Also read: కాంబ్లె ముకేశ్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు.. హీరో సుమన్ చేతుల మీదుగా నియామక పత్రం, ఎవరీయన