Minister Errabelli Dayakar Rao : స్వచ్ఛ భార‌త్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వం ప్రతి మూడు నెల‌లకొకసారి ప్రకటిస్తున్న స్వచ్ఛ స‌ర్వేక్షణ్ గ్రామీణ అవార్డుల్లో మ‌రోసారి తెలంగాణ స‌త్తా చాటింది. రెండు వేర్వేరు విభాగాల్లో మొద‌టి మూడు స్థానాల్లో రెండు స్థానాలు ద‌క్కించుకుని దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గా తెలంగాణ నిలిచింది. 2022 అక్టోబ‌ర్ - డిసెంబ‌ర్ త్రైమాసికానికి, స్వచ్ఛ భార‌త్ ఎంపిక చేసిన రెండు విభాగాల్లో తెలంగాణ అగ్రగామిగా నిలిచింది. స్టార్ త్రీ విభాగంలో తెలంగాణ‌లోని సిద్ధిపేట జిల్లా, జ‌గిత్యాల జిల్లాలు దేశంలో మొద‌టి రెండు స్థానాల్లో నిలిచాయి. మూడో స్థానంలో కేర‌ళలోని కొట్టాయం జిల్లా నిలిచింది. అలాగే స్టార్ ఫోర్ విభాగంలో తెలంగాణ‌లోని రాజ‌న్న సిరిసిల్ల జిల్లా, 2వ స్థానంలో మ‌ధ్యప్రదేశ్ రాష్ట్రంలోని భోపాల్ జిల్లా, 3వ స్థానాన్ని పెద్దపల్లి జిల్లా ద‌క్కించుకుంది. 




పల్లె ప్రగతి కార్యక్రమం వల్లే 


 గ‌తంలోనూ స్వచ్ఛ స‌ర్వేక్షణ్ అవార్డుల్లో తెలంగాణ మొద‌టి మూడు స్థానాల్లో నిలిచింది. గ్రామ‌, మండ‌ల‌, జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో అనేక అవార్డులు తెలంగాణ సొంతం చేసుకుంది. ఈ అవార్డులు రావ‌డంలో రాష్ట్ర స్థాయిలో కార్యద‌ర్శి, ఇత‌ర ఉన్నతాధికారుల నుంచి స్థానికంగా గ్రామ సిబ్బంది వ‌ర‌కు అంద‌రి కృషి ఉంద‌ని మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.  ఈ అవార్డులు వ‌చ్చిన సంద‌ర్భంగా మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు ఆయా జిల్లాల అధికారులు, సిబ్బంది, ప్రజ‌ల‌ను అభినందించారు. వ‌రంగ‌ల్ హ‌నుమ‌కొండ‌లోని త‌న క్యాంపు కార్యాల‌యంలో మీడియాతో మాట్లాడిన మంత్రి... కేంద్రం నిధులు ఇవ్వకున్నా, అవార్డులు ఇస్తున్నందుకు ప్రత్యేక కృత‌జ్ఞత‌లు చెప్పారు. అలాగే ప‌ల్లె ప్రగ‌తి వంటి వినూత్న కార్యక్రమానికి శ్రీ‌కారం చుట్టిన సీఎం కేసీఆర్ వ‌ల్లే ఈ అవార్డులు ద‌క్కుతున్నాయ‌న్నారు. నిధులు, విధులు ఇచ్చి స్థానిక సంస్థల బ‌లోపేతానికి ప‌నిచేస్తున్నామన్నారు.  


ముఖరా కె గ్రామ సర్పంచ్ కు జాతీయ అవార్డు 


ముఖ‌రా కె గ్రామ స‌ర్పంచ్ మీనాక్షికి జాతీయ అవార్డు రావ‌డంపై మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు అభినందన‌లు తెలిపారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్ఛోడ మండ‌లం ముఖ‌రా కె గ్రామానికి ఆ గ్రామ సర్పంచ్, ఎంపీటీసీ, కార్యద‌ర్శి, వార్డు స‌భ్యులు, సిబ్బంది కృషి, ప్రజ‌ల స‌హ‌కారంతో అవార్డులు రావ‌డం కొత్త కాద‌న్నారు. దేశంలోనే నెంబ‌ర్ వ‌న్ గ్రామంగా ముఖరాకె నిలిచింద‌న్నారు. బ‌హిరంగ మ‌ల మూత్ర విస‌ర్జన ర‌హిత గ్రామంగా కూడా అవార్డు గెలిచింద‌న్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రక‌టించే అన్ని అవార్డుల ప్రమాణాల్లో ముఖ‌రా కె గ్రామం అగ్రగామిగా నిలుస్తుంద‌న్నారు. అంత‌ర్జాతీయ‌ మ‌హిళా దినోత్సవాన్ని పుర‌స్కరించుకుని, మార్చి 4న  భార‌త రాష్ట్రప‌తి చేతుల మీదుగా దిల్లీలో మీనాక్షి అవార్డును అందుకోవడం సంతోషించ‌ద‌గ్గ విష‌యం అన్నారు. ముఖ‌రా కె గ్రామం అన్ని విభాగాల్లో అగ్రగామిగా నిల‌వ‌డానికి అవ‌స‌ర‌మైన అన్ని ర‌కాల స‌హాయ‌, స‌హ‌కారాలు, నిధ‌ులు, మార్గద‌ర్శకాలు అంద‌చేస్తున్న సీఎం కేసీఆర్ కు మంత్రి ఎర్రబెల్లి ద‌యాక‌ర్ రావు కృత‌జ్ఞత‌లు తెలిపారు.