Gujarat Ex CM Meets KCR: గుజరాత్ మాజీ సీఎం, మాజీ కేంద్రమంత్రి శంకర్ సింఘ్ వాఘేలా ఇవాళ హైదరాబాద్ వచ్చారు. ప్రగతి భవన్ లో సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. దేశ రాజకీయాలు, జాతీయ అంశాలపై చాలా సేపు చర్చించారు. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీలు కలిసి పెను మార్పు తీసుకురావాలని ఈ భేటీలో నిర్ణయించినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలు, మతతత్వ రాజకీయాలు అనే అంశాలను దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలనే విషయం గురించి ఇరువురు మాట్లాడారు. ప్రత్యక్ష జాతీయ రాజకీయాల్లోకి వెళ్లడానికి సీఎం కేసీఆర్ పక్కా ప్రణాళికలు రచిస్తున్నారు. ఇందులో భాగంగానే కేసీఆర్ ఇతర రాష్ట్రాలకు వెళ్లి ఆయా పార్టీల నేతలను కలుస్తున్నారు.
కేంద్రంలో బీజేపీ రహిత ప్రభుత్వం రావాలన్నదే ధ్వేయం..
మరోవైపు ఇతర రాష్ట్రాల నాయకులను హైదరాబాద్ కు రమ్మని అహ్వానిస్తున్నారు. మొత్తానికి దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసేందుకు కేసీఆర్ రంగం సిద్ధం చేస్తున్నారు. ఇందులో భాగంగా వివిధ రాష్ట్రాల్లోని ప్రాంతీయ పార్టీల మద్దతు కూడబెట్టుకుంటున్నారు. కేంద్రంలో బీజేపీ రహిత ప్రభుత్వం రావాలనే నినాదాన్ని బలంగా తీసుకెళ్తున్నారు. ఇదే నినాదంతో ఉన్న కొన్ని ప్రాంతీయ పార్టీల నేతలు కేసీఆర్ కు మద్దతు పలుకుతున్నారు.
ఇటీవలే కర్ణాటక మాజీ సీఎం భేటీ..
తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై తీవ్ర చర్చ జరుగుతున్న సమయంలో కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఆదివారం హైదరాబాద్ వచ్చిన కుమారస్వామి ముందుగా మంత్రి కేటీఆర్ తో భేటీ అయ్యారు. ఈ విషయాన్ని కుమారస్వామి ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. మంత్రి కేటీఆర్ తో తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. వీటితో పాటు జాతీయ రాజకీయాలు కూడా తమ మధ్య చర్చకు వచ్చినట్లు కుమారస్వామి తెలిపారు. ఆ భేటీ అనంతం కుమారస్వామి సీఎం కేసీఆర్ తో భేటీ అయ్యారు. ప్రగతి భవన్ కు చేరుకున్న ఆయనను సీఎం కేసీఆర్ సాదరంగా ఆహ్వానించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలతో కుమార స్వామి..
జాతీయ పార్టీపై కేసీఆర్ ప్రకటన ఉండబోతుందన్న వార్తలు వస్తున్న తరుణంలో కుమారస్వామితో భేటీ కీలకంగా మారింది. కేసీఆర్ పెట్టబోయే జాతీయపార్టీపై ఆయనతో చర్చించినట్లు సమాచారం. కుమారస్వామి ప్రగతిభవన్ కు చేరుకోవడానికి ముందు ఓ హోటల్ లో కుమారస్వామితో మంత్రి కేటీఆర్‌తో పాటు ఎమ్మెల్యేలు జీవన్‌రెడ్డి, రాజేందర్ రెడ్డి సమావేశం అయ్యారు. దేశంలో తాజా రాజకీయాలతో ఈ సమావేశంలో చర్చించారు. సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ పెట్టబోతున్నారు. ఇప్పటికే ఆ పార్టీ క్యాడర్ కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని తీర్మానాలు కూడా చేస్తున్నాయి. కేంద్రంతో పోరాడాలంటే జాతీయ పార్టీ తప్పనిసరి భావిస్తున్న కేసీఆర్ ఆ దిశగా అడుగులు వేస్తున్నారు. 2024లో కేంద్రంలో బీజేపీయేతర పార్టీలు విజయం సాధించాలనే లక్ష్యంతో ఇప్పటికే పలు రాష్ట్రాల ముఖ్యమంత్రులతో భేటీ అయ్యారు.