Telangana  Government Kaleshwaram Report: కాళేశ్వరం ప్రాజెక్టు అవకతవకలపై వెలువడిన హైకోర్టు తీర్పు తెలంగాణ రాజకీయాల్లో పెను సంచలనాన్ని సృష్టించింది. చట్టబద్ధతకూ, సహజ న్యాయసూత్రాలకూ మధ్య జరిగిన ఈ న్యాయపోరాటం ఇటు ప్రభుత్వానికి, అటు బీఆర్ఎస్ అగ్రనేతలకు చెరో సగం విజయాన్ని, చెరో సగం ఆందోళనను మిగిల్చింది. ఇప్పుడు ప్రభుత్వం ఏం చేయబోతోందన్నది ఆసక్తికరమైన అంశంగా మారింది. 

Continues below advertisement

కేసీఆర్, హరీష్‌లకు ఊరట

కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ సమర్పించిన నివేదిక ఆధారంగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి హరీష్ రావులపై ప్రభుత్వం తక్షణమే ఎటువంటి కఠిన చర్యలు తీసుకోకుండా హైకోర్టు బ్రేక్ వేసింది. విచారణా చట్టం సెక్షన్ 8బి ప్రకారం, నివేదికలో ఎవరినైనా బాధ్యులుగా పేర్కొనే ముందు వారి వివరణ కోరడం తప్పనిసరి. అయితే, సదరు నిందితుల వాదన వినకుండానే దోషులుగా తేల్చడం సహజ న్యాయసూత్రాలకు  విరుద్ధమని ధర్మాసనం అభిప్రాయపడింది. ఈ సాంకేతిక లోపం కారణంగా నివేదికలోని చర్యల భాగం ప్రస్తుతానికి అమలుకు వీలులేనిదిగా మారిపోయింది, ఇది బీఆర్ఎస్ అగ్రనేతలకు పెద్ద ఊరటనిచ్చింది.

Continues below advertisement

 కమిషన్ ఏర్పాటు సబబే 

ప్రభుత్వానికి ఈ తీర్పు కొంత మేర చేదును మిగిల్చినప్పటికీ, మరో కోణంలో చట్టబద్ధమైన విజయాన్ని అందించింది. కాళేశ్వరం అక్రమాలపై విచారణకు జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్‌ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన  జీఓ నంబర్ 6ను హైకోర్టు సమర్థించింది. కమిషన్ ఏర్పాటులో ఎటువంటి రాజ్యాంగ ఉల్లంఘనలు లేవని, అవకతవకలపై విచారణ జరిపే పూర్తి అధికారం ప్రభుత్వానికి ఉందని స్పష్టం చేసింది. దీనివల్ల కమిషన్ నిర్వహించిన విచారణ ప్రక్రియకు గుర్తింపు లభించినట్లయింది, ఇది భవిష్యత్తులో ప్రభుత్వం తీసుకునే తదుపరి చర్యలకు ఒక బలమైన పునాదిగా నిలుస్తుంది.   విచారణ చట్టబద్ధతను కోర్టు అంగీకరించడం బీఆర్ఎస్ పార్టీకి ఆందోళన కలిగించే అంశం. మరోవైపు, అక్రమాలను నిరూపించే నివేదిక ఉన్నప్పటికీ, ప్రక్రియ లోపాల వల్ల రాజకీయంగా మైలేజ్ పొందలేకపోవడం కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రతిబంధకంగా మారింది.  

 సుప్రీంకోర్టుకు రాష్ట్ర ప్రభుత్వం

హైకోర్టు లేవనెత్తిన సాంకేతిక అంశాలపై వెనక్కి తగ్గకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సాక్ష్యాధారాలతో కూడిన కమిషన్ నివేదికను కేవలం  నోటీసుల  కారణంతో పక్కన పెట్టడం సరికాదని న్యాయ నిపుణులతో ప్రభుత్వం చర్చలు జరుపుతోంది. ఈ కారణంగా హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ  సుప్రీంకోర్టును ఆశ్రయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించుకుంది. కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంచారు. 

 సవరణలతో కొత్త నివేదిక?

హైకోర్టు తీర్పుతో కేసీఆర్, హరీష్ రావులకు ముప్పు పూర్తిగా తొలగిపోయిందని భావించలేరని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ సుప్రీంకోర్టులో చుక్కెదురైతే, ప్రభుత్వం మరో వ్యూహాన్ని సిద్ధం చేస్తోంది. హైకోర్టు సూచించినట్లుగా నిందితులకు నోటీసులు ఇచ్చి, వారి వాదనలు విన్న తర్వాత సవరించిన నివేదికను సమర్పించేలా కమిషన్‌కు అదనపు గడువు ఇచ్చే అవకాశం ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో విచారణ మళ్లీ మొదటికి వస్తుంది తప్ప, బాధ్యత నుండి తప్పించుకోవడం సాధ్యం కాదని ప్రభుత్వం గట్టిగా నమ్ముతోంది.  ఈ న్యాయపోరాటం ఇప్పుడు అత్యంత ఉత్కంఠభరితమైన దశకు చేరుకుంది. తదుపరి పోరాటం ఢిల్లీలోని సుప్రీంకోర్టు వేదికగా సాగుతుందాస కొత్త నివేదిక రూపంలో రాష్ట్రంలోనే కొనసాగుతుందా అన్నది ప్రభుత్వ వ్యూహంపై ఆధారపడి ఉంటుంది.