Extension of deadline for receiving ration: తెలంగాణలోని రేషన్ కార్డుదారులకు ఊరటనిస్తూ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ నెలకు సంబంధించి రేషన్ పంపిణీ గడువును ఈ నెల 30వ తేదీ వరకు పొడిగించింది. సాధారణంగా నెల మధ్యలోనే ముగిసే పంపిణీ గడువును, ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా నెలాఖరు వరకు పెంచుతూ పౌరసరఫరాల శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.  త్రిపుల్  ధమాకా.. ఒకేసారి మూడు నెలల కోటా                       

Continues below advertisement

వేసవిలో ఎండల తీవ్రత పెరగడం, రాబోయే నెలల్లో వడగాల్పుల ముప్పు ఉండటంతో లబ్ధిదారులు ప్రతి నెలా షాపుల వద్ద క్యూ కట్టకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంది. ఇందులో భాగంగా ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించిన కోటాను మొత్తం 18 కేజీల సన్నబియ్యం - నెలకు 6 కేజీల చొప్పున ఈ నెలలోనే ఒకేసారి పంపిణీ చేస్తోంది. దీనివల్ల లబ్ధిదారులు మే, జూన్ నెలల్లో ఎండలో ఇబ్బంది పడాల్సిన అవసరం ఉండదు.                                       

  ఆందోళన వద్దు 

Continues below advertisement

మూడు నెలల సరుకులు ఒకేసారి ఇస్తుండటంతో, ఇప్పుడు తీసుకోకపోతే మళ్ళీ దొరకవేమోనన్న ఆందోళనతో లబ్ధిదారులు భారీగా రేషన్ షాపులకు తరలివస్తున్నారు. దీనివల్ల సర్వర్లపై ఒత్తిడి పెరిగి ఈ-పోస్ (e-PoS) యంత్రాలు మొరాయిస్తున్నాయి. ఈ రద్దీని గమనించిన ప్రభుత్వం, లబ్ధిదారులు కంగారు పడాల్సిన పనిలేదని, ఈ నెల 30 వరకు ఎప్పుడైనా సరుకులు తీసుకోవచ్చని స్పష్టం చేసింది.

 ప్రభుత్వ వ్యూహం - గోదాముల నిర్వహణ 

ఈ భారీ పంపిణీ వెనుక మరో వ్యూహాత్మక కారణం కూడా ఉంది. కొత్త సీజన్ ధాన్యం సేకరణ  ప్రారంభమవుతున్న తరుణంలో, గోదాముల్లో ఉన్న పాత నిల్వలను ఖాళీ చేసి కొత్త ధాన్యానికి చోటు కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు సరుకుల నిర్వహణను సులభతరం చేయడానికి ఈ  అడ్వాన్స్ పంపిణీ ప్రక్రియను చేపట్టింది.

రేషన్ కార్డు దారులకు కీలక సూచనలు మూడు నెలల కోటా కోసం మూడుసార్లు వేలిముద్ర వేయాల్సిన అవసరం లేదు. ఒక్కసారి ధృవీకరణతోనే మూడు నెలల సరుకులు పొందవచ్చు.   గడువు నెలాఖరు వరకు ఉన్నందున, ఉదయం వేళల్లో కాకుండా రద్దీ తక్కువగా ఉండే సమయాల్లో వెళ్లి సరుకులు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ప్రభుత్వం ఈసారి కూడా నాణ్యమైన  సన్నబియ్యాన్ని   పంపిణీ చేస్తోంది, కాబట్టి నిల్వ చేసుకున్నా పాడవుతాయన్న భయం అక్కర్లేదు.    

ప్రభుత్వం తీసుకున్న ఈ గడువు పొడిగింపు నిర్ణయం వల్ల రాష్ట్రంలోని సుమారు 1.05 కోట్ల రేషన్ కార్డుదారులకు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత పేదలకు మరియు వృద్ధులకు పెద్ద ఉపశమనం లభించనుంది.