Godavari Express Derailment: విశాఖపట్నం నుంచి హైదరాబాద్ డెక్కన్ మధ్య నడిచే గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ రైలుకు త్రుటిలో పెద్ద ప్రమాదం తప్పింది. బీబీ నగర్ (BB Nagar) సమీపంలో రైలు పట్టాలు తప్పింది. బుధవారం (ఫిబ్రవరి 15) తెల్లవారుఝామున ఈ ఘటన జరిగింది. రైలు వెనక భాగంలో దాదాపు ఆరు బోగీలు పట్టాలు తప్పినట్లు తెలుస్తోంది. ముందు భాగంలో ఇంజిన్ తర్వాత 10 బోగీల వరకూ పట్టాలపైనే ఉన్నాయి. చివర్లో జనరల్ భోగీ దెబ్బ తిన్నట్లుగా తెలుస్తోంది. రైలు పట్టాలు కిలో మీటర్ల మేర దెబ్బ తిన్నట్లుగా రైలులోని ప్రయాణికులు చెబుతున్నారు. ఆయిల్ లీకవ్వడం, ఆటోమేటిక్ బ్రేక్ పడడమే ప్రమాదానికి కారణమని సమాచారం. 


ఊహించని ఘటనతో రైలులోని ప్రయాణికులంతా భయాందోళనకు గురయ్యారు. ఏం జరుగుతుందో తెలియక హాహాకారాలు చేశారు. రైలు వేగం తక్కువగానే ఉండటంతో లోకో పైలట్‌ వెంటనే ట్రైన్‌ను నిలిపివేశారు. దీంతో ప్రయాణికులంతా రైలులోంచి కిందకు దిగేశారు.ప్రమాదంలో పలువురు స్వల్పంగా గాయపడ్డారు. బోగీలు పట్టాలు తప్పినప్పటికీ.. కిందపడకపోవడంతో ప్రాణాలతో బయటపడ్డామని ప్రయాణికులు వెల్లడించారు. ఘటనలో అందరూ సురక్షితంగా బయటపడ్డట్లు రైల్వే అధికారులు వెల్లడించారు. ప్రయాణికులందరినీ గమ్యస్థానాలకు చేర్చినట్లు తెలిపారు. ఇదిలా ఉండగా.. ప్రమాదంతో ఆ మార్గంలో వెళ్లే రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.


పట్టాలు తప్పిన బోగీలను వదిలి రైలు బయల్దేరింది. ఎస్‌-5 నుంచి చివరివరకూ బోగీలు పట్టాలు తప్పగా వాటిని వదిలి, మిగిలిన బోగీలతో రైలుకు అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.


Godavari Superfast Express: విశాఖపట్నం, హైదరాబాద్ మధ్య గోదావరి సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (12727) రాకపోకలు సాగిస్తుంటుంది. విశాఖలో సాయంత్రం 5.20కి బయల్దేరి మరుసటి రోజు ఉదయం 6.15కు నాంపల్లి స్టేషన్‌లో గమ్య స్థానానికి చేరుకుంటుంది. సికింద్రాబాద్‌కు తెల్లవారుజామున 5.10కి చేరుకుంటుంది. ఈ రైలులో కొన్ని వందల మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తుంటారు.






సమాచారం అందుకోగానే వెంటనే రైల్వే సిబ్బంది అక్కడకు చేరుకుని మరమ్మతులు చేపట్టారు. ట్రాక్‌ రిపేర్ ప్రక్రియను కొనసాగిస్తున్నారు. ట్రాక్ కిలో మీటర్ల మేర దెబ్బ తినడంతో ఆ మార్గంలో రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పలు రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. గోదావరి ఎక్స్‌ప్రెస్‌లోని ఎస్‌ -1, ఎస్‌ -2, ఎస్‌ - 3, ఎస్ - 4తో పాటు రెండు జనరల్ బోగీలు పట్టాలు తప్పాయి. అయితే అధునాతన రైల్వే బోగీలు కావడంతో పెను ప్రమాదం తప్పిందని అంటున్నారు. ఎల్‌హెచ్‌సీ సాంకేతికత ఆధారంగా కొత్త బోగీలు తయారు చేశారు. పట్టాలు తప్పిన ఆరు బోగీలను తిరిగి పట్టాల మీదకు తెచ్చి తరలించేందుకు రైల్వే అధికారులు ప్రయత్నాలు చేస్తున్నారు. పట్టాలు తప్పిన ఆరు భోగిల్లో నాలుగు రిజర్వేషన్ బోగీలు ఉన్నాయి. ప్రయాణికుల కోసం అధికారులు ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ఏర్పాటు చేశారు.