Former MP Jitender Reddy joined the Congress party: హైదరాబాద్: లోక్‌సభ ఎన్నికల వేళ మహబూబ్ నగర్ మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి బీజేపీకి షాకిచ్చారు. బీజేపీకి రాజీనామా చేసిన జితేందర్ రెడ్డి తాజాగా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇంఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు. మహబూబ్ నగర్ ఎంపీ సీటు ఆశించి భంగపడ్డ జితేందర్ రెడ్డి కాషాయ పార్టీని వీడాలని నిర్ణయించుకున్నారు. డీకే అరుణకు బీజేపీ అధిష్టానం ఛాన్స్ ఇవ్వడంతో కాంగ్రెస్ లో చేరాలని నిర్ణయం తీసుకున్న ఆయన.. బీజేపీని వీడి కుమారుడు మిథున్ రెడ్ఢిలో కలిసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు మహబూబ్ నగర్ ఎంపీ అభ్యర్థి వంశీచంద్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.






ఇటీవల జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఆహ్వానించడంతో హస్తం గూటికి చేరుకున్నారు. కాంగ్రెస్ లో చేరిన కొన్ని గంటల్లోనే ఆయనను కీలక పదవి వరించింది. మాజీ ఎంపీ జితేందర్ రెడ్డిని న్యూఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి, తెలంగాణ ప్రభుత్వ సలహాదారుగా (క్రీడా వ్యవహారాలు) రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు సంబంధించిన ఉత్తర్వులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి శుక్రవారం (మార్చి 15న) రాత్రి జారీ చేశారు. మల్లు రవి ఇటీవల ఆ పదవికి రాజీనామా చేయడం తెలిసిందే. దాంతో పార్టీలో చేరిన వెంటనే పాలమూరు జిల్లాకే చెందిన మరోనేత జితేందర్ రెడ్డికి తెలంగాణ ప్రభుత్వం పదవి ఇచ్చింది. క్యాబినేట్ ర్యాంక్‌తో తెలంగాణ ప్రభుత్వ క్రీడా వ్యవహరాల సలహాదారుడిగా జితేందర్ రెడ్డి నియమితులయ్యారు. 


వరుసగా రెండు ఎన్నికల్లో నో టికెట్.. 
2019 ఎన్నికల సమయంలో జితేందర్ రెడ్డికి అప్పటి సీఎం కేసీఆర్ టిక్కెట్ నిరాకరించారు. సిట్టింగ్ ఎంపీగా ఉన్న ఆయనకు టిక్కెట్ ఇవ్వకపోవడంతో వెంటనే బీజేపీలో చేరారు. బీజేపీ అప్పటికే డీకే అరుణకు టిక్కెట్ ఖరారు చేసింది. దీంతో ఆయన ఎన్నికల్లో పోటీ చేయకుండా డీకే అరుణ కోసం ప్రచారం చేశారు. స్వల్ప తేడాతో డీకే అరుణ ఓడిపోయారు. అయితే ఆ తర్వాత ఎంపీ టిక్కెట్ కోసం ఇద్దరు నేతలు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఒకరిని అసెంబ్లీకి పోటీ చేయించేందుకు హైకమాండ్ ప్రయత్నించింది. కానీ ఇద్దరూ పోటీ చేయలేదు. మహబూబ్ నగర్ అసెంబ్లీ స్థానం నుంచి జితేందర్ రెడ్డి కుమారుడు మిథున్ రెడ్డికి చాన్సిచ్చారు. ఆయన ఓటమిచెందారు. ఈ క్రమంలో పాలమూరు ఎంపీ టిక్కెట్ కోసం కూడా జితేందర్ రెడ్డి ప్రయత్నించినా.. అధిష్టానం డీకే అరుణ వైపు మొగ్గుచూపింది. గత ఎన్నికల్లో డీకే అరుణ స్వల్ప తేడాతోనే ఓటమి చెందడంతో మరోసారి ఆమెకు ఛాన్స్ ఇచ్చింది.