Justice Narasimha Reddy: బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో జరిగిన విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందంపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ కు మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి(Jagadish reddy)  మెయిల్ ద్వారా లేఖ రాశారు.  శనివారం తెలంగాణ భవన్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన రాసిన లేఖపై వివరణ ఇచ్చారు. కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహా రెడ్డి  మీడియా సమావేశం పెట్టి లీకులు ఇవ్వడంపై లేఖ ద్వారా ఆయన అభ్యంతరం వ్యక్తం చేసినట్లు జగదీష్ రెడ్డి తెలిపారు.  


రాష్ట్రం విడిపోయిన సమయంలో తెలంగాణలో ఉన్న విద్యుత్‌ అవసరాలు, దక్షిణాది రాష్ట్రాల మధ్య నెలకొన్న పోటీ వాతావరణాన్ని దృష్టిలో పెట్టుకొని ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంతో నాటి  ప్రభుత్వం అవగాహన ఒప్పందం చేసుకుందన్నారు. ఆనాటి కేంద్ర ప్రభుత్వ విద్యుత్ చట్టం - 2003 ప్రకారం పీజీసీఐఎల్‌ నిబంధనలకు లోబడే ఈ ఒప్పందాలు జరిగాయన్నారు. రాష్ట్ర అభివృద్ధికి ఈ ఒప్పందాలు దోహదపడ్డాయే గానీ, వాటి వల్ల ఎలాంటి నష్టం జరుగలేదన్నారు.  


కేసీఆర్ పై నిందలు మోపాలన్న ఉద్దేశంతోనే.. 
ఛత్తీస్‌గఢ్ నుండి 3.90 పైసలకు విద్యుత్ కొనుగోలు చేశామని తెలిపారు. అప్పట్లో ప్రభుత్వ రంగ సంస్థల నుండి రూ.17కు విద్యుత్ కొనుగోలు చేసే పరిస్థితి ఉండేదన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన కొత్తలో విద్యుత్ విషయంలో ఇరుకున పెట్టాలని టీడీపీ అధినేత చంద్రబాబు కుటిల యత్నాలు చేశారని తెలిపారు. ఏడు మండలాలను ఆంధ్రాకు తీసుకుని సీలేరు పవర్ ప్రాజెక్టును ఏపీలో కలుపుకున్నట్లు ఆరోపించారు.  పీజీసీఎల్‌లో వాటా ఉండాలంటే ఏదో ఒక సంస్థతో విద్యుత్ ఒప్పందం ఉండాలన్నారు. తెలంగాణ తీసుకున్నప్పుడే తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలు కూడా 4.90 పైసలు చెల్లించి విద్యుత్ కొనుగోలు చేశాయని జగదీష్ రెడ్డి వివరించారు. తమ పార్టీ అధినేత కేసీఆర్‌ను నిందించాలన్న ఉద్దేశంతోనే ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.  


డిమాండ్ మేరకే ప్రాజెక్టుల నిర్మాణం
రాష్ట్రంలో నెలకొన్న విద్యుత్ డిమాండ్ మేరకు విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి కేసీఆర్ శ్రీకారం చుట్టారన్నారు.  భద్రాద్రి 800 మెగావాట్లతో సూపర్ క్రిటికల్ టెక్నాలజీ, యాదాద్రి సబ్ క్రిటికల్ టెక్నాలజీతో పవర్ ప్లాంట్ల నిర్మాణం చేపట్టినట్లు తెలిపారు. తక్కువ కాలంలో నిర్మాణం పూర్తి చేస్తామనడంతోనే  కొత్తగూడెంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు, మణుగూరులో నాలుగు 270 మెగావాట్ల ప్రాజెక్టుల నిర్మాణం బీహెచ్‌ఈఎల్‌ కు అప్పగించినట్లు జగదీష్ రెడ్డి చెప్పారు. రైతులకు 24 గంటల విద్యుత్‌, పెరుగుతోన్న విద్యుత్‌ డిమాండ్లను దృష్టిలో పెట్టుకొనే నల్గొండ జిల్లా దామరచర్లలో 4వేల మెగావాట్ల అల్ట్రా మెగా పవర్‌ప్లాంట్‌ నిర్మాణానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. 


పవర్ కమిషన్ తప్పుడు సంకేతాలిస్తుంది
కేంద్ర ప్రభుత్వం చేతుల్లోనే బొగ్గు కేటాయింపు ఉందన్నారు. ప్రతి పవర్ ప్లాంట్ కచ్చితంగా 10 శాతం విదేశీ బొగ్గును వాడాలని కేంద్రం రూల్ పెట్టిందన్నారు.  సింగరేణి బొగ్గు ఉండటం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరుఫున తాము ఒప్పుకోలేదన్నారు.  కొత్తగూడెం థర్మల్ పవర్ ప్లాంట్ నిర్మాణాన్ని తక్కువ రేటుకు ఇస్తే.. ఏపీ ప్రభుత్వం ఎక్కువ రేటుకు ఇచ్చిందన్నారు. విద్యుత్ విచారణ కమిషన్ ప్రజలకు తప్పుడు సంకేతం ఇచ్చే ప్రయత్నం చేసిందని జగదీష్ రెడ్డి ఆరోపించారు. విద్యుత్ కొనుగోళ్లలో రూ.6000 కోట్ల నష్టం జరిగిందని తప్పుడు ప్రచారం చేశారన్నారు. ఛత్తీస్‌గఢ్ నుండి కేసీఆర్ ఒక్కరే ఒప్పందం కుదుర్చుకోలేదని..  కేసీఆర్, రమణ్ సింగ్ ల మధ్య  విద్యుత్ కొనుగోళ్ల ఒప్పందం జరిగిందన్నారు. విచారణ కమిషన్ సరిగా లేదని తను రాసిన లేఖలో పేర్కొన్నట్లు తాను రాసిన లేఖలో పేర్కొన్నట్లు జగదీష్ రెడ్డి తెలిపారు.