Chittaranjan Dass likely to Join BJP: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. మరో రెండు నెలలు మాత్రమే టైమ్ ఉండటంతో పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా ప్రయత్నాలు మొదలుపెట్టాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి ప్రతిపక్ష పార్టీల కంటే ఒక అడుగు ముందు ఉండగా.. కాంగ్రెస్ ఇప్పటికే దాదాపు అభ్యర్థులను ఖరారు చేసింది. బీజేపీ ఇప్పటికే ఆశావాహుల నుంచి దరఖాస్తులు స్వీకరించగా.. అభ్యర్థుల ఎంపికపై కసరత్తు చేస్తోంది. పార్టీలన్నీ అభ్యర్థుల ఎంపికను షూరూ చేస్తుండగా.. ఈ సమయంలో టీ పాలిటిక్స్‌లో వలసలు పెరిగిపోయాయి.


బీఆర్ఎస్‌లో అసంతృప్తిగా ఉన్న నేతలు కాంగ్రెస్, బీజేపీలోకి క్యూ కడుతున్నారు. అందులో భాగంగా తాజాగా బీఆర్ఎస్‌కు మరో బిగ్ షాక్ తగిలింది. మాజీ మంత్రి చిత్తరంజన్ దాస్ బీఆర్ఎస్‌కు రాజీనామా చేశారు. ఈ మేరకు శుక్రవారం తన రాజీనామా లేఖను సీఎం కేసీఆర్‌కు పంపించారు. ఇవాళ తన నివాసంలో అనుచరులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ భేటీలో రాజీనామా చేస్తున్నట్లు ఆయన ప్రకటించారు. అనంతరం బీఆర్ఎస్ అధిష్టానానికి రాజీనామా లేఖను పంపారు.


చిత్తరంజన్ దాస్ రాజీనామా చేయడం బీఆర్ఎస్‌కు పెద్ద షాక్ అని చెప్పవచ్చు. అయితే ఆయన బీజేపీలో చేరాలని నిర్ణయించుకున్నారు. అక్టోబర్ 1న తెలంగాణ పర్యటనకు ప్రధాని మోదీ రానుండగా.. ఇప్పటికే భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. మహబూబ్‌నగర్‌లో బీజేపీ నిర్వహించే భారీ బహిరంగ సభలో మోదీ మాట్లాడనున్నారు. ఈ సందర్బంగా మోదీ సమక్షంలో చిత్తరంజన్ దాస్ కాషాయ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇటీవల బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డితో చిత్తరంజన్ దాస్ భేటీ అయ్యారు. పార్టీలోకి రావాలని కిషన్ రెడ్డి ఆహ్వానించగా.. అందుకే చిత్తరంజన్ దాస్ ఓకే చెప్పారు. 


చిత్తరంజన్ దాస్‌కి తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో ప్రత్యేకమైన పేరు ఉంది. టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావును కల్వకుర్తిలో ఆయన ఓడించారు. 1989 అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎన్టీఆర్ పోటీ చేయగా.. కాంగ్రెస్ తరపున చిత్తరంజన్ దాస్ పోటీ చేసి గెలుపొందారు. దీంతో ఎన్టీఆర్‌ను ఓడించిన నేతగా ఆయనకు పేరుంది.  అయితే ఆ తర్వాత మారిన రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్‌లో చేరారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి కల్వకుర్తి టికెట్ ఆయన ఆశించారు. కానీ కేసీఆర్ విడుదల చేసిన తొలి జాబితాలో కల్వకుర్తి బీఆర్ఎస్ టికెట్‌ను మరోసారి సిట్టింగ్ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్‌కే కేటాయించారు. దీంతో బీఆర్ఎస్‌ అధిష్టానంపై గత కొంతకాలంగా చిత్తరంజన్ దాస్ అసంతృప్తితో ఉన్నారు.


వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా బరిలోకి దిగాలనే ఆలోచనలో చిత్తరంజన్ దాస్ ఉన్నారు. ఈ క్రమంలో బీజేపీ నుంచి ఆఫర్ రావడంతో ఆ పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారు.  తుంగతుర్తి టికెట్‌ను ఆయన బీజేపీ ఆఫర్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ హామీతోనే బీజేపీలో చేరుతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బీఆర్ఎస్, బీజేపీ నుంచి చాలామంది నేతలు కాంగ్రెస్‌లో చేరుతున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. కానీ చిత్తరంజన్ దాస్ బీజేపీలో చేరడం గమనార్హం.