Floods to Kadem Project: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో నిర్మల్‌ జిల్లాలోని కడెం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతోంది. పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరడంతో జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. అంటే 700 అడుగులకు చేరుకుంది. ప్రస్తుతం ఎగువ నుంచి 13 వేల 320 క్యూసెక్కుల నీరు వస్తుండగా... నీటిమట్టం 696.520 అడుగులకు చేరుకుంది. విషయం గుర్తించిన అధికారులు 3 క్రస్టు గేట్లను ఎత్తి 29 వేల 889 క్యూసక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.  ప్రాజెక్టుకు మొత్తం 18  గేట్లు ఉండగా... ఇన్ ఫ్లో మరింత పెరిగితే మరిన్ని గేట్లను ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తారు. గేట్లను ఎత్తక ముందే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లో ప్రాజెక్టు దరిదాపుల్లోకి రాకూడదని వివరించారు. 


రెండు నెలల క్రితం సాంకేతిక సమస్యలతో తెరుచుకోని కడెం ప్రాజెక్టు గేట్లు


నిర్మల్ జిల్లా కడెం ప్రాజెక్ట్‌కు జులై నెలలో భారీ వరదలు పోటెత్తాయి. ప్రమాద స్థాయిలో నీరు ప్రాజెక్టు గేట్ల పైనుంచి ప్రవహించింది. ప్రాజెక్టు గేట్లు కూడా సాంకేతిక సమస్యలు ఎదురై తెరుచుకోలేదు. దీంతో ప్రాజెక్టును సెంట్రల్, స్టేట్ డ్యాం సేఫ్టీ (CDSO,SDSO) టీం పరిశీలించింది. 24 మందితో కూడిన బృందం సభ్యులు కడెం ప్రాజెక్టు వద్దకు చేరుకొని విచారణ చేపట్టారు. కడెం ప్రాజెక్టుకు గత సంవత్సరం జులై మాసంలో భారీ వరదలు వచ్చినప్పుడు గేట్లు పాడయిపోయాయి. గేట్లు కౌంటర్ వేట్లు దెబ్బతిన్నట్టు అధికారులు చెప్పారు. సంవత్సరకాలం గడిచిన మరమ్మత్తులు పూర్తి కాకపోవడంతో మళ్లీ సమస్య ఎదురైంది. దాదాపు అదే స్థాయిలో కడెం ప్రాజెక్టుకు జులై 27వ తేదీన భారీ వరద వచ్చింది. అన్ని గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడిచి పెట్టేందుకు అధికారులు తీవ్రంగా శ్రమించాల్సి వచ్చింది. ప్రాజెక్టుకు ఉన్న 18 గేట్లను ఎత్తేందుకు ప్రయత్నించారు. అయితే అందులో నాలుగు గేట్లు తెరుచుకోలేదు. చాలా సమయం తర్వాత అందులో రెండు గేట్లు తెరుచుకున్నాయి. మరో రెండు గేట్లు పూర్తిగా తెరుచుకోలేదు. తెరుచుకున్న 16 గేట్లలో 11 మాత్రమే ఎలక్ట్రికల్ మోటార్ల ద్వార లిఫ్ట్ అయ్యాయి. మిగతా ఐదు గేట్లు స్థానిక యువకుల సహాయంతో జెసిబితో చెత్త తొలగించి ఎత్తే పరిస్థితులు ఎదురయ్యాయి. చివరకు 18 గేట్లలో 16 గేట్లు మాత్రమే ఎత్తి నీటిని విడిచి పెట్టారు. 


కడెం ప్రాజెక్టు గేట్ల లిఫ్టింగ్‌లో గత రెండు ఏళ్లుగా ఇదే పరిస్థితి ఎదురవుతుంది. కడెం ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 700 అడుగులు కాగా గురువారం ఒక్కరోజే దాదాపు 703 అడుగులకు చేరుకుంది. దీంతో ప్రాజెక్టు గేట్లై నుంచి నీరు ఓవర్‌ఫ్లో అయింది. అప్రమత్తమైన అధికారులు కడెం ప్రాంత ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ప్రాజెక్టు గేట్లు తెరవకపోవడం, నీరు ఓవర్‌ ఫ్లో కావడంతో డ్యాం సేఫ్టీ అధికారులు స్పందించారు. సీడబ్ల్యూసీ మాజీ ఛైర్మన్ & డ్యాం సేఫ్టీ నిపుణులు ఏ.బి పాండ్య అధ్వర్యంలో 24 మంది బృందం ప్రాజెక్టును పరిశీలించారు. స్థితిగతులను చూశారు. భారీ వరదలకు ప్రాజెక్టు తట్టుకునే పరిస్థితుల్లో ఉందో లేదో ప్రాజెక్టు సేఫ్టీ మేజర్స్ గెట్లలో ఎదురైన సమస్యలు, కోతకు గురైన ప్రాంతాలను సెంట్రల్,స్టేట్ డ్యాం సెప్టీ CDSO, SDSO బృందం సభ్యులు పరిశీలించారు.