Farmer Suicide In Telangana | హైదరాబాద్: వ్యవసాయం చేస్తున్న రైతులకు ఎన్నో నష్టాలు వస్తున్నాయని, అతికష్టమ్మీద పంట పండిస్తే దానికి మద్దతు ధర రాదని ఆవేదన వ్యక్తం చేస్తూ కౌలు రైతు బానోతు వీరన్న ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభుత్వమే రైతులను ఆదుకోవాలని, ఎక్కువ మద్దతు ధర ఇవ్వాలని, సబ్సిడీలు ఇచ్చి ఆదుకోవాలని.. తమకు ఆత్మహత్యలు తప్ప మరో మార్గం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ బానోతు వీరన్న సెల్ఫీ వీడియోలో ఆవేదన వ్యక్తం చేశారు. పురుగుల మందు తాగిన తరువాత తమ బాధను చెప్పుకుంటూ తీసిన సెల్ఫీ వీడియో వైరల్ అవుతోంది. రైతు ఆత్మహత్యలకు కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
రైతు ఆత్మహత్య బాధాకరమన్న హరీష్ రావు
ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో కౌలు రైతు బానోతు వీరన్న పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకోవడం అత్యంత బాధాకరం అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పురుగుల మందు తాగుతూ.. పండించిన పంటకు ధర రాక, అప్పులు తీర్చే దారిలేక చనిపోతున్నానని.. మద్దతు ధర కల్పించాలని వీరన్న తీసుకున్న సెల్ఫీ వీడియో కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు చేసిన మోసాలకు నిదర్శనం అని విమర్శించారు.
ఇది ప్రభుత్వ హత్యే..
కౌలు రైతు వీరన్నది ఆత్మహత్య కాదు, ప్రభుత్వం చేసిన హత్య. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయని కారణంగా ఆర్థిక తోడ్పాటు లేక, అప్పులు భారమై రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఎన్నికలకు ముందు కౌలు రైతులకు ఏడాదికి రూ. 15,000 రైతుభరోసా ఇస్తామని బాండ్లు రాసిచ్చి, ఓట్లు వేశాక రైతులను మోసం చేయడం దుర్మార్గం.
పండించిన పంటను కొనే దిక్కులేక, మద్దతు ధర రాక, దళారుల దోపిడీకి రాష్ట్ర వ్యాప్తంగా రైతులు బలవుతున్నారు. సెల్ఫీ వీడియోలో రైతు వీరన్న చెప్పిన మాటలకైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి చలనం వస్తుందా?. ఇచ్చిన హామీ ప్రకారం కౌలు రైతులకు ఎప్పుడు రైతు భరోసా ఇస్తారు. ఇంకెంత మంది రైతులను బలి తీసుకుంటారు?’ అని హరీష్ రావు ప్రశ్నించారు.
సీఎం రేవంత్ రెడ్డి రేపు ఖమ్మం జిల్లా పర్యటనలో కౌలు రైతు బానోతు వీరన్న కుటుంబాన్ని పరామర్శించాలని, ఆ కుటుంబానికి ఎక్స్ గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. రైతులు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోవద్దని, ఆత్మహత్యలకు పాల్పడవద్దని విన్నవిస్తున్నాం. కాంగ్రెస్ మేనిఫెస్టోలో రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేసేదాకా కలిసి పోరాటం చేద్దాం. రైతులకు అండగా బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది. తెలంగాణలో మళ్లీ వచ్చేది కేసీఆర్ ప్రభుత్వమే.. రైతులకు మళ్లీ మంచి రోజులు వస్తాయని’ హరీష్ రావు అన్నదాతలకు సూచించారు.