Telangana farmers anger: తెలంగాణలో రైతులు యూరియా కోసం ఆందోళనలు చేస్తున్నారు.  2025 ఖరీఫ్ సీజన్‌లో యూరియా ఎరువుల కొరత తీవ్రంగా మారింది. రైతులు తమ పంటలను కాపాడుకోవడానికి యూరియా కోసం  పడిగాపులు  పడుతున్నారు.  కొరతపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వివిధ జిల్లాల్లో ప్రదర్శనలు చేపడుతున్నారు.                     

వివిధ జిల్లాల్లో రైతులు యూరియా కొరతపై ఆందోళనలు చేపట్టారు. సిద్దిపేట్‌లో రవాణా మంత్రి పొన్నం ప్రభాకర్ క్యాంప్ ఆఫీసును ముట్టడించారు. వరంగల్‌లో రైతులు జాతీయ రహదారిని బ్లాక్ చేసి, వంట వార్పూ నిర్వహించారు. నాగర్‌కర్నూల్, కరీంనగర్, హుజురాబాద్ వంటి ప్రాంతాల్లో కూడా రైతులు రోడ్లపై పడుకుని, క్యూలలో చెప్పులు పెట్టి స్థానాలు రిజర్వ్ చేసుకుంటున్నారు. ఈ పరిస్థితుల్లో కొన్ని చోట్ల ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పోలీసులు కొన్ని చోట్ల రైతులను కట్టడి చేయడానికి కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తోంది.  

మహబూబాబాద్‌లో గ్రోమోర్ సెంటర్ పై రైతులు దాడి చేశారు. క్యూలైన్లలో రైతుల మధ్య కూడా తోపులాటలు జరిగి దాడి చేసుకుంటున్నారు. కొన్ని చోట్ల రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు చేపట్టారు. వారిపై పోలీసులు వేధింపులకు పాల్పడుతున్నారని విపక్ష పార్టీలు ఆరోపిస్తున్నాయి.  

అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి యూరియా కొరత లేదని, కేవలం పంపిణీ సమస్యలు మాత్రమే ఉన్నాయని అంటున్నారు. ఈ పంపిణీ సమస్యలను నియంత్రించడంలో కూడాప్రభుత్వం విఫలమవుతోది. రైతులకు సరైన సమాచారం అందకపోవడంతో వారంతా యూరియా కోసం పోలోమంటూ తరలి వస్తున్నారు.  అయితే యూరియా బ్లాక్ మార్కెట్ లో విరివిగా లభిస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి.  రూ.400కు  బ్లాక్ మార్కెట్ లో లభిస్తోంది. ఇది కూడా ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పలువురు ఆరోపిస్తున్నారు.  

 విపక్ష పార్టీలు పెద్ద ఎత్తున యూరియా సమస్యలపై విమర్శలు చేస్తున్నాయి. అయితే  దేశవ్యాప్తంగా యూరియా సమస్య ఉందని..  మెల్లగా అందరికీ అందుతోందని ప్రభుత్వ వర్గాలంటున్నాయి.